ఎన్నికల్లో గెలుపుఓటుములు అనేవి ఒకదాని తర్వాత ఒకటి పలకరిస్తూనే ఉంటాయి. రాజకీయ నాయకులు ఇలాంటి ఎత్తుపల్లాలకు మానసికంగా ఖచ్చితంగా అలవాటుపడి ఉండాలి. ఇదంతా సహజంగా తీసుకోగలగాలి. గెలుపును మాత్రం ఆస్వాదిస్తాం.. అధికారాన్ని మాత్రం అనుభవిస్తాం. ప్రజలు ఓడించినప్పుడు ఇక కలుగులోకి వెళ్లిపోతాం. ప్రజలు మళ్లీ గెలిపించేదాకా బయటకు రాకుండా అక్కడే గడిపేస్తాం అనే వైఖరి రాజకీయాలకు పనికి రాదు. రాజకీయ నాయకుడిగా జీవితాన్ని ఎంచుకున్న తరువాత.. గెలిచినా ఓడినా ఎప్పటికీ ప్రజల్లోనేఉంటూ, వారితో మమేకం కావడాన్ని అలవాటు చేసుకోవాలి. కానీ.. ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిలో అలాంటి అలవాటు మచ్చుకైనా కనిపించడం లేదు. మరో కోణంలో గమనించినప్పుడు ఈ అలవాటు విషయంలో ఆయన తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు అసలైన వారసుడిలాగా కనిపిస్తున్నారు. జగన్ తనకు దత్తపుత్రుడిలాంటి వాడని కేసీఆర్ గతంలో చెప్పుకున్నారు. ఆయనను పితృసమానుడిగా జగన్ కూడా చెప్పుకున్నారు. తీరా ఇప్పుడు వ్యవహారాలను గమనిస్తోంటే.. కేసీఆర్ కు అచ్చమైన వారసుడు జగన్ అన్నట్టుగా.. ఆయన బాటలోనే నడుస్తున్నారు.
కల్వకుంట్ల చంద్రశేఖర రావు.. 2023 శాసనసభ ఎన్నికల్లో ఓడిపోయిన నాటినుంచి ఇవాళ్టి దాకా ప్రజల ఎదుట రానేలేదు. కనీసం అసెంబ్లీకి కూడా రావడం లేదు. అసెంబ్లీకి ఎగ్గొట్టే విషయంలో జగన్మోహన్ రెడ్డి కాస్త బెటర్.. ఆయన కనీసం ‘తనకు ప్రతిపక్ష హోదా ఇచ్చేవరకు అసెంబ్లీకి రాను’ అని ప్రకటన చేసి డుమ్మా కొడుతున్నారు. కానీ కేసీఆర్ అలా కూడా కాదు. అసలు ఎలాంటి ప్రకలన చేయకుండానే.. అసెంబ్లీకి ఎగ్గొడుతున్న నాయకుడు. కానీ.. ఇల్లు కదలకుండా రాజకీయం చేయడం, ప్రజలు చచ్చినట్టు వేరే గతిలేక తమకు అవకాశం ఇస్తారు.. మనం వారికోసం కష్టపడాల్సిన అవసంర లేదు అన్నట్టుగా ఇంటకే పరిమితమై కూర్చుని రాజకీయం చేస్తుండడం.. ఇట్లోంచే పార్టీని నడిపించాలని చూడడం.. అందరినీ తన వద్దకు రప్పించుకోవాలనే దోరణే తప్ప.. తాను ప్రజల మధ్యకు వెళ్లాలనే ఆలోచన లేకపోవడం ఇలాంటి విషయాల్లో జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ ను మించిపోతున్నారు. కేసీఆర్ తన ఫాంహౌస్ కు మాత్రం పరిమితం అవుతోంటే.. జగన్మోహన్ రెడ్డి.. తన తాడేపల్లి ప్యాలెస్ కు- బెంగుళూరు యలహంక ప్యాలెస్ కు మధ్య విమానాల్లో షటిల్ సర్వీసు నడుపుతున్నారు.
నిజానికి జగన్మోహన్ రెడ్డి గత ఎనిమిదినెలలుగా ఇదే పనిచేస్తున్నారు. కాకపోతే.. ప్రభుత్వాన్ని నిందించడం మాత్రం మానుకోవడం లేదు. చంద్రబాబునాయుడు మీద వ్యతిరేకత వచ్చేసింది.. ఏ క్షణాన ఎన్నికలు పెట్టినా.. మన పార్టీనే గెలుస్తుంది.. అనే మాటను ఆయన ఇప్పటికి ఎన్ని సార్లు ట్వీట్ చేసి ఉంటారో లేక్కే లేదు. పార్టీలోని కొందరు సీనియర్లు సాహసించి.. ఇది చాలదని, ప్రజల్లోకి వెళ్లాలని.. ప్రజల్లో ఉండి పోరాటాలు చేయాలని అనేక పర్యాయాలు చెవినిల్లు కట్టుకుని పోరిన పిమ్మట జగన్మోహన్ రెడ్డి.. జిల్లాల్లో పర్యటిస్తానంటూ తన కార్యచరణ ప్రణాళిక ప్రకటించారు. సంక్రాంతి తర్వాత జిల్లా యాత్రలు ఉంలాయని, ప్రతి వారం ఒక జిల్లాలో రెండు రోజుల పాటు అక్కడే బసచేసి కార్యకర్తలతో ప్రజలతో సమావేశం అవుతానని జగన్ ప్రకటించారు. కానీ.. ఇప్పటిదాకా ఆ ఆలోచన కార్యరూపం దాల్చలేదు. క్రమంగా జిల్లాల యాత్రలు అనే ఆలోచనను మానుకోవాలనుకుంటున్నట్టుగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ విషయంలో కూడా అచ్చంగా కేసీఆర్ మాదిరిగానే జగన్ వ్యవహరిస్తున్నారు. కేసీఆర్ ఫాంహౌస్ కు పరిమితం అయిన తర్వాత.. విజయదశమి తర్వాత- దీపావళి తర్వాత- డిసెంబరు తర్వాత- సంక్రాంతి తర్వాత- ఇలా ఆయన పార్టీ నాయకులు రకరకాల మాటలు చెబుతున్నారు. అలా వాటి తర్వాత- కేసీఆర్ ప్రజల్లోకి వచ్చి రేవంత్ సర్కారు భరతం పడతారని ప్రతిజ్ఞలు చేస్తున్నారు. కానీ.. ఇప్పటిదాకా కేసీఆర్ ఇల్లు కదలలేదు. జగన్ ప్రకటిస్తున్న జిల్లా యాత్రలు కూడా అలాగే ప్రహసన ప్రాయంగా తయారవుతాయేమో అనే అభిప్రాయం పలువురిలో కలుగుతోంది. కేసీఆర్ వృద్ధుడు గనుక ఆయన ఇల్లు కదలకపోయినా ప్రజలు పట్టించుకోరు. ఆయన వారసుడు కేటీఆర్ ప్రజల్లో ఉండి నడిపిస్తున్నారు. జగన్ వృద్ధుడు కాదు.. వారసులుగా మరొక నాయకుడిని నమ్మి ప్రొజెక్టుచేసే వ్యక్తి కూడా కాదు. ఇలాంటి రాజకీయం చేస్తే ఎలా అని పార్టీ వర్గాలే విస్తుపోతున్నాయి.