జగన్ భక్తుల కోసం జల్లెడ పడుతున్నారు!

జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న ఒక వివాదాస్పదమైన నిర్ణయం- చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారం చేసిన రోజున ఎలా జీవో గా రాగలిగింది. జీవో రావడంతో పాటు అది ఒక రహస్యంగానే మిగిలిపోయింది. సరిగ్గా నెలరోజుల చంద్రబాబు పాలన తర్వాత, అదే రహస్యం గెజిట్ ద్వారా బయటకు వచ్చింది. చంద్రబాబు ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడానికి జరిగిన కుట్ర అది. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, వారిని అపకీర్తి పాల్జేయడానికి అధికార యంత్రాంగంలో ఈ కుట్ర చేసిన వారు ఎవరు అనే ప్రశ్నలు సాధారణంగా ఎదురవుతుంటాయి. ప్రస్తుతానికి ఆ జీవోను నిలిపివేసినప్పటికీ, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇలాంటి దుర్మార్గాలు ముందు ముందు కూడా చోటు చేసుకోకుండా ఉండేందుకు తెలుగుదేశం దృష్టి సారిస్తోంది. వివిధ ప్రభుత్వ విభాగాలలో కీలక స్థానాలలో జగన్మోహన్ రెడ్డి భక్తులు ఎవరెవరు ఉన్నారో జల్లెడ పట్టే ప్రయత్నంలో సీఎంఓ ఉన్నది.

జగన్మోహన్ రెడ్డి 2019లో గెలవడానికి అనేక రకాల మాయమాటలతో రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టిన సంగతి అందరికీ తెలిసిందే. ఆ క్రమంలోనే తనను ముఖ్యమంత్రిగా చేస్తే గనుక కేవలం వారం రోజుల్లోగా కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని రద్దుచేసి పాత పెన్షన్ విధానం తీసుకువస్తానని జగన్ ఉద్యోగులను నమ్మించారు. వారందరితో ఓట్లు వేయించుకుని గెలిచారు. ఐదేళ్లు గడిచినా వారికి ఇచ్చిన మాట గురించి మాత్రం పట్టించుకోలేదు. పైగా సిపిఎస్ రద్దుచేసి దాని స్థానంలో వారు ఎవ్వరు ఇష్టపడని, దారుణంగా వ్యతిరేకిస్తున్న గ్యారెంటీడ్ పెన్షన్ విధానం తీసుకువస్తానంటూ రాయబారాలు నడిపారు క్యాబినెట్ తీర్మానం కూడా చేశారు అయితే జీవో రావడానికి ముందే జగన్ సర్కారు దిగిపోవాల్సి వచ్చింది.

నిజానికి ఈ అంశానికి అక్కడితో తెరపడిపోవాలి కానీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రమాణ స్వీకారం రోజునే ఆ పాత వ్యవహారానికి సంబంధించి జీవో విడుదలైంది. నెల తర్వాత గెజిట్ కూడా వచ్చింది. దీంతో ప్రభుత్వం మేలుకుంది. ఆ జీవోను తక్షణం నిలిపివేయాలని చంద్రబాబు నాయుడు ఆదేశించడం జరిగింది. రాష్ట్రంలో సిపిఎస్ కింద ఉన్న ఉద్యోగులకు తగు న్యాయం చేయడానికి సర్కారు ఆలోచిస్తుందని కూడా ఆయన మాట ఇచ్చారు. ఇదంతా బాగానే ఉన్నప్పటికీ ఉన్నతాధికారుల స్థాయిలో కోవర్టులు లేకుండా జగన్ భక్తులు లేకుండా ఇలాంటి పరిణామం జరగడం అసాధ్యం అని అందరూ అనుకుంటున్నారు. అందుకే వివిధ శాఖలలో ఉండే ఉన్నతాధికారుల్లో జగన్మోహన్ రెడ్డి భక్తులు ఎందరున్నారో వారు ఇంకా జగన్ తరఫున పనిచేస్తూ ప్రభుత్వం వెనుక గోతులు తవ్వే ప్రయత్నాలలో ఉన్నారో ఏమో గమనిస్తున్నారు. జగన్ పట్ల భక్తి ఉన్నప్పటికీ దానిని దాచుకుని తమ పని ఏదో తాము చేసుకుంటూ పోయే వారిని కూడా అప్రధాన్య పోస్టులకు తరలించే అవకాశం ఉంటుందని పలువురు భావిస్తున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories