జగన్మోహన్ రెడ్డి స్థాయి ఏమిటనేది నిర్ణయించి దానికి తగిన విధంగా భద్రత ఏర్పాట్లను కల్పించలేకపోయినప్పుడు మాత్రమే పోలీస్ యంత్రాంగాన్ని నిందించాలి. అలాకాకుండా పోలీసులు తనకోసం ఏర్పాటు చేసిన కారు తనకు నచ్చలేదంటూ ఆ కారుదిగి మరొక కారులో ప్రయాణించడం అనేది పూర్తిగా ఆయన సొంత విషయం. సొంత ఉబలాటం. అంతేతప్ప దానికి ప్రభుత్వానికి ముడి పెట్టడానికి వీల్లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి ఎలాంటి సంకుచితమైన నాయకుడు అంటే.. వినుకొండ పర్యటనకు బయలుదేరి పోలీసులు తమకు సమకూర్చిన వాహనం నుంచి మధ్యలోనే దిగేసి, అది ఫిట్నెస్ తో లేదంటూ మరో వాహనం ఎక్కి వెళ్లడం జరిగింది. ఫిట్నెస్ లేకపోవడం అనేది కేవలం మాయ, అబద్ధం. మహా అయితే ఆయన కోరుకునే స్థాయి వైభోగం ఆ కారులో ఉండకపోవచ్చు.
జగన్మోహన్ రెడ్డి కారు ఫిట్నెస్ పేరుతో తాజాగా ఒక డ్రామా నడిపించారు. పెనుకొండ రషీద్ కుటుంబాన్ని పరామర్శించేందుకు బయలుదేరిన తర్వాత వాహనం మారారు. తనకు ఇచ్చిన వాహన శ్రేణి ఫిట్నెస్ తో లేవంటూ ఆరోపించారు. నిజానికి ప్రస్తుతానికి జెడ్ ప్లస్ స్థాయి కేటగిరి భద్రత జగన్కు కల్పిస్తున్నామని ఆయనకు సమకూర్చిన వాహనాలన్నీ కూడా పూర్తి ఫిట్నెస్తో ఉన్నాయని పోలీసులు అంటున్నారు. జగన్ దిగేసిన తర్వాత అదే కారు.. జగన్ కాన్వాయ్ తో పాటూనే వెళ్లింది. ఫిట్ నెస్, పికప్ లేకపోతే.. అదే కాన్వాయ్ లో ఎలా వెళుతుంది? అనేది పోలీసుల ప్రశ్న.
ఇక్కడ కీలకంగా గమనించాల్సిన విషయం ఏమిటంటే జగన్మోహన్ రెడ్డికి ప్రత్యేకంగా వాహనశ్రేణిని సమకూర్చాల్సిన అవసరం పోలీసులకు ఏముంది. ఆయన కేవలం ఒక మామూలు ఎమ్మెల్యే! రాష్ట్రంలో ఉండే అందరూ ఎమ్మెల్యేలకు వాహన శ్రేణులు సమకూర్చడం పోలీసుల పని కాదు. జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి అయితే కావచ్చు గాక. కానీ కనీసం క్యాబినెట్ హోదా ఉన్న ప్రతిపక్ష నాయకుడు కూడా కాదు. ప్రతిపక్ష నాయకుడిగా ఉండగా అదే కారులో చంద్రబాబు కొన్ని వేల కిలోమీటర్లు, ఎలాంటి కంప్లయింటు చేయకుండా తిరిగారు.
జగన్ కు అసలు వాహనాలు ఇవ్వడమే చంద్రబాబు ప్రభుత్వం ఔదార్యం కింద లెక్క. నిజానికి జగన్ కంటే సీనియర్ ఉమ్మడి రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రి అయిన కిరణ్ కుమార్ రెడ్డికి ప్రభుత్వం ఎలాంటి ప్రోటోకాల్ మర్యాదలు కల్పిస్తుందో ఆ స్థాయిలో జగన్ కి ఇస్తే చాలు అనుకోవాలి. ఎందుకంటే ఇద్దరూ మాజీ ముఖ్యమంత్రులే గనుక. అంతకంటే ఎక్కువ తనకు అందుతున్నప్పటికీ జగన్ మాత్రం అలుగుతున్నారు. ఇలాంటి కుటిలయత్నాలన్నీ కూడా కేవలం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మీద బురద చల్లడానికి మాత్రమే అని ప్రజలు విశ్లేషిస్తున్నారు.