వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇంకా తాను ముఖ్యమంత్రిని అనే భ్రమలోనే బతకడానికి ఇష్టపడుతున్నారు. ఆయన ఓడిపోయి మూడు నెలలు గడుస్తున్నాయి. కానీ ముఖ్యమంత్రిగా వెలగబెట్టినప్పటి అహంకారం ఛాయలు మాత్రం ఆయనలో ఇప్పటిదాకా తొలగిపోలేదు. ప్రతిపక్షం విషయంలో ప్రజల విషయంలో ఈ అహంకారాన్ని అపరిమితంగా ప్రదర్శించడం ఒక ఎత్తు.. కనీసం తన సొంత పాస్పోర్టు రెన్యువల్ చేసుకునే విషయంలో.. కోర్టుల విషయంలో కూడా జగన్ అహంకారం వదలక పోవడం ఆయనకే ఇబ్బందిగా మారుతోంది.
ముఖ్యమంత్రి పదవి పోయినా సరే తనకు ముఖ్యమంత్రి స్థాయి సెక్యూరిటీ ఉండాలని… కేవలం 11 మంది ఎమ్మెల్యేలు మాత్రమే గెలిచినా సరే తనకు ప్రతిపక్ష నాయకుడు హోదా కావాలని.. జగన్ గొంతెమ్మ కోరికలు కోరడం మామూలైపోయింది.
ఆ క్రమంలో భాగంగానే జగన్మోహన్ రెడ్డి తాను కోర్టులను కూడా గౌరవించనని, తాను అడిగింది మాత్రం నెరవేరాలని అనుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాక ముందు నుంచి ఆయన మీద విజయవాడ ప్రజా ప్రతినిధుల కోర్టులో పరువు నష్టం కేసు ఉంది. 2019 ఎన్నికలలో, 2024 ఎన్నికలలో కూడా తన మీద కేసు ఉన్న విషయాన్ని ఆయన ఎన్నికల అఫిడవిట్లలోనూ ప్రస్తావించారు. కానీ ఇప్పుడు అదే కోర్టు- విదేశాలకు వెళ్లడానికి ఏడాది మాత్రమే పాస్పోర్ట్ రెన్యువల్ చేయాలని ఆదేశించేసరికి.. అసలు అక్కడ కేసు ఉన్న సంగతి తనకు తెలియదని సమన్లు అందనే లేదని బొంకుతున్నారు.
సీఎంపదవి ఢమాల్అనడంతోనే.. ఆయన డిప్లమాట్ పాస్ పోర్టుకూడా రద్దయింది. సాధారణ పాస్ పోర్టు అయిదేళ్లు ఇవ్వాలని సీబీఐకోర్టు ఆదేశిస్తే.. ఏడాది రెన్యువల్ చేస్తే చాలునని విజయవాడ ప్రజాప్రతినిధుల కోర్టు షరతు విధించింది. దానికి కూడా జగన్ స్వయంగా వచ్చి 20వేల పూచికత్తు బాండుసమర్పించాలని పేర్కొంది. అయితే.. ఈ చిన్న కోర్టుకు వెళ్లడాన్ని జగన్ నామోషీగా ఫీలవుతున్నారు. వారి షరతులు రద్దు చేయమని హైకోర్టుకు వెళ్లారు.
విజయవాడ ప్రజా ప్రతినిధులు కోర్టుకు హాజరు కావడం అవమానంగా భావిస్తున్న జగన్మోహన్ రెడ్డి భార్య షరతులను రద్దు చేయాలంటూ హైకోర్టును ఆశ్రయించడం చిత్రంగా ఉంది. న్యాయస్థానం విషయానికి వస్తే అందరి పట్ల సమాన గౌరవం పాటించాలి. కానీ జగన్ మోహన్ రెడ్డికి ప్రజా ప్రతినిధుల కోర్టు అంటే చులకన లాగా కనిపిస్తుంది. హైకోర్టు ఆయన పిటిషన్ అనుమతిస్తే గనుక నిజంగానే ప్రజాప్రతినిధులు కోర్టును తక్కువ చేసినట్లు అవుతుందని నిపుణులు భావిస్తున్నారు.