ఇప్పుడు ఎవరు చచ్చిపోయారబ్బా? ఎవరి మరణాన్ని పురస్కరించుకుని ప్రజల గుండెలు ఆగిపోయాబ్బా? లేదా, తన ఓటమిని తట్టుకోలేక తన అభిమానులు చచ్చిపోతారని ఆయన ఆశించి వారికోసం ఓదార్పు యాత్ర పెట్టుకోవాలనుకుంటున్నారా? అని ఆశ్చర్యపోవద్దు. జగన్మోహన్ రెడ్డికి ‘ఓదార్పు యాత్ర’ అనే సెంటిమెంటు ఏమైనా ఉన్నదో ఏమో గానీ.. ఇప్పుడు పార్టీ అత్యంత కనిష్టస్థాయికి ఓడిపోయిన వెంటనే ఒక ఓదార్పుయాత్ర చేయాలని అనుకుంటున్నారు. ఏమని ఓదార్చాలి? ఎవరిని ఓదార్చాలి? ఇందుకు ఆయన ఒక ఎజెండా కూడా రెడీ చేసుకున్నారు.
జగన్మోహన్ రెడ్డికి దారుణమైన పరాజయం తర్వాత.. పాపం బుర్ర సరిగా పనిచేస్తున్నట్టు లేదు. ఎమ్మెల్యేలు కోట్లకు కోట్లు ఎన్నికలకోసం తగలేసి అత్యంత దారుణంగా ఓడిపోతే.. ఆయన ఎమ్మెల్సీలతో మీటింగు పెట్టుకుని వారికి స్ఫూర్తిని ఇవ్వడానికి ప్రయత్నించారు. ఎంపీలతో కూడా ఓ భేటీ వేశారు. కాగా రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేయడానికి తనకు సత్తువ, వయసు రెండూ ఉన్నాయని ఒక కామెడీ ప్రకటన కూడా చేశారు.
పాదయాత్ర సంగతి ఏమో గానీ.. ఓదార్పు యాత్రకు మాత్రం ఆయన రెడీ అవుతున్నారు. అందుకు ఆయన ప్రకటిస్తున్న ఎజెండా ఏమిటో తెలుసా? రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం కార్యకర్తల దాడుల్లో గాయపడిన వాళ్లను పరామర్శించేందుకు అట! ఇది పెద్ద డ్రామాలాగా కనిపిస్తోంది. ఉల్టాచోర్ కోత్వాల్ కో డాంటే అన్నట్టుగా కనిపిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం వాళ్లను కనిపిస్తే కనిపించినట్టుగా దారుణంగా కొట్టి దాడులు చేసినది వైసీపీ కార్యకర్తలు. ఎన్నికల రోజున, ఆ తర్వాత కొన్నిచోట్ల.. తెలుగుదేశం వారు కూడా ఏకపక్షమైన జగన్ దళాల దాడులను తట్టుకోలేక ప్రతిఘటిస్తే.. వారికి కూడా కొందరికి గాయాలయ్యాయి. అయితే.. ఇప్పుడు తెలుగుదేశం అధికారంలోకి రాగానే.. వారి దాడుల్లో గాయపడిన వారిని పరామర్శిస్తానంటూ జగన్మోహన్ రెడ్డి రెడీ అవుతున్నారు.
మొత్తానికి అధికారంలో ఉన్న అయిదేళ్లూ ఒక్క మనిషిని కూడా కలవకుండా.. ముసుగులో ఉంటూ బతికిన జగన్.. ఓడిపోయిన వెంటనే ఏదో ఒక సాకు చెప్పి ప్రజల్లోకి వెళ్లాలని ఉబలాటపడుతున్నట్టుగా ఉంది. మరి ఈ ఓదార్పులో కూడా గాయపడిన ప్రతి కార్యకర్త కుటుంబానికి రూ.లక్ష ఇస్తానని జగన్ ప్రతిజ్ఞచేస్తే బాగుంటుందని వైసీపీ కార్యకర్తలు కోరుకుంటున్నారు.