తన ప్రియమైన తమ్ముడు వైఎస్ అవినాష్ రెడ్డికి ప్రియమైన పీఏ అయినందుకు రాఘవరెడ్డిని, తన తల్లి మీద, చెల్లిమీద అత్యంత నీచమైన భాషలో అసభ్యపు పోస్టులు సోషల్ మీడియాలో పెట్టినందుకు వర్రా రవీంద్ర రెడ్డిని వెనకేసుకు రావాలనే కోరిక మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఉంటే ఉండవచ్చు గాక! వారి మీద ఆయనలో అంతగా ప్రేమ వెల్లువెత్తుతూ ఉంటే.. వారు నిర్దోషులని నిరూపించడానికి సుప్రీం కోర్టు లాయర్లను రంగంలోకి దించి.. వారికి నిమిషాలకు లక్షల్లో చెల్లించవచలసి వచ్చే ఫీజులను తన పార్టీ ఖజానా నుంచి ఖర్చు పెట్టి సేవ్ చేసుకోవచ్చు.
అలాంటివి చేయడానికి జగన్ కు మనసొప్పదు. పోనీ పోలీసు అధికార్ల వద్ద వారి తరఫున తన వాదన వినిపించవచ్చు. అందుకు కూడా ఒక పద్ధతి ఉంటుంది. అహంకారం వీడకుండా పులివెందుల డీఎస్పీని బెదిరించడం మాత్రమే కాదు.. రెండు నాలుగు నెలల్లో ఈ ప్రభుత్వం కూలిపోతుందంటూ.. అనుచిత వ్యాఖ్యలు చేయడం ద్వారా… జగన్ అభాసు పాలౌతున్నారు.
లాజిక్ లేని, కనీసం రాజకీయ పరిజ్ఞానం కూడా లేని పామరుడిలాగా జగన్ చెబుతున్న మాటలు విని.. ఆయనలో మరీ ఇంత అడ్డంగా అత్యాశ ముదిరిపోయి ఉన్నదా.. అయిదేళ్లకు ఎన్నికైన సర్కారు పదినెలలకే కూలిపోవాలని ఆశపడుతున్నారా? అని ఒకవైపు ప్రజలు నవ్వుకుంటున్నారు. మరోవైపు.. తెలుగుదేశం, కూటమి పార్టీల నాయకులు జగన్ను విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు.
జగన్ వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని, చూడబోతే ఆయన మతి చలించి మాట్లాడుతున్నట్టుగా అర్థమవుతోందని మంత్రి కొలుసు పార్థసారధి వ్యాఖ్యానించడం విశేషం.
జగన్ పని తీరు నచ్చకపోవడం వల్ల.. ఆయన వెంట ఉంటే అసలు తమకు రాజకీయ భవిష్యత్తు ఉండదనే ఉద్దేశంతో.. ఇప్పటికే అనేకమంది నాయకులు వైసీపీ పార్టీని వీడిపోతున్నారని… వారి వలసలకు అడ్డుకట్ట వేయలేని చేతగానితనంతో.. పూర్తి నిరాశ నిస్పృహల్లో కూరుకుపోయిన జగన్ ఇలాంటి తలాతోకాలేని జోస్యాలు చెబుతున్నారని కొలుసు ఎద్దేవా చేస్తున్నారు.
నిజానికి జగన్ ఈ తరహా వ్యాఖ్యలు చేయడం పట్ల ఆయన సొంత పార్టీలో కూడా అసంతృప్తి వ్యక్తం అవుతోంది. జగన్ కు ముఖ్యమంత్రి పదవి మీద ఎంతైనా ఆశ ఉండొచ్చు గానీ.. 11 మంది ఎమ్మెల్యేల బలం పెట్టుకుని.. నాలుగు నెలల్లో సర్కారు కూలిపోతుంది.. నేనే సీఎం అవుతా అని బహిరంగంగా చెప్పడం అనేది పార్టీ పరువు తీస్తున్నదని వారు వ్యాఖ్యానిస్తున్నారు. ఇలాంటి మాటల వల్ల నలుగురిలో తలెత్తుకుని తిరగలేకపోతున్నాం అని అంటున్నారు. ప్రజల తరఫున క్రియాశీల పోరాటాలు జరిపే కార్యచరణ లేకుండా అనవసరమైన విషయాల్లో తలదూర్చి అధికార్లను బెదిరించడం వల్ల తమందరికీ తలవంపులే అని పెదవివిరుస్తున్నారు.