ఆర్ఆర్ఆర్ ప్లాన్‌తో జగన్‌కు మరింత పరువునష్టం!

రాజ్యాంగం ప్రకారం, చట్టం ప్రకారం చూసినప్పుడు.. ఎమ్మెల్యే అనే పదవి యొక్క ప్రాథమిక బాధ్యత కేవలం అసెంబ్లీకి హాజరు కావడం మాత్రమే. అక్కడ ప్రభుత్వం ప్రవేశపెట్టే బిల్లుల మీద తన అభిప్రాయాలు వెల్లడించడం మాత్రమే. అంతే తప్ప ఒక ఎమ్మార్వోతో ఒక రేషన్ కార్డు ఇప్పించడానికి కూడా వారికి చట్టబద్ధమైన అధికారం లేదు. వారేదో రౌడీలు దందా చేసినట్టుగా.. ఎమ్మెల్యే అనే హోదాను అడ్డుపెట్టుకుని బెదిరించి, దబాయించి బతకాల్సిందే తప్ప.. వారికి అధికారంలేదు. రాజ్యాంగం కల్పించే అధికారం ప్రకారం.. వారు అసెంబ్లీకి హాజరు కావాలి. ప్రభుత్వం ప్రవేశపెట్టే బిల్లుల మీద తమ అభిప్రాయం చెప్పాలి. (ఎమ్మెల్యేలు అంటే ప్రభుత్వం కాదు, మంత్రులు మాత్రమే ప్రభుత్వం). కానీ.. ఇప్పుడు ఎమ్మెల్యేలు అసలు అసెంబ్లీలో అడుగు పెట్టకుండానే తమ అయిదేళ్ల పదవీకాలం గడిపేయాలని అనుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకరు రఘురామక్రిష్ణ రాజు చేస్తున్న ప్రతిపాదన గమనిస్తే.. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మరింత పరువు నష్టం తప్పదని అనిపిస్తోంది.

ఢిల్లీలో అఖిల భారత అసెంబ్లీ స్పీకర్ల సదస్సు జరిగింది. ఏపీ తరఫున అయ్యన్నపాత్రుడు, రఘురామక్రిష్ణరాజు ఇద్దరూ హాజరయ్యారు. ఆ సమావేశాల్లో రఘురామ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే.. ఏడాదిలో కనీసం 60 రోజుల పాటు అసెంబ్లీని నిర్వహించడం అవసరం అని వ్యాఖ్యానించారు. తొలినాళ్లలో భారత పార్లమెంటు ఏడాదికి 135 రోజులు నడిచేదని గుర్తుచేశారు. తాను ఎంపీగా చేసిన 17వ లోక్ సభలో సగటు పనిదినాలు 55 రోజులు మాత్రమే అని కూడా పేర్కొన్నారు. అసెంబ్లీ సగటు పనిదినాలు 35-40 రోజులకు పరిమితం అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రెండు సమావేశాల మధ్య వ్యవధి 180 రోజులు మించకూడదని రాజ్యాంగ నిబంధన ఉన్నందువల్ల కొన్ని రాష్ట్రాల అసెంబ్లీలు సరిగ్గా ఆ వ్యవధికే సమావేశం అవుతున్నాయని కూడా చెప్పారు. మనం ప్రతి ఏటా 60 రోజులు సభను నిర్వహిస్తామని ప్రతిన పూనాలని పిలుపు ఇచ్చారు.

రఘురామ చెబుతున్నట్టుగా ఎక్కువ రోజులు అసెంబ్లీ జరిగితే.. ఏపీలో జగన్మోహన్ రెడ్డి అండ్ కో కు ఎక్కువ పరువునష్టం తప్పదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఆయన ఎంతగా బయట కూర్చుని ప్రభుత్వం మీద బురద చల్లే ప్రయత్నం చేసినప్పటికీ.. ఆయన పార్టీ ఎమ్మెల్యేలు ఎవరూ అసెంబ్లీకి వెళ్లడం లేదనే చెడ్డపేరు తుడిచేసుకోగలిగేది కాదు. అసెంబ్లీలో వారు సమస్యల్ని ప్రస్తావించకుండా తమను గెలిపించిన ప్రజలకు అన్యాయం చేస్తున్నారనే భావన ప్రజల్లో బాగా ఉంది. ఎక్కువ రోజులు అసెంబ్లీ జరిగితే.. జగన్ పరువు మరింత ఎక్కువగా పోతుందని కూడా ప్రజలు అనుకుంటున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories