ఐకానిక్ టవర్స్ పై జె-ట్యాక్స్ భారం రెండువేల కోట్లు!

కేవలం ఒక వ్యక్తి సంకుచితమైన ధోరణి, ఓర్వలేనితనం, అసూయ లాంటి లక్షణాల వల్ల.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఖజానా మీద దాదాపు ఐదువేల కోట్లకు పైగా భారం పడుతుంది- అంటే మనం నమ్మగలమా? కానీ నమ్మి తీరాలి. అప్పటికే పనులు మొదలైన అమరావతి రాజధానిలో, అన్ని పనులనూ అయిదేళ్ల పాటు స్తంభింపజేసేసి, అద్భుత రాజధానిగా అవతరించగల ఆ ప్రాంతాన్ని స్మశానంలాగా మార్చేసిన జగన్మోహన్ రెడ్డి ఎఫెక్ట్ ఇది. అయిదేళ్లు పనులు ఆగిపోవడం వలన.. వాటి పునరుద్ధరణకు అయ్యే వ్యయాలు, నిర్మాణాలకు అప్పటికీ ఇప్పటికీ పెరిగిన అంచనా వ్యయాలు అన్నీ కలిపితే అయిదువేల కోట్ల రూపాయలకు పై మాటే అవుతుంది. ప్రభుత్వ పరిపాలన భవనాలుగా రూపుదిద్దిన ఐదు ఐకానిక్ టవర్ల నిర్మాణానికి మాత్రమే.. గతంలో చంద్రబాబు సర్కారు టెండర్లు పిలిచినప్పటికీ.. ఇప్పుడు మళ్లీ నిర్మాణాలు ప్రారంభించడానికి పూనుకుంటున్నప్పటికీ.. పెరిగిన అంచనా వ్యయం రెండు వేల కోట్ల వరకు ఉంటోంది. ఇది ఖచ్చితంగా రాష్ట్ర ఖజానాకు జగన్ సర్కారు అందించిన శాపాల్లో ఒకటి!

అమరావతి రాజధానిలో అసెంబ్లీ, హైకోర్టు భవనాలతో పాటు.. పరిపాలన కార్యాలయాల కోసం ఐదు ఐకానిక్ టవర్లను నిర్మించాలని చంద్రబాబునాయుడు ప్రభుత్వం అప్పట్లో నిర్ణయించింది. దీనికి సంబంధించి అత్యద్భుతమైన డిజైన్లన్నీ పూర్తి చేసి 2018లోనే టెండర్లు కూడా పిలిచారు. పనులు కూడా ప్రారంభం అయ్యాయి. యుద్ధప్రాతిపదికన నిర్మాణాలు చేపట్టే ఉద్దేశంతో.. పునాదులు వేయడం ప్రారంభించి ఒక స్థాయి వరకు తీసుకువచ్చారు. ఆ సమయంలో రాష్ట్రంలో ప్రభుత్వం మారింది. జగన్ సీఎం అయ్యారు. అమరావతికి శాపం తగిలింది. ఐకానిక్ భవనాల పునాదులు తవ్విన ప్రాంతం మొత్తం  చెరువులాగా మారిపోయింది. ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. విదేశాలనుంచి, ఐఐటీ వంటి అత్యుత్తమ సంస్థల నుంచి ఇంజినీరింగ్ నిపుణులను పిలిపించి.. ఇన్నాళ్లు వృథాగా ఉండిపోయిన ఆ సగం సగం నిర్మాణాలను నాణ్యత నిమిత్తం పరిశీలింపజేశారు. వారందరూ ధ్రువీకరించిన తర్వాత వాటి మీదనే నిర్మాణాలు చేయడానికి నిర్ణయించారు. ప్రభుత్వం పాలన ప్రారంభించి.. ఎనిమిది నెలలు అవుతుండగా.. ఇప్పటిదాకా ఆ ఐకానిక్ భవనాల చుట్టూ నీటిని తోడడానికి, బురదను క్లీన్ చేయడానికి సమయం పట్టిందంటే.. పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
ఆ భవనాల నిర్మాణానికి తాజాగా అంచనాలు తయారు చేయించగా.. పెరిగిన స్టీల్, ఇసుక, ఇటుక ధరల ప్రకారం దాదాపు రెండువేలకోట్ల రూపాయల భారం పడుతోంది. 2018లో టెండర్లు పిలిచినప్పుడు వీటి అంచనా వ్యయం 2703 కోట్లు కాగా.. ఇప్పుడు ఆ అంచనాలు 4687 కోట్లకు చేరుకున్నాయి. అంటే, 1984 కోట్ల అదనపు భారం.. ఐకానిక్ టవర్స్ మీద జే-ట్యాక్స్ అనుకోవాలి. 73 శాతం అంచనా వ్యయం పెరిగింది.
వీటికి తోడు అసెంబ్లీ భవనాల అంచనా 33.8 శాతం, హైకోర్టు భవనం అంచనాలు 21.9 శాతం కూడా పెరిగాయి. భారం ఎంత పెరిగినా సంకల్పించిన రీతిలోనే అద్భుత రాజధాని నిర్మాణం దిశగా చంద్రబాబునాయుడు అడుగులు వేస్తుండడం గమనించాల్సిన సంగతి.

Related Posts

Comments

spot_img

Recent Stories