2027లోనే రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు వచ్చేస్తాయని వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఒక బీభత్సమైన ఆశ ఉంది. 2024లో తెలుగు ప్రజలు తిరుగులేని మెజారిటీతో చంద్రబాబునాయుడును ముఖ్యమంత్రిగా గెలిపించారు గానీ.. ఆయన మూడేళ్లకు మించి పదవిలో ఉండే చాన్సులేదని ఆయన కలగన్నారు. కేంద్రం జమిలి ఎన్నికలను ప్లాన్ చేస్తున్న తరుణంలోనే.. అది చట్టరూపం కూడా సంతరించేసుకున్నట్టుగా ఆయన ఒక నిర్ణయానికి వచ్చారు.
దేశంలో జమిలి ఎన్నికలు వస్తే.. ముందస్తుగా అసెంబ్లీకి కూడా ఎన్నికలు తప్పవని, 2027లో ఎన్నికలు ఎదుర్కోవాలని.. పార్టీ శ్రేణులందరూ అందుకు సిద్ధంగా ఉండాలని జగన్ చెప్పుకుంటూ వచ్చారు. అయితే తాజాగా పార్లమెంటు ఎదుటకు వచ్చిన జమిలి బిల్లు.. జగన్ ఆశల మీద నీళ్లు చిలకరించేసింది.
సార్వత్రిక ఎన్నికల తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీనుంచి అనేక మంది నాయకులు రాజీనామా చేసేస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో పార్టీని కాపాడుకోవడం అనేది జగన్ కు కష్టసాధ్యమైన విషయంగా మారుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన 2027లోనే ఎన్నికలు వచ్చేస్తాయి.. మనమంతా సిద్ధంతా ఉండాలి అనే పాట ప్రారంభించారు. నిజానికి జగన్ ఈ పాట ప్రారంభించి ఇప్పటికే రెండు నెలలు అవుతోంది. అంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాలుగు నెలలకే, ముందస్తు ఎన్నికల గురించి జగన్ పాట మొదలెట్టారన్నమాట.
తీరా జమిలి ఎన్నికలకు కేబినెట్ ఆమోదం కూడా తెలియజేసిన తర్వాత.. చంద్రబాబునాయుడును విలేకర్లు ఓ సందర్భంలో జగన్ చెబుతున్న ముందస్తు ఎన్నికల గురించి అడిగారు. ఆ మాటలను చంద్రబాబు తోసిపుచ్చుతూ.. 2029కి ముందు ఏపీలో ఎన్నికలు వచ్చే అవకాశమే లేదని, జమిలి ఎన్నికల గురించి ఎలాంటి అవగాహన లేకపోవడం వల్లనే జగన్ ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారని అన్నారు. తాజాగా పార్లమెంటు ఎదుటకు వచ్చిన బిల్లు స్వరూపస్వభావాలు అర్థమైన తర్వాత.. ఇప్పుడు సభ ఆమోదం పొందినా సరే.. జమిలి ఎన్నికలు 2034 లో మాత్రమే జమిలి వస్తుందని అర్థమవుతోంది. ఈ సంగతి జగన్మోహన్ రెడ్డికి అశనిపాతమే అని చెప్పాలి.
ఈ బిల్లులో పేర్కొన్న ప్రకారం.. 129వ రాజ్యాంగ సవరణ బిల్లు చట్టరూపం సంతరించుకున్న తరువాత.. జరిగే సాధారణ ఎన్నికల తర్వాత ఏర్పడే లోక్ సభ మొదటి సిటింగ్ డే రోజున రాష్ట్రపతి నోటిఫికేషన్ జారీ చేస్తారు. ఆ నోటిఫికేషన్ ను అపాయింటెడ్ డేగా పిలుస్తారు. ఆ రోజునుంచి లోక్ సభ పదవీకాలం అయిదేళ్లు ఉంటుంది. ఆ అపాయింటెడ్ డే తరువాత ఏర్పడిన అన్ని అసెంబ్లీలు కూడా లోక్ సభ పదవీకాలంతోపాటు ముగుస్తాయి. ఆ తర్వాత నుంచి అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు ఒకేసారి జరగడం ప్రారంభం అవుతుంది. అంటే.. 2034 జరిగే ఎన్నికలు మాత్రమే జమిలి ఎన్నికలు అవుతాయి. ఈ ఏర్పాటు వైఎస్ జగన్ కు మింగుడు పడకపోవచ్చు అని అంతా అనుకుంటున్నారు.