వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనేది మునుగుతున్న నావ అని అర్థమైన తర్వాత ఆ ఆ పార్టీకి చెందిన నాయకులు విచ్చలవిడిగా పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి బయటకు వెళ్ళిపోతున్నారు. ఇతర పార్టీల్లో చేరే అవకాశం లేకపోయినా సరే మౌనంగా ఉంటున్నారే తప్ప, జగన్ జోలికి రావడం లేదు. ఎంతగా జగన్ వైఖరితో విసిగిపోయారంటే.. శాసనమండలి లోనూ, రాజ్యసభలోను వారికి గల రాజ్యాంగబద్ధమైన చట్టసభల ప్రతినిధి హోదాలను కూడా వదులుకుంటూ అన్నిటికీ రాజీనామా చేస్తున్నారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి వ్యవహారసరాలు మాత్రం రోమ్ నగరం తగలబడుతుంటే ఫిడేల్ వాయిస్తో కూర్చున్న నీరో చక్రవర్తి లాగా ఉంటుందని పార్టీలో మిగిలిన నాయకులు.. కుమిలిపోతున్నారు. వ్యక్తిత్వం లేని వాళ్ళు పార్టీని వీడి వెళ్లిపోతారని, వారికి విశ్వసనీయత ఉండదని ఇంకా ఇద్దరు ముగ్గురు ఎంపీలు పోయినా కూడా తమ పార్టీకి వచ్చే నష్టం ఏమీ లేదని జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించడం తమాషాగా ఉంది.
సాధారణంగా పల్లెల్లో ఒక సామెత ఉంటుంది. ‘పిల్లలు ఏదైనా తప్పు చేస్తుంటే ఊరందరికీ తెలిసిన తర్వాత మాత్రమే ఇంట్లో తల్లిదండ్రులకు తెలుస్తుంది’ అని. రాజకీయాలలో అందుకు రివర్స్ గా జరుగుతుందని మనం భావించాలి. ఎందుకంటే ఒక నాయకుడు పార్టీ పట్ల అసంతృప్తితో ఉన్నాడు- రాజీనామా చేసే అవకాశం ఉంది- అంటే కనుక.. ముందుగా ఆ పార్టీ అధినేతకే ఆ సంకేతాలు అందుతాయి. నాయకుడు పార్టీ కార్యక్రమాలకు స్పందించే తీరు అర్థమైపోతుంటుంది. అధినేత తనకు తెలిసినా బయటకు ప్రకటించకుండా గుంభనంగా ఉంటారు. ఏదో ఒక రోజున నాయకుడు రాజీనామా చేసి వెళ్లిపోవడం జరుగుతుంది.
ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇంకా ఒకరో ఇద్దరో ఎంపీలు పోతే కూడా తమకు నష్టం లేదని వ్యాఖ్యానించడానికి గమనిస్తే.. ఈ సిద్ధాంతం గుర్తుకు వస్తోంది. కనీసం మరో ఇద్దరు రాజ్యసభ ఎంపీలు పార్టీకి రాజీనామా చేస్తారని అనిపిస్తోంది. ఆ విషయం జగన్ కు ఆల్రెడీ తెలుసునని ప్రజలు అనుకుంటున్నారు. అయోధ్య రామిరెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్ కూడా పార్టీని వీడుతారనే ప్రచారం గతంలో జరిగింది. గొల్ల బాబురావు కూడా పార్టీని వీడే అవకాశం ఉందని పుకార్లు వచ్చాయి. ఆ పార్టీకి రాజ్యసభలో ప్రస్తుతం మిగిలిన ఏడుగురిలో ఈ ముగ్గురు పోతే.. పరిమళ్ నత్వానీ వైసీపీ సభ్యుడిగా ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. ఆయన పార్టీ ఆదేశాలను పాటించే ఎంపి కాదని అందరికీ తెలుసు. ఆ లెక్కన జగన్- రాజ్యసభలో తన పార్టీ పరిస్థితి అత్యంత దయనీయంగా మారిపోతుందని ముందే తెలిసి అందుకు సిద్ధపడుతున్నట్లుగా కనిపిస్తోంది.