జగన్ రావణాసురుడు అన్న వైఎస్సార్ భక్తుడు!

వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒకసారి ముఖ్యమంత్రి అయ్యారంటే.. అందుకు ఆయన తండ్రి వైఎస్సార్ కు ప్రజల్లో ఉండే ఆదరణ ఒక్కటే కారణం. జగన్ మహానుభావుడని, ఆయన ఉద్ధరిస్తాడనే నమ్మకంతో ప్రజలు ఓట్లు వేయలేదు. ముఖ్యమంత్రిగా ఉంటూ ప్రమాదంలో చనిపోయిన వైఎస్సార్ కొడుకుగా, ఒక్క చాన్స్ అంటూ అభ్యర్థించడంతో జాలిపడి ఓట్లు వేశారు. తాను అసమర్థ పాలకుడిని అని జగన్ చాలా బాగా నిరూపించుకుని ఆ తర్వాత ప్రజల తిరస్కారానికి గురయ్యారు. అయితే.. తన తండ్రికి ఉన్న ఆదరణే తనకు ఎడ్వాంటేజీ అనే సంగతిని గుర్తించడానికి జగన్ ఈగో మాత్రం ఒప్పుకోదు. అందుకే తండ్రికి ఆత్మీయులు అయిన ఎంతో మందిని, తండ్రి కోటరీకి చెందిన నాయకుల్ని పూర్తిగా పక్కన పెట్టేసి రాజకీయం చేస్తూ వచ్చారు. ఫలితాలు ఇప్పుడు చూస్తున్నాం. తాజాగా వైఎస్ రాజశేఖర్ రెడ్డికి వీరభక్తుడైన ఒక నాయకుడు జగన్మోహన్ రెడ్డిని రావణాసురుడితో, శిశుపాలుడితో పోల్చి అభివర్ణించడం, ఆ దుర్మార్గ పాలన అంతరించినందుకు సంతోషం వ్యక్తం చేయడం మనం గమనిస్తున్నాం.

తెలంగాణకు చెందిన సీనియర్ నాయకుడు గోనె ప్రకాశరావు.. అప్పట్లో వైఎస్సార్ కు అత్యంత సన్నిహితంగా, ఆత్మీయంగా మెలిగిన భక్తుల్లో ఒకరు. చాలా విషయాల మీద స్పష్టమైన అవగాహనతో మాట్లాడే గోనె ప్రకాశరావు.. వైఎస్సార్ అమ్ములపొదిలో ఒక ప్రధాన అస్త్రంగా ఉండేవారు. ప్రత్యర్థులను విమర్శించడానికి వైఎస్సార్ ఆయనను సంధించేవారు. వైఎస్సార్ మరణానంతర పరిణామాల్లో గోనె ప్రాధాన్యం కూడా తగ్గింది. తన తండ్రికి సన్నిహితులైన చాలా మంది నాయకులను జగన్ పట్టించుకోకుండా.. దూరం పెట్టిన సంగతి తెలిసిందే.
వైఎస్ రాజశేఖరరెడ్డి తన ఆత్మగా చెప్పుకున్న కేవీపీ రామచంద్రరావు దగ్గరినుంచి ఉండవిల్లి అరుణ్ కుమార్, కొణతల రామక్రిష్ణ, మైసూరా రెడ్డి తదితరులందరినీ జగన్ దూరం పెట్టారు. అలాంటి వారిలో గోనె ప్రకాశరావు కూడా ఉన్నారు. ఈ ఎన్నికలకు ముందు నుంచి కూడా గోనె.. జగన్ ఓటమి గురించి జోస్యం చెబుతూనే ఉన్నారు. ఆయన తాజాగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును కలిసి అభినందించారు. ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో రావణాసురుడు, శిశుపాలుడు వంటి పాలనలు అంతరించిపోయాయని ఆయన పేర్కొన్నారు. జగన్ దుర్మార్గుడు, పిరికివాడు అని.. సీబీఐ కోర్టుకు అబద్ధాలు చెప్పిన వ్యక్తి అని గోనె విమర్శించడం విశేషం. 

Related Posts

Comments

spot_img

Recent Stories