జగన్ : అనేక మెట్లు దిగొచ్చినా ఫలితం సున్నా!

పార్టీని కాపాడుకోవడం అనేది జగన్మోహన్ రెడ్డికి తలకు మించిన భారం అయిపోతోంది. పార్టీని వీడిపోతున్న వారు పెరుగుతున్నారు. పార్టీని పట్టించుకోకుండా సైలెంట్ అవుతున్న వారు అంతకంటె పెరుగుతున్నారు. కొన్ని జిల్లాల్లో పార్టీకి నాయకత్వమే కరవవుతోంది. మునిగిపోయే నావకు తెడ్డు వేయడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. సాధారణంగా జగన్మోహన్ రెడ్డికి ఉండే అహంకారం చాలా ఎక్కువ. పార్టీకి దూరం అయ్యేవారిని ఆయన బతిమాలేది ఉండదు గాక ఉండదు. బతిమాలడం కాదు కదా.. కనీసం ఒకసారైనా మాట్లాడి.. పార్టీని వీడవద్దు అని చెప్పడం కూడా ఉండదు. అలాంటిది జగన్మోహన్ రెడ్డి తన అహంకారాన్ని అనేక మెట్లు తగ్గించుకుని.. అడిగినా కూడా ఇప్పుడు సొంతవాళ్లు కూడా పట్టించుకోవడం లేదు. పార్టీ బాధ్యతలలోకి రావడానికి ఇష్టపడడం లేదు.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఒకప్పుడు కంచుకోటగా కనిపించిన ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పరిస్థితి ఇప్పుడు చాలా చాలా దయనీయంగా ఉంది. ఒంగోలు జిల్లా అధ్యక్షుడు వెంకటరెడ్డి రాజీనామా చేసిన తర్వాత అసలు దిక్కులేకుండా పోయింది. జగన్మోహన్ రెడ్డి తన సహజశైలిలో ఒక తప్పుడు ఆలోచన చేస్తూ అక్కడ ఎంపీగా పోటీచేసిన చెవిరెడ్డి భాస్కర రెడ్డినే జిల్లా అధ్యక్షుడిగా చేయాలని భావించారు. అయితే ఈ ఆలోచన పట్ల తీవ్రస్థాయిలో వ్యతిరేకత వ్యక్తం అయింది. జిల్లాలోని పార్టీ వర్గాలు భగ్గుమన్నాయి. జిల్లాలో సరైన నాయకుడికి గతిలేనట్టుగా చెవిరెడ్డిని బయటినుంచి తీసుకువస్తే ఊరుకునేది లేదని అంతా ఎగిరెగిరి పడ్డారు. ఎంపీ టికెట్ సమయంలోనే విపరీతమైన వ్యతిరేకత వ్యక్తంకాగా, జగన్ అప్పట్లో బుజ్జగించారు. ఇప్పుడు పార్టీకి అసలు సారథి లేకుండాపోయారు.

ఈలోగా పార్టీ అస్తవ్యస్తం అయిపోతోంది. గిద్దలూరు మునిసిపాలిటీ తెదేపా ఖాతాలోకి వెళ్లిపోయింది. అదే మాదిరిగా.. ఒంగోలు కార్పొరేషన్ కూడా చేజారిపోయింది. బాలినేని పార్టీని పట్టించుకోవడం మానేశారు. ఎన్నికల సమయంలో.. జిల్లా రాజకీయాల విషయంలో తన ఆలోచనకు విలువ ఇవ్వాలని బాలినేని పదేపదే కోరినా పట్టించుకోకుండా అహంకారం ప్రదర్శించిన జగన్మోహన్ రెడ్డి , కాస్త తగ్గి.. బాలినేని చేతిలోనే పగ్గాలు పెట్టాలని అనుకున్నారు. ఆయన ఒప్పుకోలేదు. ప్రత్యేకంగా తాడేపల్లికి పిలిపించి కూడా మాట్లాడారు. అయినా బాలినేని ససేమిరా వద్దని, తాను అసలు పార్టీ పదవులకు, కార్యక్రమాలకు కొన్నాళ్లకు దూరంగా ఉండదలచుకున్నానని తేల్చిచెప్పి వెళ్లిపోయారు. జగన్ అహంకారం తగ్గినా సరే.. ఇప్పుడు పట్టించుకునే వారు లేకుండాపోయారని పార్టీలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి.

Related Posts

Comments

spot_img

Recent Stories