కొడాలిని ‘సౌమ్యుడు’ అనడానికి నోరు రాలేదు పాపం!

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో ప్రతిచోటా తన ప్రసంగానికి చివరన- తమ పార్టీ అభ్యర్థులను పరిచయం చేయడానికి రెండు పదాలను నిల్వ ఉంచుకున్నారు! ఒక్కొక్క నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న ప్రతి అభ్యర్థిని పోడియం దగ్గర నిల్చుకున్న తన వద్దకు పిలవడం, వారి భుజం మీద చేయి వేసి వారి పేరు చెప్పి, ‘‘మంచివాడు సౌమ్యుడు’’ అంటూ రెండు పదాలతో కితాబు ఇవ్వడం అలవాటుగా మార్చుకున్నారు! ఎప్పుడైనా కొన్ని సందర్భాలలో ఆ రెండు పదాలకు తోడు- యువకుడు, ఉత్సాహంతుడు, మీలో ఒకడు, పేదవాడు ఇట్లాంటి పదాలను జత చేస్తుంటారు. వైసిపి అభ్యర్థులలో అనేక అరాచక పోకడలకు నిలయంగా పేరు మోసిన నాయకులను పరిచయం చేసే విషయంలో కూడా ఇప్పటిదాకా ఆయన ఈ రెండు పదాలను విధిగా వాడుతూ వచ్చారు. అలాంటిది గుడివాడ సభలో మాత్రం ఒక అభ్యర్థి గురించి ‘మంచివాడు సౌమ్యుడు’ అని చెప్పడానికి బహుశా జగన్ కూడా మొహమాట పడ్డారు! అంతగా పేరు మోసిన ఆ అభ్యర్థి మరెవ్వరో కాదు కొడాలి నాని!
‘జగమెరిగిన బ్రాహ్మణుడికి జంధ్యమేల’ అన్న సామెత చందంగా కొడాలి నానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేకంగా పరిచయం అనవసరం. ‘‘రాజకీయ నాయకులు- బూతులు’’ అనే సబ్జెక్టు ఎవరికి గుర్తు వచ్చినా సరే, ముందుగా వారు తలుచుకునేది కొడాలి నాని పేరు మాత్రమే! జగన్ కళ్ళలో ఆనందం చూడడమే తన జీవిత పరమావధి అయినట్లుగా ప్రత్యర్థి పార్టీ నాయకులను తీవ్రమైన పదజాలంతో, రాయడానికి వీలుకాని బండబూతులతో నిత్యం తిట్టిపోస్తూ చెలరేగిపోయే వ్యక్తి కొడాలి నాని. భాష మాత్రమే కాదు ఆయన వ్యవహారం, ఆహార్యం కూడా అలాగే అనిపిస్తుంది. అందుకేనేమో తన పక్కన నిలుచున్న కొడాలి నాని గురించి ‘మంచివాడు, సౌమ్యుడు’ అనే పడికట్టు పదాలను జగన్మోహన్ రెడ్డి చెప్పలేకపోయారు. అలా చెబితే.. ప్రచారం యావత్తూ తాను చెబుతున్న ప్రతి మాటా అబద్ధమే అని ప్రజలు అనుకుంటారని ఆయన కూడా భయపడినట్లున్నారు.

కడప జిల్లాలో మొదలెట్టిన దగ్గర నుంచి ఎక్కడ ప్రజా సభ నిర్వహించినా సరే ఆ అభ్యర్థి ఎలాంటి వాడైనా సరే ప్రసంగం చివరలో తన వద్దకు పిలవడం ‘మంచివాడు సౌమ్యుడు’ అంటూ ప్రజలకు పరిచయం చేయడం జగన్ కు అలవాటుగా మారింది. ఈ మాటలు విపరీతంగా ట్రోలింగ్ కూడా గురవుతున్నాయి. అయినా సరే జగన్ సహజంగానే తన తీరు మార్చుకోవడం లేదు. అభ్యర్థుల గుణగణాలు గురించి విడిగా చెప్పడానికి ఆయన కొద్దిగా కూడా కసరత్తు చేయడం లేదు. అదంతా పక్కన పెడితే, కొడాలి నాని విషయంలో ఆ సౌమ్యుడు మంచివాడు అనే పదాలు చెప్పడానికి కూడా జంకారంటే అభ్యర్థి ఎంతటి ఘనుడో అక్కడి ప్రజలు అర్థం చేసుకోవాలని విశ్లేషకులు భావిస్తున్నారు

Related Posts

Comments

spot_img

Recent Stories