హర్యానాలో చాలా ఎగ్జిట్ పోల్ సర్వేలు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందనే చెప్పాయి. కానీ అనూహ్యంగా బిజెపి అక్కడ హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసింది. అనూహ్యం కావొచ్చు గానీ.. అలా జరగకూడదని రూలేం లేదు. జగన్మోహన్ రెడ్డి కూడా ఏపీలో ఎట్టి పరిస్థితుల్లోనూ తాను 160 పైగా స్థానాల్లో విజయంతో గెలుస్తానని పదేపదే చెప్పుకున్నారు. కానీ అతి కష్టమ్మీద డబల్ డిజిట్ కు చేరగలిగారు. అయితే హర్యానాలో బిజెపి గెలవడాన్ని కూడా జీర్ణించుకోలేకపోతున్న జగన్మోహన్ రెడ్డి.. ఇంక తన రాజకీయ భవిష్యత్తుకు ఇండియా కూటమిలో చేరడం ఒక్కటే మార్గం అని డిసైడ్ అయ్యారా? అందుకే కాంగ్రెసును ప్రసన్నం చేసుకునే విధంగా బిజెపిపై నిందలు వేస్తూ ట్వీట్లతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారా? అనే చర్చ ఇప్పుడు నడుస్తోంది.
వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా తరచుగా తాను సింహాన్ని అని, ఒంటరిగా మాత్రమే ఎన్నికల్లో పోటీచేస్తానని చెప్పుకుంటూ ఉంటారు. చంద్రబాబు పొత్తులు పెట్టుకుంటే ఎద్దేవా చేస్తుంటారు. ఆయన సింహం అనే సంగతి ఎలా ఉన్నప్పటికీ.. కేంద్రంలో ప్రాబల్యం ఉన్న పార్టీ యొక్క అండదండలు లేకుండా జగన్మోహన్ రెడ్డి మనుగడ సాగించలేరు. తన రాజకీయం కంటె కూడా తన మీద ఉన్న సీబీఐ కేసులు ఆయనకు చాలా ముఖ్యమైనవి. అలాగే వైఎస్ అవినాష్ రెడ్డి మీద ఉన్న వివేకా హత్య కేసు సంగతి కూడా ఆయనకు చాలా కీలకం. ఆ రెండూ ఒక కొలిక్కి రాకూడదంటే.. శిక్షలు పడకుండా ఉండాలంటే.. కేంద్రంలో బలమైన పార్టీతో అనుబంధం కలిగి ఉండాల్సిందే.
2014 ఎన్నికల్లో మోడీ- చంద్రబాబు- పవన్ జట్టుగానే ఉన్నారు. అయినప్పటికీ.. 2019 ఎన్నికల తర్వాత మోడీతో సత్సంబంధాలకోసం జగన్ తహతహ లాడిపోయారు. మోడీ ఎక్కడ కనిపిస్తే అక్కడ సాగిలపడి పాదనమస్కారాలు చేయడం ప్రారంభించారు. ఆయన తన తండ్రి లాంటి వారు అని కితాబులు ఇచ్చుకున్నారు. బిజెపికి రాజ్యసభలో ఓటింగు అవసరం వస్తే చాలు.. అందరికంటె ముందు వైఎస్సార్ కాంగ్రెస్ మద్దతు ఇవ్వడానికి సిద్ధమైపోతుండేది. అంత చేసినప్పటికీ.. ప్రజల్లో క్రెడిబిలిటీలేని, అవినీతి కేసుల్లో నిత్యం మునిగితేలుతూ ఉండే జగన్ ను విశ్వసనీయ వ్యక్తిగా చూడడానికి బిజెపి సిద్ధపడలేదు. 2024 ఎన్నికల్లో ఎన్డీయే కూటమిలోకి తెదేపా చేరింది.
ఆ తర్వాత కూడా జగన్ కొంత కాలం వేచిచూశారు. కానీ కమలదళంతో సత్సంబంధాలు సాధ్యమయ్యేలా లేదు. కనీసం వారి వ్యతిరేక కూటమిలోనైనా ఉంటే.. తనకు కాస్త సెక్యూరిటీ ఉంటుందనే ఆలోచన జగన్ కు ఉండొచ్చు. అందుకే జగన్ ను దగ్గరకు కూడా రానివ్వని కాంగ్రెస్ పార్టీ హర్యానాలో ఓడిపోతే.. వారికోసం జగన్ కన్నీళ్లు కారుస్తున్నారు. ఈవీఎంలను మాయచేసి బిజెపి గెలిచిందని అర్థం వచ్చేలా ట్వీట్లు పెడుతున్నారు. ఇలాంటి ప్రకటనల ద్వారా.. రాహుల్ర సారథ్యంలోని ఇండియా కూటమికి దగ్గర కావాలని జగన్ తహతహ లాడుతున్నట్టు అర్థమైపోతోంది. అయితే, జగన్ పట్ల రాహుల్ గాంధీకి విపరీతమైన అసహ్యభావం ఉంది. ఆయన మాట ఇండియా కూటమిలో చెల్లుబాటు అయినంత వరకు, జగన్ కు ఆ కూటమిలోకి ఎంట్రీ ఉండదని విశ్లేషకులు భావిస్తున్నారు.