అసెంబ్లీ ఎన్నికల్లో అత్యంత దారుణంగా ఓడిపోయిన నాటినుంచి జగన్మోహన్ రెడ్డిలో ఒక కొత్త భయం పట్టుకుంది. అసలే పార్టీకి భవిష్యత్తు ఉంటుందో లేదో అని పార్టీ శ్రేణుల్లో భయం పుట్టే స్థాయి ఓటమి ఇది. దీని పర్యవసానంగా.. తమతమ భవిష్యత్తు బాగుండాలని కోరుకునే వారంతా పార్టీని వీడిపోతారేమో అనేది ఆయన భయం. అలాంటి వ్యవహారాలు మొదలైతే.. స్థానికసంస్థల్లో తమ పార్టీ ప్రాభవం మొత్తం ఖాళీ అవుతుందేమో అని.. ఆయన భయపడుతున్నారు. ఈ భయానికి సంకేతాలు ఓడిపోయిన తర్వాత.. ఆయన నిర్వహించిన తొలి సమావేశాల్లో మాటల్లోనే వ్యక్తం అయ్యాయి. ఇప్పుడు జగన్ లో ఆ భయం మరింతగా పెరిగినట్టు పార్టీ వర్గాల ద్వారా విశ్వసనీయంగా తెలుస్తోంది.
జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు అనేవి.. రాష్ట్రంలో ఒక చీకటి అధ్యాయంలాగా సాగింది. తెలుగుదేశం పార్టీ తరఫున పోటీచేయదలచుకున్న వారిని ప్రలోభపెట్టారు, బెదిరించారు, కిడ్నాపులు చేశారు, కొట్టారు, ఆస్పత్రుల పాల్జేశారు. ఎన్నికల దాకా రాకుండా ఉండడానికి ఎన్ని రకాలుగా చేయవచ్చో అన్ని రకాలుగానూ చేశారు. నామినేషన్లు కూడా వేసిన తర్వాత.. చాలా చోట్ల ఆయా నామినేషన్లను రిజెక్టు చేయించారు. ఇదేమని నోరెత్తకుండా మళ్లీ బెదిరించారు.. కేసులు పెట్టించారు. గందరగోళం చేశారు. ఇన్నింటిని దాటుకుని వైకాపాయేతర పార్టీలనుంచి ఎవరైనా గెలిస్తే.. వెంటనే వారిని మళ్లీ బెదిరించి, ప్రలోభ పెట్టి.. వైకాపా కండువా కప్పుకునేలా చేశారు. ఇన్నిరకాల అరాచకాల మధ్య స్థానిక సంస్థల్లో మెజారిటీ తమకే దక్కినట్టుగా అధికార పార్టీ ప్రకటించుకుంది.
ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిలో భయం పట్టుకుంది. స్థానికసంస్థల మీద చంద్రబాబు ప్రభుత్వం దృష్టి సారించిందంటే గనుక.. మొదటగా ఇతర పార్టీలనుంచి తాము చేర్చుకున్న వాళ్లు, ఆతర్వాత తమ పార్టీ వారు కూడా అంతా తెలుగుదేశంలో చేరిపోతారేమో అని ఆయన భయం. తద్వారా జడ్పీలు, మునిసిపాలిటీలు, మండల పరిషత్ లు అన్నీ తెదేపా వశం అవుతాయని భయపడుతున్నారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత ప్రెస్ మీట్ పెట్టినప్పుడే.. నాలుగేళ్ల దాకా అవిశ్వాసం పెట్టడానికి వీల్లేదని నిబంధనలు చెబుతున్నాయి అంటూ.. స్థానిక సంస్థలపై తన భయాన్ని బయటపెట్టుకున్నారు ఆయన!
ఆయన భయం నిజం అవుతున్న సంకేతాలు ఇప్పుడు కనిపిస్తున్నాయి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సామ్రాజ్యంలోని పుంగనూరు మునిసిపాలిటీని తమ వశం చేసుకోవడం ద్వారా తెలుగుదేశం శ్రీకారం చుట్టింది. పుంగనూరులో 12 మంది కౌన్సిలర్లు, ఛైర్మన్ సహా తెదేపాలో చేరడం జస్ట్ బిగినింగ్ మాత్రమే అంటున్నాయి తెలుగుదేశం వర్గాలు. ముందుముందు రాష్ట్రంలో మరిన్ని మునిసిపాలిటీలు తెలుగుదేశం పరం కాబోతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఓర్వలేక అసహనంతో రగిలిపోతున్న జగన్.. ఒక్కొక్క మునిసిపాలిటీ చేజారుతున్న కొద్దీ.. మరింత ఫ్రస్ట్రేట్ అవుతారేమో అని ఆయన సన్నిహితులే భయపడుతున్నారు.