ఇప్పుడు హఠాత్తుగా జగన్మోహన్ రెడ్డిలో కొత్త కోణం కనిపిస్తోంది. తల పగ తోక చుట్టరికం సిద్ధాంతాన్ని ఆయన అమలు చేస్తున్నారు. పోలీసు శాఖలో ఐజీ, ఎస్పీ, సీఐలు అందరూ అవినీతి పరులంట.. కానిస్టేబుళ్లందరూ మంచోళ్లంట.. మీకు కష్టం వచ్చినా చూసుకునేది నేనే.. కాబట్టి మీ పై అధికారులు చెప్పే మాటలు వినొద్దు. నేను చెప్పేది మాత్రమే వినండి.. అని ఆయన వారికి సూచిస్తున్నారు. అలాగే హఠాత్తుగా జగన్మోహన్ రెడ్డి.. ఎంప్లాయీ ఫ్రెండ్లీ అవతారం ఎత్తారు. ప్రభుత్వోద్యోగులకు ఐఆర్ ఇవ్వాలన్నా, పీఆర్సీ కోసం డిమాండ్ చేయాలన్నా, వారికి డీఏలు ఇప్పించాలన్నా జగనే ముందుంటాడనేది గుర్తు పెట్టుకోవాలని జగన్ వారికి హితవు చెబుతున్నారు. ఆయనలోని ఈ హఠాత్ పరివర్తన వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులకే ఆశ్చర్యం కలిగిస్తోంది.
జగన్మోహన్ రెడ్డి ఉద్యోగుల కోసం ఎంత గొప్పగా పాటుపడే నాయకుడో.. రాష్ట్రంలోని ప్రతి ఉద్యోగికీ చాలా బాగా తెలుసు. ప్రభుత్వం పీఆర్సీ ప్రకటించిన తర్వాత.. అప్పటిదాకా ఉద్యోగులు తీసుకున్న ఐఆర్ తో కలిపిన జీతాలకంటె తక్కువ వేతనాలు డిసైడ్ కావడం అనేది దేశ చరిత్రలోనే ఎక్కడా లేని సంగతి. పీఆర్సీ ప్రకటించిన తర్వాత.. ఉద్యోగులు అప్పటి దాకా తీసుకున్న జీతాల నుంచి రికవరీ పెట్టాలనే ప్రతిపాదన చేసిన ప్రభుత్వం బహుశా ప్రపంచంలోనే మరొకటి లేకపోవచ్చు. పీఆర్సీ రూపంలో దేశంలోనే అతిపెద్ద వంచన జగన్ హయాంలో ఏపీ ఉద్యోగులకు జరిగింది. ఉద్యోగులు అనేక విడతల పోరాటాల తర్వాత అంతో ఇంతో తెరపిన పడ్డారు. వీటన్నింటినీ మించి.. తను అధికారంలోకి వచ్చిన కేవలం వారం రోజుల్లోగా కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానం రద్దు చేసి, పాత పెన్షన్ విధానం పునరుద్ధరిస్తానని చెప్పి.. అధికారంలోకి వచ్చిన తర్వాత.. అయిదేళ్ల పాటు ఉద్యోగులను వంచించిన ఘనత జగన్ సొంతం. తనమీద వ్యతిరేకత ఉన్నదనే భయంతో.. టీచర్లను అసలు ఎన్నికల విధుల్లో పాల్గొనకుండా చేయాలని కుట్రలు పన్నిన వ్యక్తి జగన్. ఈయన ప్రభుత్వ కాలంలో ఉద్యోగులు ఏ ఆందోళనలు చేసినా అత్యంత నిర్దాక్షిణ్యంగా ఉక్కుపాదంతో అణిచేసిన చరిత్ర ఆయనది. కేవలం ఉద్యోగుల ఆందోళనను అణచివేయడంలో కాస్త విఫలం అయ్యారనే దుగ్ధతో రాష్ట్ర డీజీపీగా ఉన్న గౌతం సవాంగ్ ను మార్చేసి, పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు పంపిన వ్యక్తి ఆయన
తన ట్రాక్ రికార్డులో ఉద్యోగులను ఇన్ని రకాలుగా వేధించి.. ఆ వర్గాల్లో శాశ్వతమైన అపకీర్తిని వ్యతిరేకతను మూటగట్టుకున్న జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. వారికి పీఆర్సీ కావాలన్నా సరే.. తానే పోరాడుతానని అంటున్నారు. ఈ మాటలు విని.. జగన్ గారూ తమరు ఒకసారి ఇచ్చిన పీఆర్సీ చాలు. మాకోసం కొత్తగా ఎలాంటి పోరాటాలు చేయవద్దు. ఖర్మగాలి మీరు మళ్లీ అధికారంలోకి రావడం అంటూ జరిగితే.. పాత పెన్షన్ స్కీమ్ పునరుద్ధరిస్తానన్న హామీ నిలబెట్టుకోండి చాలు అని ఉద్యోగులు నవ్వుకుంటున్నారు.