‘సొంత డప్పులందు.. లేకి డప్పులు వేరయా..’ అని చెప్పుకోవాల్సి వచ్చేలా ఉంది.. జగన్ దళాల అత్యుత్సాహం గమనిస్తోంటే. రాష్ట్రంలో ఎక్కడ ఏ ఘనకార్యం జరిగినా సరే.. అది తమ నాయకుడి చలవే అని చెప్పుకునేలా కనిపిస్తోంది. వెగటు పుట్టించే ఇలాంటి ప్రచారాలు వైసీపీ కి అలవాటే. చంద్రబాబునాయుడు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చినప్పుడు కూడా.. తమ నాయకుడు జగన్ అడగడం వల్లనే అమలు చేశారని వారు సొంత డప్పు కొట్టుకుంటారు. ఇప్పుడు ఆ సొంత డప్పు మరీ దిగజారిపోతోంది. ఒక నాయకుడు ఇంత లేకిగా సొంత డప్పు కొట్టుకోవడం సాధ్యమేనా? అనిపించేంతగా వైసీపీ నీలిదళాలు వ్యవహరిస్తున్నాయి.
జగన్ ఆ నడుమ గుంటూరు మిర్చియార్డు కు వెళ్లి.. ధరలు పడిపోతున్న సమయంలో అక్కడి రైతులతో మాట్లాడారు. వారి కష్టాలు విన్నారు. నిజానికి అంతకు కొన్ని రోజుల ముందుగానే.. మిర్చి ధరలు పడిపోవడం, దానివల్ల నష్టపోయే రైతులకు సాయం అందించడం గురించి ప్రభుత్వం దృష్టి సారించింది. కేంద్రానికి లేఖ రాసింది. కేంద్రం సాయం ప్రకటించేలా కూడా చేసింది. అలాగే అమెరికాలో ట్రంప్ సుంకాలు విధించినప్పుడు.. ఏపీలో రొయ్యల పరిశ్రమ కుదేలైంది. చంద్రబాబు తక్షణ చర్యలు తీసుకున్నారు. రొయ్యల సాగు చేసే రైతులు నష్టపోకుండా.. ధరలు పెంచారు. కేంద్రానికి లేఖ రాసి ఉపశమన చర్యలకు శ్రీకారం చుట్టారు. ఇవన్నీ ఆయన చేస్తుండగా.. జగన్ మాత్రం.. ‘మేం నిలదీశాం కాబట్టే వారికి మేలు చేశారు’ అని అసహ్యంగా సొంత డప్పు కొట్టుకున్నారు.
ఇప్పుడు ఆ సొంతడప్పు కొట్టుకునే బుద్ధి మరీ లేకిగా తయారైంది. శవాల మీద రాజకీయం చేయడం జగన్ కు తొలినుంచి అలవాటే. సింహాచలంలో గోడకూలి భక్తులు చనిపోతే.. జగన్ గంటల వ్యవధిలో అక్కడ వాలిపోయారు. చంద్రబాబునాయుడు స్వయంగా గోడ తోసి జనాన్ని చంపేసిన స్థాయిలో నిందలు వేశారు. ఘటన జరిగినప్పుడే.. ప్రభుత్వం గొప్పగా స్పందించింది. ప్రమాదం జరిగింది.. ఎవ్వరూ చేయగలిగింది ఏమీ లేదు. కానీ సహాయక చర్యల్లో చంద్రబాబు తన ముద్ర చూపించారు. మరణించిన వారందరికీ పాతికలక్షల వంతున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. వారి కుటుంబంలో ఒకరికి కాంట్రాక్టు ఉద్యోగం ఇస్తాం అన్నారు. తీరా జగన్ అక్కడకు వెళ్లి.. తనకు జడుసుకుని ప్రభుత్వం వారికి ఎక్స్ గ్రేషియా ప్రకటించిందని అన్నారు. తిరుపతి తొక్కిసలాట మృతులకు కూడా ప్రభుత్వం ఇలాగే ఇచ్చిన వైనం ఆయన మర్చిపోయారు. ఇదొక లేకి సొంత డప్పు అయితే.. తాజాగా.. కులగణన విషయంలో అలాంటి పనే చేస్తున్నారు.
కేంద్రం జనాభా లెక్కలతో పాటు కులగణనకు తమ నిర్ణయం ప్రకటించగానే.. అసలు దేశంలో కులగణన చేసిన తొలి ముఖ్యమంత్రి జగన్ అంటూ ఇంకొక అసహ్యకరమైన సొంత డప్పు ప్రారంభించారు. ఆయన ఎప్పుడు చేశాడో.. కులగణన చేసిన వివరాలు ఎక్కడ దాచి పెట్టుకున్నారో ఆ డప్పు కొడుతున్న నాయకులే తెలియాలి. జగన్ మోహన్ రెడ్డి కుటిల వక్ర సొంతడప్పు ప్రచారాలను చూసి జనం నవ్వుకుంటున్నారు.