గులాబీల బాటలో జగన్ దళాలు చేయొచ్చు కదా?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముంచెత్తిన వరద ముప్పునుంచి బాధితుల్ని ఆదుకోవడానికి రాష్ట్రం నలుమూలల నుంచి మనసున్న ప్రతి ఒక్కరూ కూడా స్పందిస్తున్నారు. స్వచ్ఛంద సంస్థలు, ప్రెవేటు వ్యక్తులు, రాజకీయ పార్టీలు తమకు తోచిన సహాయంతో ఆదుకుంటున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి తప్ప స్పిందించిన నేతలు లేరు. జగన్ మాత్రమే వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించారు. ప్రభుత్వాన్ని నిందించడానికి ప్రయత్నించి భంగపడ్డారు కూడా! అయితే తెలంగాణలో అక్కడి ప్రతిపక్షం భారత రాష్ట్ర సమితి నాయకులు స్పందించిన రీతిలో.. ఇక్కడ వైసీపీ నాయకులు ఎందుకు స్పందించలేకపోతున్నారు? ప్రజలంటే వారికి ఉన్న వాస్తవమైన ప్రేమ అదేనా? అనే అనుమానం ప్రజలకు ఇప్పుడు కలుగుతోంది.

జగన్మోహన్ రెడ్డి ముంపు ప్రాంతాల పర్యటనకు వచ్చారు.. వెళ్లారు తప్ప.. ఒక్క అన్నం పొట్లమైనా సాయం చేశారా? అని చంద్రబాబు నాయుడు ప్రశ్నించడం కూడా జరిగింది. ఆ తర్వాత మొహమాటపడ్డారేమో జగన్ తన తరఫున ఓ కోటి రూపాయల విరాళం ప్రకటించారు. అంతే ఆయన తప్ప ఆ పార్టీలోని మాజీ మంత్రులు, ప్రస్తుత ఎమ్మెల్యేలు, అంతకుమించిన కుబేరుల వంటి నాయకులు ఎవ్వరూ కూడా ఒక్కరూపాయి కూడా ప్రకటించలేదు. పనిగట్టుకుని సహాయక చర్యల మీద బురద చల్లుతూ కాలం గడుపుతున్నారు.

కానీ, తెలంగాణలో పరిస్థితి ఆ విధంగా లేదు. అక్కడ కూడా ఏపీలో మాదిరిగానే వరద కొన్ని ప్రాంతాల్లో తీవ్ర నష్టాన్ని కలుగజేసింది. ప్రభుత్వం చేపడుతున్న సహాయక చర్యల సంగతి తరువాత.. ప్రతిపక్షం భారాసకూడా పెద్దమనసుతో స్పందించింది. తమ పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయం మేరకు ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ ఒక నెల జీతం విరాళంగా ఇవ్వనున్నట్లుగా మాజీ మంత్రి హరీశ్ రావు ఎక్స్ లో పోస్టు ద్వారా ప్రకటించారు. పార్టీ తరఫున ఇప్పటికే సహాయ చర్యలు చేపడుతున్నామని.. అదనంగా ఈ విరాళాలు అందిస్తున్నామని.. ప్రజలు అందరూ కూడా బాధితులను ఆదుకోవడానికి ముందుకురావాలని ఆయన కోరారు.

ఇలాంటి మానవత్వం ఉన్న మాటలు ఏపీలో జగన్మోహన్ రెడ్డి సహా వైసీపీలో ఏ ఒక్క నాయకుడి నోటినుంచి కూడా బయటకు రావడం లేదు. ప్రజలందరూ ముందుకువచ్చి విరాళాలతో బాధితులను ఆదుకోండి.. అని వైసీపీలో ఎవ్వరూ పిలుపు ఇవ్వలేదు. జగన్ కూడా.. ఏదో అందరూ కోటి వంతున ఇస్తున్నారు గనుక.. తన వంతు కోటి ఇచ్చేసి చేతులు దులుపుకున్నారు తప్ప.. ప్రజల పట్ల తన శ్రద్ధ ను నిరూపించుకోలేదు. వైసీపీ ఎమ్మెల్యేలు, నాయకులు కూడా వరద బాధితులను ఆదుకునే విషయంలో ఉదారంగా వ్యవహరించాలని ప్రజలు కోరుతున్నారు. 

Related Posts

Comments

spot_img

Recent Stories