జగన్ ఎక్కడకు వెళ్లినా అంతే.. కార్యకర్తల ముసుగులో ఉన్మాదుల్లాగా.. అభిమానం ముసుగులో హేళన చేస్తున్నట్టుగా ఆయన పట్ల వచ్చిన వారు స్పందించే తీరులో మాత్రం ఎలాంటి మార్పు లేదు. ఎక్కడ చూసినా.. ‘సీఎం.. సీఎం..’అంటూ పెద్దపెట్టున నినాదాలు. ఒక వైపు తన సొంతమండలంలో జడ్పీటీసీ ఎన్నికల్లో డిపాజిట్ కూడా దక్కించుకోకుండా ఓడిపోయిన పరాజయ భారంతో కుమిలిపోతున్న జగన్మోహన్ రెడ్డికి.. ఈ ‘సీఎం’ నినాదాలు బహుశా హేళన లాగా ధ్వనిస్తూ ఉండవచ్చుననే అభిప్రాయం ప్రజల్లో కలుగుతోంది.
కడప జిల్లా రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాధ్ రెడ్డి సోదరుడు అనిల్ కుమార్ రెడ్డి కొడుకు పెళ్లి రిసెప్షన్ కు జగన్ మంగళవారం హాజరయ్యారు. హెలిప్యాడ్ నుంచి అన్ని ప్రాంతాల్లో అలవాటు చేసినట్టుగానే.. ఇక్కడ కూడా కార్యకర్తలు ఆయన కాన్వాయ్ వెంట ఎగబడుతూ.. పెళ్లి రిసెప్షన్ జరుగుతున్న ఆకేపాటి ఎస్టేట్స్ వరకు వచ్చారు. ఆయన తిరుగు ప్రయాణం అయినప్పుడు కూడా జనం ఫాలో అయ్యారు.
అంతా బాగానే ఉంది. జగన్ అక్కడ ఉన్నంత సేపూ.. జనం పెద్దపెట్టున ‘జై జగన్’ నినాదాలు, ‘సీఎం సీఎం’ నినాదాలు హోరెత్తించారు. పాపం జగన్ సీఎంగా ఉన్న అయిదేళ్ల కాలంలో.. కార్యకర్తలకు దగ్గరగా వెళ్లేవారు కూడా కాదు. ఆయన పాల్గొనే పబ్లిక్ మీటింగులు అన్నీ అనేకానేక నిషేధాజ్ఞల మధ్య నడిచేవి. అప్పట్లో పాపం ఆయన అభిమానులకు ‘సీఎం సీఎం’ అని నినాదాలు చేసే చాన్స్ కూడా దక్కినట్టు లేదు. ఇప్పుడు చాన్స్ వచ్చింది.. వారు ఆయనను చుట్టుముట్టి నినాదాలుబ చేస్తున్నారు.. ఆయన వద్ద పదవి లేదు. ఇప్పట్లో వస్తుందో లేదో కూడా క్లారిటీ లేదు. ఇటీవలి ఎన్నికల్లో ప్రజాస్పందన చూస్తే.. స్వేచ్ఛగా ఎన్నికలు జరిగితే తన పార్టీ పరిస్థితి మరీ ఇంత ఘోరంగా ఉంటుందా.. అని జగన్ ఆందోళన చెందుతున్న వైనం కనిపిస్తోంది. అందుకే జనం అలా నినాదాలు చేస్తోంటే.. తమకు మాత్రం.. వాళ్లంతా కలిసి నాయకుడిని హేళన చేస్తున్నట్టుగా ధ్వనిస్తోందని .. ఆ పార్టీ నాయకులే జోకులు వేసుకుంటున్నారు.
అయితే ఆకేపాడు టూర్ లో స్పష్టంగా కనిపించిన ఒక మార్పు ఏంటంటే.. జగన్ ఎగబడి తన మీదకి వస్తున్న జనాలకు షేక్ హ్యాండ్ లు ఇచ్చే అత్యుత్సాహం ప్రదర్శించలేదు. ఆయన చాలా జాగ్రత్త పడుతున్నట్టుగా.. జనం ఎవరూ తన మీదికి దూసుకువచ్చి చేతిని లాక్కుని షేక్ హ్యాండ్ లు ఇవ్వడానికి కూడా అవకాశం లేకుండా.. రెండు చేతులూ గాల్లో పైకెత్తి.. ఇక వాటిని దించకుండా అలాగే పెట్టుకుని తన పర్యటన పూర్తిచేసేశారు. షేక్ హ్యాండ్ ల పిచ్చి పలచబడింది గానీ.. జగన్ కు ‘సీఎం’ నినాదాల పిచ్చి తగ్గలేదని జనం నవ్వుకుంటున్నారు.