జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వేదికగా రంకెలు వేయాలని అనుకొని భంగపడ్డారు. ‘చంద్రబాబు నాయుడు ప్రభుత్వం దుర్మార్గమైనది’ అని దేశంలోని ఇతర ప్రధాన రాజకీయ పార్టీలన్నింటి దృష్టికి తీసుకువెళ్తానని, ప్రగల్భాలు పలికిన జగన్మోహన్ రెడ్డికి జాతీయ పార్టీలు మొహం చాటేసాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీల నుంచి విపరీతమైన ఒత్తిడి వేడికోళ్ళు ఉండడంతో కొన్ని పార్టీల తరఫున నామమాత్రంగా ఒకరిద్దరు నాయకులు మాత్రం వచ్చి జగన్ కు సంఘీభావం తెలిపినట్లుగా కనిపిస్తోంది. యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ కూడా రాకుండా పోతే గనుక.. జగన్ దీక్ష జాతీయ వేదిక మీద చేసినందుకు దారుణంగా తుస్సుమని ఉండేది.
అఖిలేష్ మినహా, దేశంలోని ఏ ఒక్క పార్టీ తరఫున కూడా కీలక నాయకులు ఎవ్వరూ జగన్ ఆరాటం గురించి నోరు మెదపలేదు. చంద్రబాబును నిందించడానికి ముందుకు రాలేదు. అఖిలేష్ కూడా నర్మగర్భంగా రాజకీయాల్లో ఇలాంటివి మంచిది కాదు లాంటి మాటలు చెప్పారే తప్ప.. చంద్రబాబు తీరును నిందించలేదు. అయితే ట్విస్టు ఏమిటంటే వచ్చిన అరకొర నాయకులతోనే సంబరపడిపోతున్నట్టుగా దేశమంతా తన వెంట నిలిచి మద్దతు ఇస్తున్నట్లుగా జగన్మోహన్ రెడ్డి మసిపూసి మారేడు కాయ ప్రచారం చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తున్నదని అందుకు జాతీయ పార్టీలన్నీ తనకు సంఘీభావం తెలుపుతున్నాయని ఆయన అంటున్నారు. సమాజ్ వాది పార్టీ తరఫున రాజ్యసభ ఎంపీ రామ్ గోపాల్ యాదవ్, ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున రాజేంద్రపాల్ గౌతమ్, తృణమూల్ కాంగ్రెస్ తరపున నదిముల్ హక్, శివసేన నాయకురాలు ప్రియాంక చతుర్వేది, అలాగే తమిళనాడులోని వీసీకే పార్టీ అధ్యక్షుడు తిరుమావలవన్ పరామర్శించారు.
ఇక్కడికే దేశం మొత్తం తన వెంట నిలిచినట్లుగా జగన్ హర్షాతిరేకాలు వ్యక్తం చేయడం విశేషం. ఆయా పార్టీలన్నింటికీ బహుధా కృతజ్ఞతలు తెలియజేశారు. జగన్ దళాలు కొన్ని రోజులుగా అనేక జాతీయ పార్టీల వారితో మంతనాలు సాగించాయి గానీ.. పెద్దగా ఫలితం దక్కలేదు. మమతా బెనర్జీ, స్టాలిన్ వంటి గాని కనీసం ట్వీట్లు కూడా చేయలేదు.
జగన్మోహన్ రెడ్డి సాగిస్తున్న అబద్ధపు ప్రచారాల పట్ల తాము దూరంగా ఉండాలని మాత్రమే వారు నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. నామమాత్రంగా ఆయా పార్టీల నుంచి ఎవరో ఒకరిని బతిమాలి తీసుకువచ్చి, అక్కడికి పార్టీలు సమూలంగా తనకు జై కొడుతున్నట్లుగా బిల్డప్ ఇచ్చుకోవడం జగన్ కు మాత్రమే చెల్లిందని ప్రజలు అనుకుంటున్నారు.