కేవలం 11 మంది ఎమ్మెల్యేలు మాత్రమే మిగిలిన పార్టీకి నాయకుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి.. తన దమ్మును, తనలోని పోరాటపటిమను నిరూపించుకోవాల్సిన సమయం ఆసన్నం అయింది. ఆయనలోని దమ్మును చూపించాలని ఒకవైపు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కూడా సవాలు విసురుతున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి ఆ సవాలును స్వీకరిస్తారా లేదా? తన దమ్ము, పోరాటపటిమ, ప్రజాసమస్యల పట్ల చిత్తశుద్ధి లను నిరూపించుకుంటారా? లేదా? అనేది ఇప్పుడు కీలకంగా ప్రజలు గమనిస్తున్నారు.
సాధారణంగా రాజకీయ నాయకులు ‘దమ్ముంటే’ అనే పదాలతో సవాళ్లు విసురుతున్నప్పుడు.. అవతలివాళ్లకు ఆచరణ సాధ్యం కాని విషయాలను ప్రస్తావిస్తుంటారు. ఫరెగ్జాంపుల్.. ఒక నాయకుడి అవినీతి గురించి మాట్లాడితే.. ‘దమ్ముంటే సీబీఐ విచారణ కోరు’ అని అంటుంటారు. వాళ్లు ఆ పనిచేయడం ఎన్నటికీ జరగదు. కానీ.. చంద్రబాబునాయుడు, జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి అలాంటి కష్టమైన సవాళ్లు విసరడం లేదు. ఆయన చెబుతున్న పని చాలా సింపుల్. మాజీ ముఖ్యమంత్రిని శాసనసభకు రావాలని మాత్రమే అంటున్నారు. ప్రజలు ఎమ్మెల్యేగా గెలిపించినది, శాసనసభకు వెళ్లి ప్రజల సమస్యల గురించి మాట్లాడడం కోసమే కదా. మరి ప్రజల తీర్పుకు విలువ, గౌరవం ఇచ్చి సభకు రావాలని ఆహ్వానిస్తున్నారు.
జగన్మోహన్ రెడ్డి సభకు వెళ్లకుండా బయట కూర్చుని.. ప్రభుత్వం పట్ల వ్యతిరేకత పెరిగిపోయింది.. ఇప్పుడు ఎన్నికలు పెట్టినా నేనే గెలుస్తా అంటూ ప్రగల్భాలు పలుకుతున్న సంగతి అందరికీ తెలుసు. చంద్రబాబు విధ్వంసం చేస్తున్నారంటూ పసలేని ఆరోపణలు చేస్తున్నారు. అయితే.. చంద్రబాబు కూడా అదే సవాలు విసురుతున్నారు. సభకు రావాలని, అభివృద్ధి ఎవరిదో విధ్వంసం ఎవరిదో చర్చిద్దామని ఆయన పిలుపు ఇస్తున్నారు.
సూపర్ సిక్స్ పథకాలు సూపర్ హిట్ అంటూ చంద్రబాబు ఒక్కటొక్కటిగా అమలు చేసుకుంటూ ప్రజాక్షేత్రంలో దూసుకెళుతూ ఉండగా.. ట్విటర్ లోంచి, బెంగుళూరు ప్యాలెస్ లోంచి బయటకు రాకుండా.. సూపర్ సిక్సూ సెవెనూ అంటూ వెటకారాలు మాట్లాడుతూ.. జగన్ తనను తాను నవ్వుల పాలు చేసుకుంటున్నారు. అందుకే చంద్రబాబు సూపర్ సిక్స్ పథకాల నుంచి ప్రాజెక్టు దాకా అన్నీ చర్చిద్దాం సభకు రావాలని పిలుస్తున్నారు. బాబాయి హత్య, దళిత డ్రైవరు డోర్ డెలివరీ, కోడికత్తి డ్రామా, గులకరాయి హత్యాయత్నం అన్ని విషయాల గురించి శాసనసభలో మాట్లాడాల్సిన అవసరం ఉన్నదని చంద్రబాబు అంటుండడం గమనార్హం. చంద్రబాబు మాటలే అబద్ధాలు అయిఉంటే గనుక.. జగన్ దమ్ముగా శాసనసభకు వచ్చి.. తన ఎమ్మెల్యే పదవికి గౌరవం ఇచ్చి.. ఆ చర్చల్లో దీటుగా పాల్గొనాలని.. ప్రభుత్వ వైఫల్యాలుంటే ఆ విషయం నిరూపించాలని ప్రజలు కూడా కోరుకుంటున్నారు.