కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ విధానం కిందికి వచ్చే ఉద్యోగులలో లేని ఆశలు రేపి.. వారిని దారుణంగా వంచించిన చరిత్ర వైఎస్ జగన్మోహన్ర రెడ్డిది. నేను మాట తప్పను, మడమ తిప్పను అని పదేపదే టముకు వేసుకునే జగన్మోహన్ రెడ్డి.. అనేక విషయంలో మాటతప్పి ప్రజలను వంచించారు. అవన్నీ జాబితా కట్టేకంటే.. సీపీఎస్ ఉద్యోగుల విషయంలో ఆయన ఏం చేశారో గమనిస్తే చాలు, ఆయన వంచనలకు పరాకాష్ట అని అర్థమైపోతుంది. అయితే.. ఉద్యోగ సంఘాల వారు సీపీఎస్ రద్దు విషయంలో తమకు జరిగిన ద్రోహానికి ఇప్పుడు నిరసనలు వ్యక్తం చేయాలని అనుకుంటున్నారు. సెప్టెంబరు 1వ తేదీన వెన్నుపోటు దినం నిర్వహించాలని, విజయవాడలో పెన్షన్ మార్చ్ నిర్వహించాలని కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ వారు నిర్ణయించడం చర్చనీయాంశం అవుతోంది.
2019 ఎన్నికలకు పూర్వమే సీపీఎస్ ఉద్యోగులకు ఈమేరకు సీపీఎస్ రద్దు గురించి ఆశలు రేకెత్తించారు. పాదయాత్రలోర సీపీఎస్ ఉద్యోగులు తనను కలిసినప్పుడు.. చంద్రబాబు పరిపాలన పట్ల ఉద్యోగుల్లో వ్యతిరేకతను పాదుగొల్పడం ఒక్కటే లక్ష్యంగా వ్యవహరిస్తూ వచ్చిన జగన్మోహన్ రెడ్డి.. ఎలాంటి సంకోచంగానీ, ఆలోచనగానీ, ముందుచూపుగానీ లేకుండా వారికి హామీ ఇచ్చేశారు. తాను అధికారంలోకి వస్తే.. కేవలం వారం రోజుల వ్యవధిలోనే సీపీఎస్ ను రద్దు చేసి, ఓపీఎస్ పాత పెన్షన్ విధానాన్ని అమలులోకి తీసుకువస్తానని ఆయన చెప్పుకొచ్చారు. అయితే ఆయన మాటలు కల్లలే అయ్యాయి. వాస్తవరూపం దాల్చలేదు. వారం రోజులు కాదు కదా.. అధికారం నుంచి దిగిపోయే వరకు కూడా ఆయన ఆ హామీని నిలబెట్టుకోవడం గురించి పట్టించుకోలేదు. అది ఆచరణ సాధ్యం కాదనే మాట కూడా ఉద్యోగులకు చెప్పలేదు.
నిజానికి, తెలియక హామీ ఇచ్చానని, ఏదో ఓట్లను ఆకర్షించడానికి అలా చెప్పానని, లెంపలు వేసుకుని ఉంటే సరిపోయేది. కానీ, అహంకారానికి వెళ్లిన జగన్మోహన్ రెడ్డి తాను చేసిన వంచనను ఒప్పుకోలేదు. ఉద్యోగులను పలుమార్లు చర్చలకు పిలిచి అవమానించారు. వారికి ఇచ్చిన మాట సంగతి పట్టించుకోకుండా.. వారు ఏమాత్రం అంగీకరించే అవకాశం కూడా లేని రకరకాల కొత్త ప్లాన్ లను ఆయన ప్రతిపాదించారు. సీపీఎస్ పరిధిలోని ఉద్యోగులు జగన్ తమను మోసం చేశారంటూ ఉద్యమాలకు దిగినప్పుడు వాటిని ఉక్కుపాదంతో అణిచివేశారు. ఉద్యోగుల నిరసనలపట్ల చాలా దుర్మార్గంగా వ్యవహరించారు. ఈ వంచన, వెన్నుపోటు మొత్తం జగన్ చేతులమీదుగానే జరిగింది.
కాగా ఇప్పుడు సీపీఎస్ ఉద్యోగులు సెప్టెంబరు 1న వెన్నుపోటు దినం నిర్వహించాలనుకుంటున్నారు. ఎవరికి వ్యతిరేకంగా, ఎవరి వెన్నుపోటును ప్రస్తావిస్తూ నిర్వహిస్తారనేది కీలకంగా ఉంది. ఎందుకంటే.. సీపీఎస్ రద్దు విషయంలో ప్రాక్టికల్ ఇబ్బందులు తెలిసిన చంద్రబాబునాయుడు ఎన్నడూ వారికి ఆ హామీ ఇవ్వలేదు. వారికి ఇతరత్రా ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారే తప్ప.. రద్దు మాట హామీ ఇవ్వలేదు. మరి ఈ ఉద్యోగులు సెప్టెంబరు 1న చేసే నిరసనల్లో జగన్ పొడిచిన వెన్నుపోటు గురించే మాట్లాడుకుంటే బాగుంటుందని ప్రజలు అంటున్నారు.