పవన్ దెబ్బకు జగన్ తుస్సుమనుట ఖాయం!

సంక్రాంతి తర్వాత తాను జిల్లాలలో పర్యటించబోతున్నట్లుగా మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొన్ని నెలలుగా ఊదరగొడుతున్నారు. తాను జిల్లాల్లో పర్యటించడం అనేది రాష్ట్ర ప్రజలకు చేస్తున్న మహోపకారం అయినట్లుగా ఆయన బిల్డప్ ఇస్తున్నారు. తాను జిల్లాలలో తిరుగుతానని, ప్రజల సమస్యలు నేరుగా తెలుసుకొని వాటిని పరిష్కరించడానికి పోరాటాలు సాగిస్తారని ఆయన ప్రగల్బాలు పలుకుతున్నారు. అయితే డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన తాజా ప్రకటనతో కొన్ని వారాలుగా జగన్మోహన్ రెడ్డి చేస్తున్న బూటకపు ప్రకటనలు ఒక్కసారిగా తుస్సుమనే వాతావరణం కనిపిస్తోంది.
వారానికి రెండు రోజులు ఒక్కొక్క జిల్లాలో పర్యటించి అక్కడి వారి నుంచి సమస్యలు తెలుసుకుంటానని ఒకవైపు ఖాళీగా ఉన్న మాజీ ముఖ్యమంత్రి చెబుతుంటే.. మరొకవైపు నెలలో కనీసం 14 రోజులపాటు ప్రజల మధ్యనే గడుపుతూ ప్రజల మధ్యనే తిరుగుతూ పరిపాలన సాగిస్తానంటూ పవన్ కళ్యాణ్ ప్రకటించడం ఆసక్తి కరం. ప్రజల సమస్యలు తెలుసుకోవడం పట్ల ఎవరికి ఎంత మాత్రం చిత్తశుద్ధి ఉన్నదో పవన్ ప్రకటనతో తేట తెల్లం అవుతున్నదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎలా వ్యవహరించారో అందరికీ తెలుసు. సామాన్య ప్రజలకు అయిదేళ్లలో ఏనాడూ ఆయనను కలిసి తమ బాధలు చెప్పుకునే అవకాశం దక్కలేదు. ఆయన వివిధ కార్యక్రమాలకోసం జిల్లాల్లో పర్యటించినా కూడా.. ఎన్నెన్ని నిషేధాజ్ఞల మధ్య ఆ పర్యటనలు జరిగేవో కూడా అందరికీ తెలుసు. రోడ్లకు ఇరువైపులా దుకాణాలు మూయించేసి, చెట్లను నరికించేసి, బారికేడ్లు కట్టి పరదాలు కట్టి.. ఎంత ప్రజాకంటకంగా జగన్ పర్యటనలు సాగాయో ప్రజలు చూశారు. అధికారం ఉడిగిపోయిన తర్వాత.. ప్రజలు ఛీకొట్టిన తర్వాత.. ఒక్కసారిగా ఖాళీ అయిపోయిన జగన్, ఇప్పుడు తగుదునమ్మా అంటూ జిల్లాల్లో వారానికి రెండు రోజులు పర్యటిస్తా అంటున్నారు.

అదే సమయంలో అధికారంలో ఉన్న పవన్ కల్యాణ్ నెలకు పద్నాలుగు రోజుల సమయాన్ని ప్రజల కోసం కేటాయిస్తా అంటున్నారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రజల కోసం వారి కష్టాలు తెలుసుకోవడం కోసం ఏమాత్రం సమయం కేటాయించలేని జగన్ దుర్మార్గపు వైఖరిని మరింత ఎత్తిచూపేలాగా పవన్ కల్యాణ్ ప్రయత్నం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో.. జగన్ చేసే జిల్లా పర్యటనలను తుస్సుమనడం ఖాయం అని అంతా అనుకుంటున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories