తాము చేసిన పనుల్ని కూటమిపై రుద్దుతున్న జగన్!

జగన్మోహన్ రెడ్డి తాజాగా ఎన్డీయే కూటమి ప్రభుత్వం మీద కొన్ని నిందలు వేశారు. ఆయన మరీ కొత్తగా వేస్తున్న నిందలు కాదు. తప్పుడు కేసులు పెడుతున్నారని, పోలీసులను వాడుకుని వేధిస్తున్నారని ఆయన నిత్యం అంటూ ఉంటారు. అయితే నీటి సంఘాలకు ఇప్పుడు ఎన్నికలు జరగబోతున్న సమయంలో.. జగన్ చేసిన విమర్శల్లో కొంచెం ప్రత్యేకత ఉంది. తన ప్రభుత్వం సాగిన రోజుల్లో రాష్ట్రంలో ఎన్నికలు వచ్చే ప్రతి సందర్భంలోనూ.. తాము ఏమేం పనులు చేశామో.. ఇప్పుడు ఆ పనులన్నింటినీ కూటమి ప్రభుత్వానికి ఆపాదించి బురద చల్లడానికి జగన్ ప్రయత్నిస్తున్నారు.

విషయం ఏంటంటే.. నీటి సంఘాల ఎన్నికలు జరగబోతుండగా.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీచేయడానికి కూడా స్థానికంగా కార్యకర్తలు ఎక్కడా ఉత్సాహంగా ముందుకు రావడం లేదు. పోటీచేస్తాం అని ప్రగల్భాలు పలుకుతున్న వారు.. తమ అర్హతలను నిరూపించుకోలేకపోతున్నారు. పైగా జిల్లా నాయకులతో సమీక్షిస్తున్నప్పుడు పోటీచేసినా సరే.. తమ పార్టీ అభ్యర్థులు గెలిచే అవకాశం లేదని వారు చెబుతున్నట్టుగా సమాచారం. స్థానికంగా నియోజకవర్గాల ఇన్చార్జిలైన నాయకులు కూడా.. డబ్బు ఖర్చుపెట్టి ఈ ఎన్నికలను ఎదుర్కోవడానికి సిద్ధంగా లేరు. గత ఎన్నికల్లో పెట్టిన ఖర్చు, దక్కిన ఓటమికే కుదేలైపోయి ఉన్నామని వారంతా విముఖంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో జగన్ తమ పార్టీ నీటి సంఘాల ఎన్నికలను బహిష్కరిస్తున్నదని చాలా ఆర్భాటంగా ప్రకటించారు. తమ చేతగానితనానికి ఈ రకంగా కవర్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు.

ఈ సందర్భంగా.. చేసిన ఆరోపణలు చిత్రమైనవి. రెవెన్యూ పోలీసు యంత్రాంగాల్ని వాడుకుని కూటమి ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోన్నదిట. పోటీచేయాలనుకుంటున్న వైసీపీ వారిమీదికి పోలీసులను ప్రయోగించి కేసులు పెడతాం అని బెదిరిస్తున్నారట. ప్రజాప్రతినిధుల్ని హౌస్ అరెస్టులు చేస్తున్నారట. రౌడీయిజానికి పాల్పడుతున్నారట… ఇలా సాగిపోతున్నాయి వారి ఆరోపణలు. జగన్ కాలంలో ప్రతి ఎన్నిక ఇదే తరహాలో జరిగింది. స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో పోలీసులతోనే తెదేపా, జనసేన అభ్యర్థుల్ని కిడ్నాప్ చేయించి మరీ నామినేషన్లు వేయకుండా అడ్డం పడ్డారు. అలాంటిది ఇప్పుడు ఆ చర్యలన్నిటినీ ఎన్డీయే కూటమి ప్రభుత్వానికి ఆపాదించి లబ్ధి పొందాలని జగన్ అనుకోవడం చిత్రంగా ఉంది.

Related Posts

Comments

spot_img

Recent Stories