శ్రీకాళహస్తి జనసేన పార్టీ ఇన్చార్జి వినుత- ఆమె భర్త చంద్రబాబు కలిసి ఆమె పీఏ రాయుడును హత్య చేసిన వ్యవహారం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా సంచలనాంశం అవుతోంది. వినుత ప్రవర్తించిన తీరును, ఆమె భర్త పాల్పడిన దుర్మార్గాన్ని సహించలేకపోయిన జనసేన పార్టీ అధిష్ఠానమే వారిద్దరినీ పార్టీనుంచి వెలివేస్తూ నిర్ణయం తీసుకుంది. జనసేనలో రకరకాల ఆరోపణలు ఎదుర్కొన్న అనేకమంది ఇతర నాయకుల విషయంలో తొలుత పార్టీనుంచి సస్పెండ్ చేసి, ఆ తర్వాత నేరాలు నిరూపణ అయ్యేదాన్ని బట్టి తదుపరి చర్యలు తీసుకోవడం అనే విధానం అవలంబిస్తున్న జనసేన.. ఇక్కడ ఏకంగా పార్టీ ఇన్చార్జి, ఆమె భర్త నేరానికి పాల్పడగా.. వారిని వెంటనే పార్టీనుంచి బహిష్కరించింది. అయితే.. పార్టీ వెలివేసిన తర్వాత.. వినుత, స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి దీని వెనుక ఉన్నాడంటూ.. నిరాధార ఆరోపణలకు దిగుతుండగా.. ఆమెకు మద్దతుగా.. సుధీర్ రెడ్డి తప్పు చేసినట్టుగా చాటిచెప్పడానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మరియు సాక్షి మీడియా రంగంలోకి దిగుతున్నారు. ఆ రకంగా తమ దిగజారుడుతనాన్ని ప్రదర్శించుకుంటున్నారు.
వినుత పీఏ రాయుడు హత్యకు గురికావడానికి సంబంధించి ప్రధానంగా రెండు కారణాలు వినిపిస్తున్నాయి. ఒకటి- వారి ప్రెవేటు వీడియోలు తీశాడని అంటుండగా.. రాయుడు తన డబ్బు, తన మిత్రులనుంచి తెచ్చిన డబ్బు సుమారు కోటిరూపాయల వరకు వినుత దంపతులకు ఎన్నికల సమయంలో ఇచ్చారని, ఆ డబ్బు తిరిగి ఇవ్వాల్సిందిగా గట్టిగా డిమాండ్ చేయడంతో ఏకంగా హత్యచేసి అడ్డు తొలగించుకున్నారని కూడా వినిపిస్తోంది. అయితే వినుత, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డిని టార్గెట్ చేస్తుండడం విశేషం. నిజానికి వీరిద్దరి మధ్య ఎన్నికలకు ముందునుంచే విభేదాలు ఉన్నాయి. ఎన్నికల సమయంలో వినుతకు ఎంతో కొంత డబ్బు ఇచ్చి సహకారం పొందవలసిందిగా జనసేన పెద్దలు సుధీర్ రెడ్డికి చెప్పినట్టుగా సమాచారం ఉంది. ఆ మేరకు ఆయన తన మనుషుల్ని పంపినప్పుడు తాను ప్రచారానికి రావాలంటే, ఎన్నికలకు సహకరించాలంటే 20 కోట్లు కావాలని అడిగినట్టుగా తెలుస్తోంది. అంత డబ్బు ఇచ్చుకోలేనని జనసేన పార్టీ పెద్దలకే తెలియజెప్పి బొజ్జల సుధీర్ రెడ్డి మిన్నకుండిపోయారు. ఆమె కూడా ప్రచారంలో వారికి సహకరించలేదు.
పార్టీనుంచి ఒత్తిడి వస్తుండేసరికి.. తనకోసం కారు పంపితే వస్తానని, తనకోసం కారు పంపేప్పుడు సుధీర్ రెడ్డి లేదా ఆయన భార్య తన ఇంటికి వచ్చి తనను అడిగి ప్రచారానికి తీసుకువెళ్లాలని ఇలా రకరకాల కండిషన్లు పెట్టారు వినుత. దీంతో సుధీర్ రెడ్డి ప్రచారం సమయంలో ఆమెను పూర్తిగా పక్కన పెట్టేశారు.
ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. ఆమె రకరకాల నామినేటెడ్ పదవులు అడుగుతున్నారు గానీ.. ఎన్నికల్లో మనస్ఫూర్తిగా పనిచేయని కారణంగా పవన్ కల్యాణ్ కూడా పట్టించుకోలేదని సమాచారం.
ఈ నేపథ్యంలో.. ఇప్పుడు హత్యకేసులో అరెస్టు అయిన ఆమె.. బొజ్జల సుధీర్ మీద కక్ష సాధించాలనుకుంటోంది. ఆమె పాటలకు పక్కవాయిద్యం వాయిస్తూ సాక్షి మీడియా కూడా ఆమె చేస్తున్న దుర్బుద్ధి నిందలను హైలైట్ చేయడానికి తపన పడుతుండడం గమనార్హం. చూడబోతే.. వినుతను తమ పార్టీలోకి తీసుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ ఆరాటపడుతున్నట్టుగా ఉన్నదని, వారికి రౌడీలు గూండాలు, హంతకులు తప్ప మరెవ్వరూ దొరకరేమోనని ప్రజలు నవ్వుకుంటున్నారు.