మచిలీపట్నం నుంచి జనసేన పార్టీ తరఫున మంచి విజయాన్ని నమోదు చేశారు వల్లభనేని బాలశౌరి. ఎన్నికలకు కేవలం కొన్ని వారాల ముందు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సిటింగ్ ఎంపీగా ఉన్న బాలశౌరి ఆ పార్టీకి రాజీనామా చేసి, జనసేనలో చేరారు. బందరులో ఎంపీగా పోటీచేయడానికి తమకు బలమైన అభ్యర్థి ఉన్నప్పటికీ కూడా.. చంద్రబాబునాయుడు కూటమి ధర్మాన్ని పాటిస్తూ.. పవన్ కల్యాణ్ డిమాండ్ మేరకు ఆ పార్టీకి కేటాయించిన రెండు ఎంపీ సీట్లలో ఒకటిగా మచిలీపట్నం కూడా ఇచ్చేశారు. ఇలా అనూహ్యంగా జనసేనలోకి వచ్చి.. కూటమి హవా కారణంగా ఘనంగా గెలిచిన బాలశౌరికి అదృష్టం పట్టింది. ఇప్పుడు ఆయనను కేంద్రమంత్రి పదవి వరించబోతున్నట్టుగా బలంగా వినిపిస్తోంది.
నిజానికి వల్లభనేని బాలశౌరి ఎంతోకాలంగా వైఎస్ రాజశేఖర రెడ్డిని, జగన్మోహన రెడ్డిని నమ్ముకుని రాజకీయాల్లో ఉన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ కు ప్రధాన ఆదాయ వనరులుగా ఉన్న నాయకుల్లో ఆయన కూడా ఒకరు. ఎంపీ చేయడం తప్ప వారు కట్టబెట్టినదేమీలేదు. అలాంటిది.. ఆ పార్టీని వీడి ఆయన జనసేనలోకి ఎంట్రీ ఇచ్చిన నేపథ్యం పూర్తిగా వేరు.
ఎన్నికల సమయంలో.. ఎమ్మెల్యే ఎంపీలను అటు ఇటు మారుస్తూ.. ఒకచోట సిటింగులుగా ఉన్న వారిని, వారికి సంబంధం లేని మరో ఊరికి మారుస్తూ రకరకాల టక్కుటమార గజకర్ణ గోకర్ణ విద్యలు ప్రదర్శించిన జగన్మోహన్ రెడ్డి.. అందులో భాగంగా మచిలీపట్నం ఎంపీ బాలశౌరికి కూడా టికెట్ నిరాకరిస్తున్నట్టు ముందే సమాచారం ఇచ్చారు. దీంతో షాక్ తిన్న ఆయన పవన్ కల్యాణ్ ను సంప్రదించి ఆ పార్టీలో చేరారు. తమ పార్టీలోకి వస్తే.. ఎంపీ టికెట్ గ్యారంటీ ఇస్తానని పవన్ కల్యాణ్ ఆయనకు ముందే హామీ ఇచ్చారు కూడా. అనుకున్నట్టుగానే.. ఆ స్థానం పొత్తులలో జనసేనకు దక్కడం, ఆయనకు కేటాయించడం, గెలవడం జరిగింది.
ఇప్పుడు కేంద్రంలో జనసేన కూడా ఒక ముఖ్యమైన భాగస్వామిగా ఉండబోతోంది. ప్రధాని నరేంద్రమోడీ, జనసేనాని పవన్ కల్యాణ్ పట్ల చాలా సానుకూల దృక్పథంతో ఉన్నారు. జనసేనకు ఒక కేంద్రమంత్రి పదవి కేటాయిస్తారని ప్రచారం జరుగుతోంది. జనసేనకు ప్రస్తుతం ఇద్దరే ఎంపీలు ఉన్నారు. ఒకరు బాలశౌరి కాగా, మరొకరు కాకినాడ నుంచి గెలిచిన తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్. అయితే కాకినాడ ఎంపీ ఉదయ్.. రాజకీయాలకు కొత్త. ఇదే మొదటిసారి గెలిచారు. వల్లభనేని బాలశౌరి సీనియర్ నాయకుడు. ఈ సమీకరణాలు ఆయనకు కలిసివస్తున్నాయి. జనసేన కోటాలో దక్కే ఒక్క మంత్రి పదవిని బాలశౌరికి కట్టబెడతారని, ఆరకంగా ఆయనకు జాక్ పాట్ తగిలిందని ప్రచారం జరుగుతోంది.