ఇండోసోల్ సోలార్ ప్యానెళ్ల పరిశ్రమకు భూములు ఇవ్వడానికి కరేడు రైతులు వ్యతిరేకత వ్యక్తం చేస్తుండడం ఇవాళ రాష్ట్రంలోని హాట్ టాపిక్ లలో ఒకటి. రైతులకు అర్థమయ్యేలా పరిస్థితులను వివరించి.. భూసేకరణ జరుగుతుందని, భూసేకరణ విషయంలో ప్రభుత్వం వెనక్కు మళ్లలేదని అధికారులు చెబుతున్నారు. అయితే ప్రభుత్వ సంకల్పం నెరవేరకుండా.. రైతుల్ని రెచ్చగొట్టి ఇండోసోల్ కు భూములు ఇవ్వకుండా చేయడానికి జగన్ మరియు ఆయన అనుచర దళాలు శతవిధాలా ప్రయత్నిస్తున్నట్టుగా తెలుస్తోంది.
ఇండోసోల్ కంపెనీ జగన్మోహన్ రెడ్డికి బినామీ కంపెనీ అనే ప్రచారం ఆయన ముఖ్యమంత్రిగా వారికి చేవూరు వద్ద భూములు కేటాయించినప్పటినుంచి ఉంది. అయితే ఇప్పుడు రామాయపట్నం పోర్టుకు అనుబంధంగా ప్రతిష్ఠాత్మకంగా బీపీసీఎల్ ను కూడా రాష్ట్రానికి తీసుకురావడంలో కూటమి ప్రభుత్వం విజయం సాధించింది. వారికి విస్తారమైన భూములు కావాల్సి ఉన్నందున చేవూరు వద్ద ఉన్న భూముల్ని ఇవ్వడానికి నిర్ణయించారు. ఆ మేరకు ఇండోసోల్ కంపెనీకి ప్రత్యామ్నాయంగా కరేడు వద్ద భూములు సేకరించి ఇస్తామని ప్రభుత్వం చెప్పింది. అంతవరకు బాగానే ఉంది. ఇండోసోల్ కంపెనీకి కర్త కర్మ క్రియ తానే అయిన జగన్మోహన్ రెడ్డి.. ఈ ప్రయత్నాన్ని ముందుకు సాగనివ్వకుండా అడ్డుకుంటున్నారు.
కరేడు రైతులు వ్యతిరేకత వ్యక్తం చేయడం వెనుక వైసీపీ నేతల కుట్రవ్యూహం ఉన్నదనే ప్రచారం వినిపిస్తోంది. ఇండోసోల్ కరేడుకు మారితే.. చేవూరు వద్ద బీపీసీఎల్ వస్తుంది. అది రాష్ట్రప్రభుత్వ ప్రతిష్ఠను పెంచుతుంది. అలా జరగడం జగన్ కు ఇష్టం లేదు. అందుకే ఆయన రైతులను రెచ్చగొడుతున్నారు. కడేరు రైతులు వ్యతిరేకత వ్యక్తం చేసిన తర్వాత.. కందుకూరు వైసీపీ పార్టీ ఇన్చార్జి మధుసూదన్ యాదవ్ ఆధ్వర్యంలో కేవలం 12 మంది రైతులు వచ్చి తాడేపల్లిలో జగన్ ను కలిశారు. వారి పోరాటానికి తన మద్దతు ఉంటుందని జగన్ వారితో చెప్పారు. నిజానికి ఆయన ఉద్దేశం మద్దతివ్వడం కాదు. అసలు రాష్ట్రానికి బీపీసీఎల్ రాకుండా అడ్డుకోవడం.
ఇండోసోల్ కు జగన్ భూములిచ్చారే గానీ.. ఇప్పటిదాకా వారు అక్కడ తమ కార్యకలాపాలు ప్రారంభించనేలేదు. అందువల్లనే వాళ్లకు ప్రత్యామ్నాయ స్థలాలు చూపించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అది జరగకుండా జగన్ తన దళాలతో తెరవెనుకనుంచి అడ్డుకుంటున్నారు. ఇందుకోసం ఆయన ఇండోసోల్ కంపెనీ మీద తన ప్రెస్ మీట్ లో అవ్యాజమైన ప్రేమను కురిపిస్తున్నారు. వారి కంపెనీ 42 వేల కోట్ల పెట్టుబడి పెడుతుందని, 8 వేల ఉద్యోగాలు వస్తాయని అంటున్నారు. వారికిచ్చే స్థలం కరేడు వద్దకు మారినంత మాత్రాన ఆ ఉద్యోగాలు రావడం ఆగిపోదు కదా? అనేది ప్రజల సందేహం. అంతకంటె పెద్ద సంస్తకు ఎక్కువ స్థలం కావాలి గనుక.. బీపీసీఎల్ కు ఇవ్వడం ముఖ్యం అని, కానీ.. జగన్ దానిని అడ్డుకోడానికి ఇండోసోల్ ముసుగులో కపటప్రేమ చూపిస్తున్నారని పలువురు అంటున్నారు.