జనం నమ్మరని, నవ్వుతారని భయం ఉండబట్టి సరిపోయింది గానీ.. లేకపోతే.. రోడ్డు ప్రమాదంలో మరణించిన వారిలో ఒక వైసీపీ కార్యకర్తయినా ఉంటే గనుక.. అది కూడా ప్రభుత్వం చేయించిన రాజకీయ హత్య అని బురద చల్లడానికి వెనుకాడే రకం కాదు జగన్మోహన్ రెడ్డి. వైసీపీ నేతను చంపడానికి రోడ్డుప్రమాదం సృష్టించారని కూడా ఆరోపించగల తెంపరితనం, మాటల చాతుర్యం ఆయనకు ఉన్నాయి. మామూలు దొమ్మీలు, వ్యక్తిగత కక్షలతో జరిగిన హత్యలను కూడా రాజకీయ హత్యలుగా ముడిపెట్టి పబ్బం గడుపుకోవడానికి ఆయన ఈ తొమ్మిదినెలల కాలంలో పలుమార్లు ప్రయత్నించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించిపోయాయని, రాష్ట్రపతి పాలన విధించాలని కూడా ఆయన తరఫున అభ్యర్థనలు వెళ్లాయి. అలాంటి జగన్మోహన్ రెడ్డి.. ఇప్పుడు రాష్ట్రంలో జరిగిన అసలు సిసలు రాజకీయ హత్య విషయంలో నోరు మెదపకుండా మౌనం పాటిస్తున్నారు ఎందుకు? అనేది అర్థం కాని సంగతి.
కేవలం ఎన్నికల నాటి విభేదాలను మనసులో పెట్టుకుని, వాటిని ముదరబెట్టి.. తాము దొంగఓట్లు వేసుకోవడానికి వీలులేకుండా.. పోలింగ్ ఏజంటుగా కూర్చున్న తెలుగుదేశం కార్యకర్తను చంపేసి, అతడి కొడుకును కూడా చంపడానికి ప్రయత్నించిన వైసీపీ దురాగతాల విషయంలో ఆయన స్పందన ఏమిటో చూడాలని తెలుగు ప్రజలు అనుకుంటున్నారు. అయిదేళ్లపాటూ రాజ్యం చేస్తూ జగన్ చేసిన అన్ని కీలక దందాలకు ప్రధాన సూత్రధారిగాను, పాత్రధారిగాను ఉన్నట్టువంటి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సొంత నియోజకవర్గం పుంగనూరు పరిధిలో అచ్చమైన రాజకీయ హత్య జరిగింది. అయితే ఈ విషయంలో వైసీపీ నేతలెవ్వరూ నోరు మెదపడం లేదు. ఇద్దరు పోలీసులు ఇప్పటికే సస్పెండ్ అయ్యారు. హత్య చేసినది ఎవరో స్పష్టమైన ఆధారాలు దొరికాయి.
అలాంటి నేపథ్యంలో కాస్త సంయమనం, లౌక్యం ఉన్న నాయకుడైతే.. ఈ హత్యను రాజకీయ హత్యగా అభివర్ణించలేం అని.. వారి మధ్య వ్యక్తిగత, స్థల వివాదాలు కూడా ఉన్నాయని బుకాయింపు మాటలు చెప్పి అయినా.. పార్టీమీద మరకపడకుండా చూసుకోవడానికి ప్రయత్నిస్తారు. కానీ.. వైసీపీ అగ్రనేతల నుంచి అలాంటి ప్రకటన కూడా రావడం లేదు.
జగన్మోహన్ రెడ్డి ఇన్నాళ్లపాటూ వైసీపీ నేతలు ఎక్కడైనా మరణిస్తే.. వారివి రాజకీయ హత్యలుగా అభివర్ణించడానికి తెగ తాపత్రయపడుతుండేవారు. ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తున్నా సరే.. అంగీకరించలేకపోతున్నారు. పుంగనూరు అసెంబ్లీ పరిధిలో పోలింగ్ ఏజంటుగా కూర్చున్న రామక్రిష్ణ నాయుడును వైసీపీ వారు చంపేశారు. బుకాయించడానికి ఆధారాలు ఏమీ వారివద్ద లేవు. అయితే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అయిష్టంగా ధ్వనించే ఏ మాట మాట్లాడడానికి కూడా జగన్ కు ధైర్యం ఉండదని పార్టీలోని కొన్ని వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. పెద్దిరెడ్డి కబంధహస్తాల్లో జగన్ చిక్కుకుని ఉన్నారని అంటున్నారు. మరి జగన్ ఎలా స్పందిస్తారో చూడాలి.