కడప జిల్లాలో జరిగిన రెండు జెడ్పిటిసి స్థానాల ఉప ఎన్నికలను, ప్రత్యేకించి డిపాజిట్ కూడా దక్కకుండా పులివెందుల స్థానాన్ని కోల్పోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి బాహ్య ప్రపంచంలో కనిపించిన ఒకే ఒక్క సందర్భం ధర్మవరంలో పార్టీ నాయకుడు ఇంట్లో పెళ్లి మాత్రమే. ఇటీవలి కాలంలో చేస్తున్న యాత్రల నేపథ్యంలో అభిమానులను, కార్యకర్తలను జగన్ ఏ రకంగా రెచ్చగొడుతున్నారో.. వారినుంచి ఆయన ఏం కోరుకుంటున్నారో చూసిన ధర్మవరం వాసులు కూడా అదే విధంగా ఎగబడడంతో.. ఆ పెళ్లి కూడా రసాభాస అయింది. అయితే పెళ్లి తర్వాత ఆయన ఎంచక్కా బెంగళూరు ప్యాలెస్ కు వెళ్లిపోయారు.
ఓటమి నేపథ్యంలో ప్రజలకు మొహం చూపించడానికి ఇష్టం లేక జగన్ మోహన్ రెడ్డి బెంగుళూరు వెళ్లిపోయారని అనుకోవచ్చు. అయితే కనీసం దేశానికి స్వాతంత్ర దినోత్సవం వచ్చిన రోజున.. ఒక రాజకీయ పార్టీకి అధ్యక్షుడిగా, ఒక రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రిగా కనీసం ఎక్కడో ఒకచోట పతాకాన్ని ఆవిష్కరించి జండా వందనం చేయాలనే కనీస స్పృహ వైయస్ జగన్ లో కొరవడిందా? అనే చర్చ ఇప్పుడు జరుగుతోంది. తనకు ఓటములు ఎదురైనందుకు ప్రత్యర్థుల మీద కక్ష కట్టినట్టుగా, వారి చావును కోరుకుంటూ అభిలాషను బయటపెడుతున్న జగన్మోహన్ రెడ్డి.. జాతీయ జెండా మీద కూడా పగ పట్టారా అనే అనుమానం ప్రజల్లో కలుగుతోంది.
వైయస్ జగన్మోహన్ రెడ్డి స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో ఎక్కడా పాల్గొనలేదు. కేవలం జడ్పిటిసి ఎన్నికలలో దక్కిన పరాభవం వల్ల మాత్రమే ఆయన పబ్లిక్ లోకి రావడానికి ఇష్టం లేక ఇలా ప్రవర్తించారని, జాతీయ జెండా మీద పగబట్టారని అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే ఇంతకంటే నీచమైన పరాజయ భారం గత ఏడాది ఆయనకు ఎదురయింది. 151 సీట్లతో అధికారం చలాయించిన జగన్ 11 సీట్ల స్కోరుకు దిగజారిపోయారు. అలాంటి పరిస్థితుల్లో కూడా తాడేపల్లి పార్టీ కార్యాలయంలో పతాకావిష్కరణ కార్యక్రమానికి జగన్ హాజరయ్యారు. దానితో పోలిస్తే పులివెందుల ఒంటిమిట్ట పరాజయాలు మరీ సిగ్గుపడాల్సినవి ఏమీ కాదు. అయినా జగన్‌కు మాత్రం మొహం చెల్లడం లేదు.
తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి నాయకత్వం వహించారు. ఆయనే జాతీయ జెండాను ఆవిష్కరించారు. నామ్ కే వాస్తే అన్నట్లుగా స్వాతంత్ర దినోత్సవ సందర్భాన్ని ఒకటి రెండు నిమిషాలు ప్రస్తావించి, మళ్లీ కూటమి ప్రభుత్వ పరిపాలన మీద బురద చల్లడానికి తన సమయం మొత్తం కేటాయించారు సజ్జల! బహుశా స్వాతంత్ర దినోత్సవ నేపథ్యంలో దేశవ్యాప్తంగా జరిగిన కార్యక్రమాలలో వైసీపీ కార్యాలయంలో సజ్జల చేసినంతటి చవకబారు ప్రసంగం మరొకటి ఉండదంటే అతిశయోక్తి కాదు. ఆయనకసలు దేశం గురించి స్వాతంత్రం గురించి మాట్లాడే ఉద్దేశమే లేదు.. అన్నట్టుగా కార్యక్రమం సాగింది! చంద్రబాబును, కడప జిల్లా ఎన్నికలను, ఎన్నికల సంఘాన్ని విమర్శించడానికి ఆయన తన పూర్తి సమయాన్ని వెచ్చించారు.
జగన్ మాత్రం కనీసం జాతీయ జెండాను ఆవిష్కరించే గర్వదాయకమైన కార్యక్రమంలో పాల్గొనకపోవడం అనేక విమర్శలకు దారి తీస్తోంది. తెలుగుదేశం మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ జగన్ జీవితంలో ఇది అతి పెద్ద బ్లాక్ రిమార్క్ అవుతుందని హెచ్చరిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డికి ఇంత అహంకారం తగదని ఆయన అంటున్నారు. స్వాతంత్రం కోసం అనేక లక్షల మంది చేసిన త్యాగాలను గుర్తు చేసుకోవడానికి కూడా జగన్మోహన్ రెడ్డికి సమయం లేకపోతే ఎలా అని సోమిరెడ్డి ప్రశ్నిస్తున్నారు. ప్రశ్న సోమిరెడ్డి ది కావచ్చు గాని రాష్ట్ర ప్రజలందరి మనసుల్లో ఉన్నది అదే! మరి జగన్ ఇలాంటి చర్చకు ఏం సమాధానం చెబుతారో, తన పలాయనవాదాన్ని ఎలా సమర్ధించుకుంటారో వేచి చూడాలి!