తాను రాష్ట్రస్థాయి నాయకుడిని, రాష్ట్రం మొత్తాన్నీ కూడా ప్రభావితం చేయగల గొప్పవాడిని అని ముద్రగడ పద్మనాభం కు ఒక బలమైన నమ్మకం. ఒక కులానికి మాత్రమే, అది కూడా ఆ కులంలో ఒక భావజాలంగల వ్యక్తులకు మాత్రమే రుచించే నాయకుడు అయిన ముద్రగడ పద్మనాభం.. తాను రాష్ట్రం మొత్తంలో ఆ కులాన్ని సమూలంగా ప్రభావితం చేయగలనని అనుకుంటూ ఉంటారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరినప్పుడు కూడా..
ఆయన తాను రాష్ట్రమంతా పర్యటనలు సాగించి.. ప్రతిచోటా కాపులతో సమావేశాలు నిర్వహించి.. వారందరూ వైకాపాకు ఓటువేసేలా చేయాలని ఆశించారు. రాష్ట్రమంతా తిరిగి జగన్ ను గెలిపిస్తానని ఆ సందర్భంగా సెలవిచ్చారు కూడా. రాష్ట్రమంతా తిరిగినా ఆయన మాట కాపులు తప్ప మరొక్కరు చెవిన వేసుకునే అవకాశం కూడా లేదన్నది సత్యం. అయితే.. పార్టీలో చేరిన తర్వాత.. ఆయనను అటూ ఇటూ కదలనివ్వకుండా వైకాపా కూర్చోబెట్టేసింది. దీంతో రాష్ట్రమంతా తిరిగి ఒక ఉద్ధండ నాయకుడిలాగా ప్రచారాలు చేయాలనుకున్న ముద్రగడ కోరికలు తీరడం లేదు.
కాపు జాతి నాయకుడిగా తనను తాను గుర్తించుకున్న ముద్రగడ పద్మనాభం ను తొలుత జనసేనలో చేర్చుకోవడానికి మంతనాలు నడిచాయి. పవన్ దూతలు ఆయన వద్దకు వెళ్లి మంతనాలు చేశారు. ఆ మంతనాలు బేరసారాలుగా మారాయేమో తెలియదు. ముద్రగడ వారికి ఎలాంటి డీల్ ప్రతిపాదించారో తెలియదు. మొత్తానికి ముద్రగడ ఇంటికి పవన్ వెళ్లేలా.. పార్టీలోకి ఆహ్వానించేలా ప్రకటించిన కార్యక్రమం కూడా ఆగిపోయింది. ఆ తర్వాతే ఆయనను వైకాపాలోకి ఆహ్వానించే దూతలు వెళ్లారు. మొత్తానికి ముద్రగడ తాడేపల్లి వచ్చి జగన్ సమక్షంలో పార్టీలో చేరారు.
బేషరతుగా పార్టీలో చేరుతున్నట్టు ఆయన ప్రకటించారు గానీ.. తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత.. జగన్ ఏ పదవి ఇస్తే ఆ పదవి తీసుకుంటానని ఇండికేషన్ మాత్రం పంపారు. అలాగే.. రాష్ట్రమంతా తిరిగి జగన్ ను గెలిపించడానికి పాటుపడతానని కూడా సెలవిచ్చారు. తద్వారా తన కష్టానికి తగినట్టు రాజ్యసభ పదవి ఇవ్వకపోతారా? అని ఆయన ఆశించారు. తాను రాష్ట్రమంతా తిరిగేస్తే.. పార్టీ గెలిస్తే.. రాష్ట్రంలోని కాపుల ఓట్లన్నీ తానే వేయించినట్టుగా చెప్పుకోవచ్చునని అనుకున్నారు. రాష్ట్రమంతా తిరుగుతానని సన్నిహితులతో కూడా చెప్పుకున్నారని సమాచారం.
అయితే ఆయన సేవల్ని రాష్ట్రమంతా వాడుకోవడానికి పార్టీ సుముఖంగా లేదు. పార్టీలో చేర్చుకున్నారే తప్ప… ఆయనను ఇతర ప్రాంతాలకు తిరగనివ్వడం లేదు. ఇంట్లోకూర్చుని ప్రెస్ మీట్లు పెట్టడానికి మాత్రం పరిమితం చేశారు. ఇలాంటి నేపథ్యంలో రాష్ట్రమంతా తిరిగి, రాష్ట్రవ్యాప్త సెలబ్రిటీ నాయకుడిలాగా, జగన్ తర్వాత రాష్ట్రమంతా తిరగగలిగినంతటి వ్యక్తిగా తనను తాను ప్రొజెక్టు చేసుకోవాలని అనుకున్న ముద్రగడ పద్మనాభం కోరిక తీరినట్టుగా లేదని ప్రజలు అనుకుంటున్నారు.