కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తనకు ప్రియమైన తమ్ముడు అని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పదేపదే చెప్పుకుంటూ ఉంటారు. అందుచేతనే.. తన సొంత బాబాయి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అవినాష్ రెడ్డి పాత్ర గురించి ఎంత చర్చ జరుగుతున్నా సరే.. ఆధారాలన్నీ అటుకేసి చూపిస్తున్నా సరే.. ఆయనను వెనకేసుకు రావడానికి తన శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తూ వచ్చారు. అలాంటిది.. జగన్ మార్గదర్శకత్వంలో రాష్ట్రంలో మూడున్నర వేల కోట్ల రూపాయల అతిపెద్ద అవినీతి కుంభకోణం అమలు జరిగితే.. అందులో ఈ ప్రియమైన తమ్ముడి పాత్ర లేకుండా ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుంది. అలా వైఎస్ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర రెడ్డిలకు కూడా లిక్కర్ కుంభకోణంలో ఉన్న పాత్రను నిర్ధరించేలా దిగ్భ్రాంతి కరమైన వాస్తవాలు ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తున్నాయి.
మూడున్నర వేల కోట్లరూపాయలు కాజేసిన మద్యం కుంభకోణం మొత్తానికి మూల విరాట్టు, దిశానిర్దేశం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కాగా, దానిని ఆయన కళ్లలో ఆనందం చూడగలిగేలా ఆయన ఆలోచనను ఇంప్రొవైజ్ చేసి అమలు చేసిన వారు కెసిరెడ్డి రాజశేఖర రెడ్డి, అప్పటి ఎంపీలు మిథున్ రెడ్డి, విజయసాయిరెడ్డి, అధికారులు కృష్ణమోహన్ రెడ్డి, ధనంజయరెడ్డి అనే సంగతి ఇప్పటికే తేలింది. పలు ఆధారాలతో సహా బయటకు వచ్చింది. వీరితో సమానంగా ఎంపీ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర రెడ్డి ల పాత్ర కూడా వెలుగులోకి వస్తోంది.
వారి అనుచరుడు, సన్నిహితుడు అయిన హనుమంత రెడ్డి అనే వ్యక్తి గొల్లపూడిలోని ఒక గెస్ట హవుస్ లో ఆర్థోస్ బ్రెవరేజెస్ కంపెనీ ప్రతినిధి భగత్ సింగ్ తో గతంలో సమావేశం అయ్యారు. మద్యం లిక్కర్ పాలసీ వచ్చిన తర్వాత.. తాము సూచించిన విధంగా ముడుపులు చెల్లిస్తేనే.. వారి కంపెనీకి ఆర్డర్లు ఇస్తామని బెదిరించారు. తమకు ముడుపులు ఇవ్వడానికి ఒప్పుకోకపోతే.. సరకు అమ్ముకునే అవకాశమే లేకుండా చేస్తామని తుపాకీ చూపించి మరీ బెదిరించినట్టుగా పోలీసులు గుర్తించారు. సదరు హనుమంత రెడ్డి ఇదంతా కూడా భాస్కర రెడ్డి, అవినాష్ రెడ్డి సూచనల మేరకే చేసి ఉంటారనే దిశగా ఇప్పుడు పోలీసులు విచారణ సాగిస్తున్నారు.
ఈ తండ్రీ కొడుకులు వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక నిందితులు. అవినాష్ జైలు కు వెళ్లకుండానే బెయిలు తెచ్చుకున్నారు. కానీ భాస్కర రెడ్డి జైలుకు కూడా వెళ్లారు. అవినాష్ రెడ్డిని ఈ కేసు నుంచి కాపాడడానికి తన పరిపాలనకాలం సాగిన అయిదేళ్లలో ఢిల్లీ వెళ్లిన ప్రతిసారీ అదే ఫోకస్ తో గడిపారు. ప్రధాని మోడీ, అమిత్ షా లతో సమావేశమైన ప్రతిసారీ వీరికోసమే పాటుపడేవారనే విమర్శలు కూడా ఉన్నాయి. మొత్తానికి లిక్కర్ కుంభకోణంలో కూడా వారి పాత్ర ఇప్పుడు వెలుగులోకి వస్తోంది.