దేవదేవుడు వేంకటేశ్వరుడు కొలువైన క్షేత్రం తిరుమల. భక్తి ఉన్న వాళ్లు తిరుమలకు వెళ్లి దర్శించుకోవాలి. లేనివాళ్లు ఇంట్లోనే ఆ దేవదేవుడికి నమస్కరించుకుంటే సరిపోతుంది. ధర్మ ప్రచారంలో భాగంగా.. టీటీడీ కూడా దేశవిదేశాలలోని కొన్ని ప్రాంతాల్లో అక్కడి అనుకూలతలను బట్టి స్వామివారి ఆలయాలు నిర్మిస్తూ.. భక్తుల్లో ధార్మిక చింతన పెంచుతూ ఉంటుంది. అయితే.. తమ ఊరిలో కూడా స్వామివారి ఆలయం ఉండాలని అందరూ కోరుకోవడం తప్పు కాకపోవచ్చు. కానీ అందుకోసం వారేం చేస్తున్నారో కూడా గమనించుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు బిజెపికి చెందిన కేంద్రమంత్రి బండి సంజయ్, తెలంగాణలోని ఆయన సొంత నియోజకవర్గం కరీంనగర్ లో టీటీడీ ఆలయాన్ని నిర్మించాలని ధర్మకర్తల మండలిని కోరుతున్నారు. కోరిక బాగానే ఉంది. మరి ఆ ఆలయం కోసం అవసరమయ్యే ఖర్చును స్థానికంగా తాను విరాళాలుగా సమీకరించి ఇస్తాననే హామీ బండి సంజయ్ ఇవ్వగలరా అనేది ప్రశ్న.
తిరుమల తిరుపతి దేవస్థానం గతంలో శ్రీవాణి ట్రస్టు పేరుతో కొత్త పథకం తీసుకువచ్చింది. ఆ ట్రస్టు కింద టీటీడీకి వచ్చే సొమ్ము మొత్తం వివిధ ప్రాంతాల్లో స్వామివారి ఆలయ నిర్మాణాలకే వెచ్చించాలని నిర్ణయించారు. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. ఈ తరహాలో ఆలయాల నిర్మాణాలు కొనసాగించడానికి సుముఖంగానే ఉన్నారు గానీ.. ఆయా గుడుల నిర్మాణానికి అవసరమయ్యే కోట్లాదిరూపాయల నిధులను స్థానికంగానే అక్కడి భక్తులనుంచి విరాళాలుగా సమీకరించాలనే ఆలోచన చేస్తున్నారు. ఇలాంటి ప్రయత్నాల్లో భాగంగానే.. చెన్నైలో కూడా పూర్తిగా ఒక ప్రెవేటు సంస్థ నిధులతో టీటీడీ ఇచ్చే నమూనా ప్రకారం ఆలయాన్ని నిర్మించి.. టీటీడీకే ఇవ్వడానికి కూడా ప్రయత్నం జరుగుతోంది.
ఇలాంటి నేపథ్యంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ తన ఊరిలో గుడి కట్టాలని అడుగుతున్నారు. 2023లో అక్కడ 10 ఎకరాల స్థలంలో ఆలయ నిర్మాణానికి భూమి పూజ జరిగిందని, రెండేళ్లుగా ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదని అంటున్నారు. టీటీడీ ఆలయ నిర్మాణం కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారు.. యుద్ధప్రాతిపదికన జరిపించండి అంటూ టీటీడీ ఛైర్మన్ కు లేఖ కూడా రాశారు.
మంత్రి గారి కోరిక ఓకే. కానీ.. ఏపీ సర్కారు ఇలాంటి ఆలయ నిర్మాణాలకు స్థానికంగా దాతల సహకారం తీసుకోవాలని నిర్ణయించిన సంగతి సంజయ్ కు తెలియదా? కరీంనగర్ లో కట్టదలచుకున్న ఆలయానికి అయ్యే నిధులను, ఆ ఆలయం కోసం ఎదురుచూస్తున్న భక్తులు, దాతల నుంచి విరాళాలుగా సమీకరించి ఇవ్వడానికి తాను సిద్ధం అని ఆయన ప్రకటించి ఉంటే చాలా గొప్పగా ఉండేది కదా.. అని ప్రజలు అంటున్నారు.