ఎన్నికల్లో ఓడిపోయిన తొలి సంవత్సరంలో ఏ పార్టీ అయినా కొంత షాక్ లో ఉండడం సహజం. కానీ ఏడాది గడిచిపోయిన తర్వాత కూడా పార్టీని తిరిగి ట్రాక్ మీదికి తీసుకురావడానికి.. పార్టీ కార్యకర్తల్ని ఉత్తేజితం చేయడానికి తర్వాతి ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేలా సిద్ధం చేయడానికి కార్యరంగంలోకి దిగడం అవసరం. కానీ 2024 మేలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కేవలం 11 స్థానాల్లో మాత్రమే గెలిచి సర్వభ్రష్టత్వం చెందిన తన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని తిరిగి నిలబెట్టడం, తిరిగి ప్రాణం పోయడం కోసం వైఎస్ జగన్మోహన్ రెడ్డిలో అలాంటి వ్యూహాత్మక కార్యచరణ ప్రణాళిక ఉన్నట్టుగా కనిపించడం లేదు.
పార్టీ ప్లీనరీ వంటి కార్యక్రమాన్ని భారీగా ఘనంగా నిర్వహించడం ద్వారా పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపే అవకాశాన్ని ఆయన వరుసగా రెండో ఏడాది కూడా దూరం చేసుకుంటున్నారు. మరో రకంగా చెప్పాలంటే.. వైఎస్ జయంతి సందర్భంగా జులై 8న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏటా నిర్వహించే ప్లీనరీని ఓడిపోయిన తర్వాత రెండో సంవత్సరమైనా నిర్వహించడానికి జగన్ భయపడుతున్నారని పార్టీ వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి.
2024లో పార్టీ అత్యంత దారుణంగా ఓడిపోయింది. ప్రజలు జగన్మోహన్ రెడ్డి పాలనను చాలా ఘోరంగా తిరస్కరించారు. అలాంటి పరిస్థితుల్లో ఓటమి సంభవించిన నెలలోనే ప్లీనరీ పేరిట వేడుకలు చేసుకుంటే ప్రజలు నవ్వుతారు. ఈ సంకోచంలో పార్టీ అలాంటి కార్యక్రమానికి సాహసించలేదు. వారికి ఆ మూడ్ కూడా లేదని అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు రెండో సంవత్సరం నడుస్తోంది.
ఈ సంవత్సరం రోజుల్లో పార్టీని పునరుత్తేజితం చేయడానికి జగన్మోహన్ రెడ్డి వీసమెత్తు పని కూడా చేయలేదనే ఆక్రోశం ఆ పార్టీకి చెందిన నాయకుల్లోనే వ్యక్తం అవుతోంది. ఓటమి తర్వాత గడచిపోయిన ఏడాదిరోజుల్లో సగం రోజులకు పైగా ఆయన తాడేపల్లి ప్యాలెస్ లోనే గడిపారు. మిగిలిన సగంలో సగం రోజులను పార్టీ వారిని అప్పుడప్పుడూ తన తాడేపల్లి ప్యాలెస్ కు పిలిపించుకుని చంద్రబాబును తిట్టడంతో గడిపాడు. మిగిలిన సగం- అనగా మొత్తంలో పావు వంతు రోజులను జైళ్ల చుట్టూ, చావుల చుట్టూ తిరుగుతూ పరామర్శలు చేసుకుంటూ గడిపాడు తప్ప.. ఒక్కటంటే ఒక్కసారైనా ఒక్క జిల్లాలోనైనా పర్యటించి.. అక్కడ పార్టీ కార్యకర్తలతో కలిసి.. పార్టీలో కొత్త ఉత్సాహం తీసుకువచ్చే ప్రయత్నం ఇప్పటిదాకా చేయలేదు.
ఇప్పుడు కనీసం రెండోసంవత్సరం కూడా జులై 8న పార్టీ ప్లీనరీ నిర్వహించడానికి జగన్ కు ధైర్యం చాలడం లేదు. ఒకవైపు కడపలోనే మహానాడు నిర్వహించడం ద్వారా తెలుగుదేశం పార్టీ ఆ జిల్లా మీద జగన్ గుత్తాధిపత్యానికి సవాలు విసురుతోంది. 5 లక్షల మందితో బహిరంగ సభ ప్లాన్ చేస్తున్నారు. తాను ప్లీనరీ నిర్వహిస్తే.. అంతకంటె తక్కువ జనం వస్తే పరువు పోతుందని, ఇప్పుడు పార్టీ ఉన్న నీరస పరిస్థితుల్లో అంతమందిని తోలుకురావడం కష్టం అని జగన్ భయపడుతున్నట్టుగా కనిపిస్తోంది. మొత్తానికి రెండో ఏడాది కూడా ప్లీనరీ నిర్వహించకుండా జగన్ దాటవేస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.