నిజానికి జగన్మోహన్ రెడ్డి వ్యవహార సరళిని అర్థం చేసుకోవడం కష్టం అని ఆయన సొంత పార్టీ వారే వ్యాఖ్యానిస్తుంటారు. దానికి తగ్గట్టుగానే జగన్ ఎప్పుడు ఎవరిని నెత్తిన పెట్టుకుంటారో.. ఎవరిని ఛీకొడతారో అర్థం చేసుకోవడం కష్టం. అదే క్రమంలో ఆయన తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డిని అత్యంత క్రూరంగా తిట్టిపోసే నాయకుడైన కేసీఆర్ తో చాలా చక్కటి దోస్తీ కలుపుకున్నారు. కేసీఆర్ తో దోస్తీ కోసం తాను ముఖ్యమంత్రి అయిన వెంటనే.. తెలంగాణ సక్రటేరియేట్, ఇతర భవనాలపై పదేళ్లపాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉండగల సమాన హక్కులను కూడా జగన్ ధారాదత్తం చేసేశారు. కేసీఆర్.. తన శత్రువు చంద్రబాబును తిడుతూ ఉంటాడనే ప్రేమ మాత్రమే కాదని, ఇలా ఏపీ హక్కులను వదులుకోవడం వెనుక.. హైదరాబాదులోని తన బినామీ ఆస్తులను కాపాడుకునే కుట్ర కూడా ఉన్నదని అప్పట్లో ప్రచారం జరిగింది. అక్కడా ఇక్కడా కూడా అహంకారపూరితమైన ప్రభుత్వాలు పతనం అయిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి మరియు ఆయన కరపత్రిక.. కేసీఆర్ కోటరీకి అండగా నిలుస్తున్నట్టుగా కనిపిస్తోంది. కేసీఆర్ మీద ఈగవాలనివ్వకుండా చూడడంలో.. రేవంత్ సర్కారును బద్నాం చేసేలా తమ వంతు పాత్ర పోషించడంలో జగన్ కరపత్రిక చాలా కష్టాలు పడుతోంది.
మామూలుగా అయితే తెలంగాణ రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి పార్టీకి కనీస అస్తిత్వం కూడా లేదు. ఆయన ఎన్నడో ఇక్కడ దుకాన్ బంద్ చేసేశారు. ఏపీకి పరిమితమై గద్దె ఎక్కిన తర్వాత.. కేసీఆర్ తో అమిత అనుబంధాన్ని కొనసాగించారు. తమ భవిష్యత్తునే గెస్ కొట్టలేక దారుణంగా ఓడిపోయిన గులాబీ దళపతి కేసీఆర్, ఏపీ రాజకీయాల్లో జగన్ గెలవబోతున్నట్టుగా తమకు సమాచారం ఉన్నదని అనేక ప్రకటనలు చేసి.. ఏపీ ప్రజలను ఇన్ఫ్లుయెన్స్ చేసే ప్రయత్నాలూ చేశారు. ఇలా ఒకరికొకరు సహకరించుకుంటూ ఉన్నారు. ఇరువురి పతనం తర్వాత కూడా జగన్ సహాయ సహకారాలు అలాగే కొనసాగుతున్నాయి.
జగన్.. తన పాలనలో వీసమెత్తు నిబంధనల ఉల్లంఘన కనిపిస్తే చాలు.. తెలుగుదేశానికి చెందిన పలువురు నాయకుల ఆస్తులను నిర్దాక్షిణ్యంగా కూల్పించేసి విధ్వంసక పాలన సాగించారు. నాయకుల ఆస్తులే కాదు.. ప్రభుత్వ ఆస్తి అయిన ప్రజావేదికను కూడా ఏ విధంగా కూల్చి నాశనం చేశారో ప్రజలు చూశారు. ఇప్పుడు తెలంగాణలో అసలు నిబంధనలు పట్టించుకోని, అనుమతులు లేని.. భారాస కార్యాలయాలమీద రేవంత్ సర్కారు దృష్టి సారిస్తోంటే.. జగన్ కరపత్రిక గగ్గోలు పెడుతోంది. ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తున్నదంటూ విలాపాలు కొనసాగిస్తున్నారు. జగన్ వ్యవహార సరళి.. తాను చేస్తే శృంగారం.. పరులు చేస్తే వ్యభిచారం అనే తరహాలో ఉన్నదని జనం అంటున్నారు.