అర్హత లేకపోయినా సరే.. తనకు ప్రధాన ప్రతిపక్ష హోదా కావాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా పట్టుదలగా పోరాడుతున్నారు. అందుకు ఆయన అనేకానేక అర్థసత్యాలను, అసత్యాలను ఆశ్రయిస్తున్నారు. సభలో పదిశాతం సీట్లు గెలవాలనే నిబంధన ఎక్కడా లేదని కూడా అంటున్నారు. ప్రతిపక్ష నాయకుడిగా తనను సీఎం తర్వాత ప్రమాణానికి పిలవకుండా అవమానించారని పాపం.. ఉడికిపోతున్నారు. ఇంతకీ ఆయన ప్రతిపక్ష హోదా కోసం ఎందుకంత ఆరాటపడిపోతున్నారు. అనేది చాలా మందికి మిలియన్ డాలర్ ప్రశ్న.
నిజానికి జగన్ హోదా కోసం ఇంతగా పట్టుపట్టడం వెనుక రకరకాల కారణాలు వినిపిస్తున్నాయి. ఆ హోదా ఉంటే కేబినెట్ ర్యాంకు దక్కుతుందనేది ఒక ప్రధాన వాదన. నిజమే కావొచ్చు. కానీ.. ముఖ్యమంత్రిగా చేసిన నాయకుడికి కేబినెట్ హోదా కోసం ఇంత ఆరాటం ఎందుకు అనేది చాలా మంది సందేహం.
అసలు శాసనసభకు వెళ్లకుండా ఎగ్గొట్టాలని జగన్ ఆలోచిస్తున్నారని, ఎటూ ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే, ఆ సాకుతో ఎగ్గొడతారని కొందరు అంటున్నారు.
అయితే కీలకంగా తెలుస్తున్నదేంటంటే.. కేబినెట్ ర్యాంకు కోసమే ఆయన ఎక్కువగా ఆరాటపడుతున్నారట. అందుకు సరైన కారణం కూడా ఉంది. కేబినెట్ ర్యాంకు ఉంటే.. ఆయనను అరెస్టు చేయడానికి గవర్నరు అనుమతి తీసుకోవాల్సి వస్తుంది. మామూలు ఎమ్మెల్యే అయితే ఏ క్షణంలో అయినా అరెస్టు చేయవచ్చు.
ఇప్పటికే జగన్ బెయిలు మీద బయట ఉన్నారు. ఆ కేసుల సంగతి వేరు. కాగా గత అయిదేళ్లలో ఆయన ప్రభుత్వం సాగించిన అవినీతిమయమైన పాలన మీద కొత్త ప్రభుత్వం ఎన్ని కేసులు నమోదు చేస్తుందో తెలియదు. ఎన్నికేసుల్లో ఎన్ని సార్లు అరెస్టు కావాల్సి వస్తుందో తెలియదు.
జగన్ తన పాలనలో.. చంద్రబాబునాయుడు ప్రతిపక్ష నాయకుడు అయినా కూడా.. గవర్నరు అనుమతి లేకుండానే అరెస్టు చేయించారు. ఫేక్ కేసులో అరెస్టు కూడా చాలా దుర్మార్గంగా చేయించారు. అలాంటిది ఇప్పుడు తనను కూడా తన అవినీతి కేసుల్లో పక్కా ఆధారాలతో అరెస్టు చేస్తారని ఆయన భయం. అరెస్టు తప్పదు గానీ.. కాస్త కవచం లాగా గవర్నరు అనుమతి అనే వెసులుబాటు కొంత ఉంటుంది గనుక.. ప్రతిపక్ష హోదా కోసం జగన్ అంతగా ఆరాటపడిపోతున్నట్టు తెలుస్తోంది.