మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన సంకుచిత మనస్తత్వాన్ని, కురచబుద్ధిని మరోసారి బయటపెట్టుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్టర 16వ శాసనసభ శుక్రవారం నాడు కొలువుతీరింది. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డికి.. లేని గౌరవాన్ని హోదాను సభ కట్టబెట్టినప్పటికీ.. ఆయన ఆ మర్యాదను నిలబెట్టుకుని హుందాగా ప్రవర్తించలేదు. మామూలు ఎమ్మెల్యేగా తన ప్రమాణ స్వీకారం పూర్తయిన వెంటనే.. కనీసం సభలో కూర్చోకుండానే.. ఆయన తాడేపల్లిలోని తన ప్యాలెస్ కు వెళ్లిపోయారు.
మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఈ దఫా 16వ శాసనసభలో కనీసం ప్రధాన ప్రతిపక్ష నేత అనే హోదా కూడా దక్కలేదు. ఎందుకంటే ఆ పార్టీకి శాసనసభలోని మొత్తం సీట్లలో పది శాతం అంటే 18 సీట్లు కూడా దక్కలేదు. ప్రధాన ప్రతిపక్ష నేత హోదా ఉంటే కేబినెట్ హోదా దక్కుతుంది. కేబినెట్ మంత్రి స్థాయి ప్రోటోకాల్ ఉంటుంది. కానీ ఈ దఫా సభలో జగన్ కు అది కూడా లేదు. ఆయన కేవలం సాధారణ ఎమ్మెల్యే మాత్రమే.
కానీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఆయనకు లేని గౌరవాన్ని కట్టబెట్టింది. సాధారణంగా శాసనసభ తొలిసారిగా కొలువు తీరినప్పుడు.. సభా నాయకుడుగా ముఖ్యమంత్రి, ఆ తరువాత మంత్రులు ఎమ్మెల్యేలుగా ప్రమాణం చేస్తారు. వారందరి తర్వాత ప్రధాన ప్రతిపక్ష నేత ప్రమాణం ఉంటుంది. ఆ తర్వాత ఇంగ్లిషు ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో మహిళా ఎమ్మెల్యేలు, తరువాత మిగిలిన ఎమ్మెల్యేలు చేస్తారు. ఆ ప్రకారం జగన్మోహన్ రెడ్డి ప్రమాణం ఎక్కడో మధ్యలో రావాలి. మహిళలందరూ పూర్తయ్యాక, సగం మంది పురుష ఎమ్మెల్యేలు కూడా చేసిన తర్వాత ‘జె’ అక్షరం వద్ద ఆయన పేరు రావాలి. కానీ, ప్రభుత్వం ఆయనకు ప్రతిపక్ష నేత హోదా కట్టబెట్టినట్టుగా మంత్రుల తర్వాత పిలిచింది. తన పేరు పిలవడానికి కొద్ది సేపు ముందే వెనుక దారి గుండా శాసనసభలోకి ప్రవేశించి వెనుక వరసలో తన పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలతో కలిసి కూర్చున్న జగన్, పేరు పిలవగానే వచ్చి ప్రమాణం చేశారు. అనంతరం కూటమి ప్రతినిధులు ఉన్నవైపు తిరిగి అభివాదం చేశారు. ఆతర్వాత ప్రొటెం స్పీకరు వద్దకెళ్లి అభివాదం చేశారు. అక్కడినుంచి నేరుగా బయటకు వెళ్లిపోయారు. మర్యాదకోసం కూడా సభలో కూర్చోలేదు. బయటకు వెళ్లి కొద్ది సేపు డిప్యూటీ స్పీకరు చాంబర్ లో తన పార్టీ ఎమ్మెల్యేలను కలిసిన ఆయన, తర్వాత నేరుగా తాడేపల్లి ప్యాలెస్ కు వెళ్లిపోయారు. సభలో కాసేపు కూర్చోవడానికి కూడా జగన్ కు మొహం చెల్లలేదని, ఆయన తన సంకుచిత బుద్ధిని బయటపెట్టుకున్నారని అంతా వ్యాఖ్యానిస్తున్నారు.