తన పార్టీకి సంబంధించి.. తాను తప్ప మరొకరు నాయకుడిగా ఎస్టాబ్లిష్ కానే కాకూడదు అనే తరహా ఆలోచనతో ఉండే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. తానొక్కడే వందమంది మీదనైనా బురద చల్లగలను అనే ఆలోచనతో ఆయన చెలరేగుతూ ఉంటారు. అయితే ఆయనను ఓడించడానికి ఇప్పుడు ఎన్డీయే కూటమి పార్టీలు ఒక్కటి కావడం, కాంగ్రెస్ కూడా చాలా తీవ్రస్థాయి విమర్శలతో దాడిచేస్తుండడం ఆయనకు మింగుడుపడడం లేదు. పైగా జనసేనాని పవన్ కల్యాణ్.. తన వారాహి యాత్రతో ఆదివారం నుంచి మళ్లీ ప్రచారపర్వంలోకి అడుగుపెడుతుండడంతో.. జగన్ కు ఉక్కిరి బిక్కిరి కానున్నారు. కీలక నేతల ముప్పేట దాడిని ఆయన ఎలా తట్టుకుంటారో చూడాలి.
చంద్రబాబునాయుడు ఒకవైపు జగన్మోహన్ రెడ్డి అరాచక పాలన గురించి ప్రజల ఎదుట వాస్తవాలను విశదీకరిస్తూ.. తాను ప్రభుత్వంలోకి వస్తే ఏం చేస్తానో హామీల వర్షం కురిపిస్తూ ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. జగన్ కాపీ కొట్టడానికి కూడా భయపడే విధంగా ఆయన హామీలు కురిపిస్తున్నారు. మరొక వైపు జగన్ చెల్లెలు వైఎస్ షర్మిల.. తమ చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి హత్య తప్ప తమ పార్టీకి మరో ఎజెండా అంశం లేనే లేదన్నట్టుగా చెలరేగిపోతున్నారు. చిన్నాన్న హంతకులను చట్టసభలకు పంపడానికి జగనన్న సాయం చేస్తున్నారని, హంతకులకు అండగా నిలుస్తున్నారని.. ప్రతిరోజూ నాలుగైదు ప్రజావేదికల మీదినుంచి ఆమె బిగ్గరగా అరచి చెబుతున్నారు. ఆమె చేస్తున్న ఆరోపణలు కడప ఎంపీ నియోజకవర్గం పరిధిలోనే అయినప్పటికీ.. వాటి ప్రతిధ్వనులు రాష్ట్రమంతా వినిపిస్తున్నాయంటే అతిశయోక్తి కాదు. ఇప్పటికే ఈ ఇరువురు నేతల ఇరుపోటుల దాడిలో జగన్ తేరుకోలేకపోతున్నారు. అదే సమయంలో.. అస్వస్థత కారణంగా కొన్నిరోజులు ప్రచారానికి దూరమైన జనసేనాని పవన్ కల్యాణ్ కూడా ఆదివారం తిరిగి సమరాంగణంలోకి అడుగుపెడుతున్నారు.
జగన్ కుత్సితపు కులరాజకీయాలు, దుర్మార్గాల గురించి పవన్ కల్యాణ్ తనదైన శైలిలో ఎలాంటి దాడిచేస్తుంటారో అందరికీ తెలుసు. ఇప్పుడు జగన్ చంద్రబాబు, పవన్, షర్మిలల ముప్పేట దాడిని ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. వీరితో పాటూ.. మరోవైపు బిజెపి రాష్ట్రసారథి పురందేశ్వరి కూడా ఉన్నారు. పురందేశ్వరి అటు లిక్కర్ అక్రమ వ్యాపారాల్లోను, ఇసుక దందాల్లోనూ జగన్ సర్కారు ఎన్నెన్ని వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని కాజేస్తూ.. ప్రజలను కొల్లగొడుతున్నదో, వారి ఒళ్లు గుల్ల చేస్తున్నదో తన ఎజెండాగా చెలరేగుతున్నారు. అంతో ఇంతో నారా భువనేశ్వరి నయం. ఆమె ప్రధానంగా చంద్రబాబు దార్శనికత, ఆయనలోని ప్రజలకు మంచి చేయాలనే తపన గురించి మాత్రమే పాజిటివ్ ప్రచారం చేసుకుంటూ సభలు నిర్వహిస్తున్నారు.
ఇలాంటి నేపథ్యంలో.. తాను తప్ప మరెవ్వరూ ప్రచారానికి అవసరం లేదని భావించే వైఖరి గల జగన్మోహన్ రెడ్డి.. వీరందరి దాడిని, ప్రధానంగా ముప్పేట దాడిని తట్టుకోవాల్సి వస్తోంది. మరి వారి దాడిలో ఆయన ఏమైపోతారో చూడాలి.