‘‘అసెంబ్లీలో ప్రధాన ప్రనతిపక్ష పార్టీగా గుర్తింపుతోనే ప్రజాసమస్యలను బలంగా వినిపించే అవకాశం ఉంటుంది. ప్రతిపక్ష పార్టీగా గుర్తింపుతో సబా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు చట్టబద్ధమైన భాగస్వామ్యం లభిస్తుంది. కాబట్టి మాకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వండి’’ అంటూ స్పీకరుకు విన్నవించుకున్న జగన్మోహన్ రెడ్డి లేఖ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. జగన్ ఇలా లేఖ రాయడాన్ని ఒకవైపు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సీనియర్లు చాలా అవమానంగా ఫీలవుతున్నారు. రూల్సు ప్రకారం ఏది దక్కాలని ఉంటే అది దక్కుతుంది.. ప్రతిపక్ష హోదా కావాలంటూ ముష్టెత్తుకోవడం ఏంటని వారు తమలో తాము చర్చించుకుంటున్నారు. దాని వలన జగన్మోహన్ రెడ్డికి కేబినెట్ ర్యాంకు తప్ప పార్టీకి ఒరిగేదేమీ లేదని అంటున్నారు.
కాగా, తెలుగుదేశం వర్గాల్లో కూడా జగన్ మోహన్ రెడ్డి విజ్ఞప్తి పట్ల భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. జగన్ అడిగిన ప్రతిపక్ష హోదా ఇచ్చేయాలని పలువురు నాయకులు స్పీకరు అయ్యన్నపాత్రుడికి సూచిస్తున్నారట.
జగన్మోహన్ రెడ్డి లేఖ రాసిన తర్వాత.. తాను అడిగినట్టుగా హోదా ఇవ్వకపోతే, ఆ సాకు చూపించి.. ప్రజాసమస్యల మీద పోరాడడానికి సభలో అవకాశం లేకుండా చేస్తున్నారు గనుక.. తాను, తమ పార్టీ సభకు వెళ్లము అంటూ సాకులు చెప్పి తప్పించుకు తిరుగుతారని.. రాబోయే అయిదేళ్లపాటు.. ప్రజాసమస్యల్ని సభలో ప్రస్తావించే అవకాశం లేకుండా తమకు ద్రోహంచేశారని మాట్లాడుకుంటూ గడిపేస్తారని వారు విశ్లేషిస్తున్నారు. జగన్ కు అలాంటి అవకాశమే ఇవ్వకుండా.. ఎంచక్కా అడిగిన హోదా ఏదో ఇచ్చేస్తే.. ఆయన సభనుంచి తప్పించుకు పారిపోవడానికి అవకాశమే ఉండదని అంటున్నారు. కేవలం 11 మంది ఎమ్మెల్యేలతో సభలో ఒక వారగా కూర్చుని.. తెలుగుదేశం కూటమి బలాన్ని చూస్తూ ప్రతిరోజూ జగన్ కుములుతూ ఉండాలంటే.. ఆయన అడిగిన ప్రతిపక్ష హోదా తప్పక ఇవ్వాలని పలువురు టీడీపీ సీనియర్లు అంటున్నారు.
నిజానికి జగన్ సభకు రాకుండా రాబోయే అయిదేళ్లూ ఎగ్గొట్టడానికే ఇలాంటి లేఖ రాసినట్టుగా అందరూ గ్రహించారు. ఆయన డ్రామాకు సరిగ్గా చెక్ పెట్టడం అంటే అడిగింది ఇచ్చేయడమే బెటర్ అని అంటున్నారు.