తిరుమల తిరుపతి దేవస్థానాలకు జగన్ ప్రభుత్వ హయాంలో సారథులుగా ఉంటూ.. ఎవరైతే కీలకమైన ఆరోపణలు ఎదుర్కొంటున్నారో.. వారు సుప్రీం కోర్టును అడిగినది వేరు. సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు వేరు. ఇప్పుడు సుప్రీం ఇచ్చిన తీర్పు పిటిషను వేసిన వారికి తియ్యగా ధ్వనించేది ఎంతమాత్రమూ కాదు. కానీ తీర్పు వెలువడిన వెంటనే జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి.. హర్షం వ్యక్తం చేసేశారు. చంద్రబాబుకు సుప్రీం కోర్టు సరైన రీతిలో బుద్ధి చెప్పిందని మురిసిపోయారు. లడ్డూ విషయంలో జరుగుతున్న ప్రచారం మొత్తం అబద్ధం అని తెలిసినా దుర్మార్గానికి పాల్పడుతున్నారని, పవన్ కల్యాణ్ కూడా అబద్ధానికి రెక్కలు కట్టారని చాలా చాకచక్యంగా ప్రశ్నించారు. జగన్ ప్రెస్ మీట్ ను గమనించిన తర్వాత.. సామాన్యులకు కలుగుతున్న సందేహం ఏంటంటే.. జగన్మోహన్ రెడ్డికి అసలు సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు అర్థమైందా? లేదా? అర్థమైనా కూడా.. ముప్పు తనమీదకు వచ్చేవరకు ఏదో మాయమాటలతో బుకాయిస్తూ గడపవచ్చునని మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారా? అర్థం కావడం లేదు. మొత్తానికి.. సుప్రీం తీర్పు చంద్రబాబు సర్కారుకు చెంపపెట్టు అన్నట్టుగా జగన్ మురిసిపోవడం తమాషాగా ధ్వనిస్తోంది.
తిరుమల లడ్డూ తయారీకి వినియోగించే నెయ్యి కల్తీ అవుతోందనే విషయంలో నిందలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్ఠీ మీద ఉన్నాయి. ఎఆర్ డెయిరీకి కాంట్రాక్టు దక్కేలాగా.. అనేక నిబంధనలను మార్చారనేది స్పష్టం. అన్ని చేయడం వల్ల మాత్రమే వారు టెండరు దక్కించుకోగలిగారు. అలా నిబంధనలన్నీ మార్చడం అప్పటి టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి తెలియకుండా జరుగుతుందనుకుంటే భ్రమ. 2023 లో పూర్తిగా ఏడాదికూడా పదవీకాలం ఉండదని తెలిసికూడా ఛైర్మన్ గిరీ కోసం జగన్ ను ఒత్తిడిచేసి స్వీకరించిన భూమన కరుణాకరరెడ్డి.. నెయ్యి వివాదం రేకెత్తిన తర్వాత.. తిరుమల దేవుడి ఆలయం ముందు ప్రమాణం చేశారు. తాను ఛైర్మన్ గా ఉండగా, నెయ్యి కాంట్రాక్టులకు సంబందించి ఎలాంటి తప్పు చేసి ఉన్నప్పటికీ కూడా.. తాను గానీ తన కుటుంబంగానీ సర్వనాశనం అయిపోతామని ఆయన ప్రకటించారు. అంతే తప్ప.. జగన్ పరిపాలన సాగిన అయిదేళ్ల కాలంలో కాంట్రాక్టుల విషయంలో ఎలాంటి మతలబులు, లాలూచీ వ్యవహారాలు జరగనే లేదని ఆయన ధ్రువీకరించలేదు. అయితే ఆయనకు ముందు ఛైర్మన్ గా పనిచేసిన వైవీ సుబ్బారెడ్డి ఇలాంటి ప్రమాణాలేమీ చేయలేదు గానీ.. నేరుగా వెళ్లి సుప్రీం కోర్టు తలుపు తట్టారు.
రాష్ట్రప్రభుత్వం అప్పటికే సిట్ ఏర్పాటుచేసి దర్యాప్తు సాగిస్తుండగా సుప్రీం తీర్పు మేరకు దానిని రద్దు చేశారు. తాజాగా సుప్రీం తీర్పు మేరకు మరో సిట్ ఏర్పాటవుతుంది. అందులో రాష్ట్ర పోలీసు అధికారులు కూడా ఇద్దరుంటారు. ఈ మొత్తం వ్యవహారంలో జగన్ కు అనుకూల తీర్పు వచ్చిందని వారు ఎందుకు అనుకుంటున్నారో తెలియదు. చంద్రబాబుకు బుద్ధి వచ్చేలా సుప్రీం తీర్పు ఉన్నదని జగన్ అనడం కేవలం ఆయన అజ్ఞానానికి నిదర్శనం అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. సుప్రీం తీర్పు వలన సీబీఐ కూడా రంగంలోకి దిగి.. అయిదేళ్లలో టీటీడీ టెండర్లలో జరిగిన అక్రమ లావాదేవీలన్నీ వెలుగులోకి తీస్తే గనుక.. తమ బండారం బయటపడుతుందని జగన్ కు లోలోన భయం ఉన్నదని, కాకపోతే, పైకి ఆయన మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.