మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పుంగనూరు పర్యటనను రద్దు చేసుకున్నారు. పుంగనూరులో ఏడేళ్ల ముస్లిం బాలిక హత్యకు గురైన నేపథ్యంలో.. 9వ తేదీన అక్కడకు వెళ్లి పరామర్శిస్తానని జగన్ తన టూరు షెడ్యూలు ప్రకటించారు. అయితే అయ్యవారు వచ్చేదాకా అమాస ఆగుతుందా? పోలీసులు తమ పని తాము చేసుకుపోయారు. బాలికను కిడ్నాప్ చేసి చంపేసిన నిందితులను అరెస్టు చేశారు. ఫైనాన్స్ వ్యాపారం చేసే బాలిక తండ్రితో ఉన్న ఆర్థిక విభేదాలే ఈ నేరానికి మూలం తప్ప.. మరో కారణం లేదని ప్రకటించేశారు. ఒక బాలిక మరణించిన తర్వాత.. పుంగనూరుకు వెళితే.. రకరకాలుగా రాద్ధాంతం చేసి రాజకీయంగా లబ్ధి పొందవచ్చు అనుకున్న జగన్మోహన్ రెడ్డి ఆశలు భంగపడ్డాయి. ఆయన అసలు పుంగనూరు పర్యటననే రద్దు చేసుకున్నారు. తనకు రాజకీయ ప్రయోజనం లేనప్పుడు- బాధితులను ఊరడించాల్సిన అవసరమే లేదని అనుకున్న జగన్ బుద్ధి గురించి ప్రజలు ఈసడించుకుంటున్నారు. ఈ విషయంలో తెలుగుమోపో డాట్ కామ్ ఆదివారం నాడే వెల్లడించిన జోస్యమే నిజమైంది.
పుంగనూరులో బాలిక అస్పియా గతనెల 29న కిడ్నాప్ అయింది. ఈనెల రెండు మృతదేహాన్ని కనుగొన్నారు. జగన్ రావాలనే ప్రోగ్రాం కూడా ఖరారయ్యాక రెండు రోజుల కిందటే అక్కడి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిధున్ రెడ్డి కూడా అక్కడకు వెళ్లి ఆమె కుటుంబాన్ని పరామర్శించారు. ఈలోగా పోలీసులు చురుగ్గా వ్యవహరించడంతో కేసు ముడి వీడిపోయింది. ఆదివారం నాటికి బాలికను కిడ్నాప్ చేసి చంపేసిన ముగ్గురిని అరెస్టు చేశారు. ఆమె తండ్రితో ఉన్న ఆర్థిక గొడవల వల్ల చంపేసినట్టు తేల్చారు. అత్యాచారం కూడా లేదని తేల్చారు. దీంతో జగన్ కు కిక్కు దిగిపోయింది.
తాను పుంగనూరుకు వెళ్లి బాలికలకు చంద్రబాబు పాలనలో రక్షణ లేదని, మైనారిటీలకు రక్షణ లేదని, పోలీసుల్ని తమ సొంత పనులకు వాడుకుంటున్నారని రకరకాలుగా నిందలు వేసి రాష్ట్రమంతా రాద్ధాంతం చేయాలని ఎన్నో ఆశలు పెట్టుకున్న జగన్మోహన్ రెడ్డి.. బెంగుళూరు ప్యాలెస్ లో నాల్రోజులు సరదాగా గడిపిన తర్వాత వచ్చి పరామర్శించాలని అనుకున్నారు. ఈలోగా కేసు సాల్వ్ అయ్యాక, కారణాలు ప్రజలకు తెలిశాక.. తాను వెళ్లి చంద్రబాబుపై నిందలు వేస్తే ప్రజలు ఛీకొడతారని ఆయనకు తెలుసు. చంద్రబాబుపై నిందలు వేయకుండా ఆ పర్యటన వేస్టనుకున్నారు. అందుకే ఆయన రద్దు చేసుకోబోతున్నారంటూ తెలుగుమోపో డాట్ కామ్ ఆదివారమే ఓ కథనం అందించింది. అచ్చం అందులో చెప్పినట్టుగానే జరిగింది. జగన్ పర్యటన రద్దయినట్టు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రకటించారు. కాకపోతే.. జగన్ తాను వస్తున్నట్టు ప్రకటించడం వల్లనే.. ముగ్గురు మంత్రులు పుంగనూరు వచ్చి.. ఆ కుటుంబాన్ని పరామర్శించి న్యాయం చేశారని, క్రెడిట్ జగన్ కే దక్కుతుందని అన్నట్టుగా ఆయన మాట్లాడడం కొసమెరుపు.