లిక్కర్ కుంభకోణం అనేది కేవలం ఆర్థికపరమైన అవినీతి కేసుగానే ఉండిపోతుందా? లేదా ప్రజల ప్రాణాలను బలితీసుకున్న మానవ హననం కేసుగా కూడా రూపాంతరం చెందుతుందా? అనే సందేహాలు ఇప్పుడు ప్రజల్లో విస్తృతంగా వినిపిస్తున్నాయి. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త లిక్కర్ పాలసీ తీసుకురావడం ద్వారా.. ఏకంగా మూడున్నర వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని బొక్కిన విషయం- సిట్ దర్యాప్తులో తేటతెల్లం అయిపోయింది. ప్రిలిమినరీ చార్జిషీటు కూడా దాఖలు చేసిన ఈ కేసులో.. ఆధారాలను మరింతగా జోడించడానికి ఇంకా నిందితులను పిలిచి విచారించడం జరుగుతోందే తప్ప.. ఇప్పటికే చాలా పక్కాగా సమస్తం సేకరించినట్టుగా తెలుస్తోంది. అంతిమలబ్ధిదారు అయిన బిగ్ బాస్ ను మిగిలిన వారిని కేసులోకి తీసుకురావడం కేవలం లాంఛనమేనని.. సరైన సమయంలో అది కూడా జరుగుతుందని అంతా అనుకుంటున్నారు.
ఎన్ని జరుగుతున్నప్పటికీ ఇది ఇప్పటిదాకా ఆర్థిక దోపిడీకి సంబంధించిన కేసు మాత్రమే. కానీ.. తాజా పరిణామాలను గమనిస్తోంటే.. వేలాది మంది మరణాలకు కారణమైన సెక్షన్లు కూడా ఈ కేసులోకి ప్రవేశిస్తాయా అనే అనుమానం కలుగుతోంది. జగన్ పాలన కాలంలో.. డిస్టిలరీలతో కుమ్మక్కు అయి.. నాసిరకం కల్తీ మద్యాన్ని మాత్రమే అందుబాటులో ఉంచడం వలన మద్య ప్రియుల ఆరోగ్యం సర్వనాశనం అయింది. వేలమంది కేవలం కల్తీ మద్యం కారణంగా ఆరోగ్యం దెబ్బతిని మరణించారు. కేవలం కల్తీ మద్యం కారణంగానే మరణించినట్టు పోస్టుమార్టంలో గుర్తించిన కేసులు కూడా అనేకం ఉన్నాయి. ఈ చావులకు బాధ్యత వహించాల్సింది ఎవరు. ఖచ్చితంగా.. తన అత్యాశతో కొత్త లిక్కర్ పాలసీ ద్వారా వేల కోట్లు దోచుకోవాలని ఈ దందా నడిపించిన జగన్మోహన్ రెడ్డే. నైతికంగా బాధ్యత వహించడం సంగతి పక్కన పెడితే.. చట్టపరంగా కూడా ఈ చావుల వ్యవహారం ఇప్పుడు లిక్కర్ కుంభకోణం కేసులో భాగమయ్యేలా కనిపిస్తోంది.
లిక్కర్ కేసుతో పాటు, జగన్ పాలన కాలంలో కల్తీ మద్యం వలన పోయిన ప్రాణాలను, ఆరోగ్యం దెబ్బతిన్నవారి కేసులను కూడా కలిపి విచారించాలని కొన్ని రోజుల కిందట డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పిలుపు ఇచ్చారు. ఏలూరు జిల్లా జంగారెడ్డి గూడెంలో జగన్ పరిపాలన కాలంలటో 2022లో కల్తీ మద్యం తాగి 20 మంది మృత్యువాత పడ్డారు. ఈ చావులపై వేర్వేరు కేసులు నమోదు అయ్యాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. అప్పటి కల్తీమద్యం చావులపై దర్యాప్తు చేసి సమగ్ర నివేదిక సమర్పించడానికి బాధ్యులను తేల్చడానికి ముగ్గురు సభ్యులతో ఒక టాస్క్ ఫోర్స్ ను కూడా ఏర్పాటుచేసింది.
జగన్ సర్కారు డిస్టిలరీలనుంచి డబ్బు దోచుకోవడం ప్రారంభించిన తర్వాత.. ఆ డిస్టిలరీలు తమ లాభాలకోసం మద్యాన్ని మరింత నాసిరకంగా కల్తీచేయడమే ఇందుకు కారణం అని ఆరోపణలున్నాయి. పరోక్షంగా దోపిడీకి కేంద్రబిందువు అయిన జగన్ సర్కారే ఇందుకు బాధ్యత వహించాలనేది ప్రజల మాట. అయితే ఈ చావులకు సంబంధించిన కేసులను కూడా లిక్కర్ కుంభకోణంతో జతకలిపి విచారించాలనే డిమాండ్లు ఇప్పుడు వినిపిస్తున్నాయి. జగన్ చెల్లెలు వెైఎస్ షర్మిల కూడా.. జగన్ పాలనలో ప్రజలకు అమ్మిన కల్తీ లిక్కర్ వలన రాష్ట్రంలో మూడు లక్షల మందికి కిడ్నీ సంబంధిత రోగాలు వచ్చాయని, 30వేల మంది వరకు చనిపోయారని… ఆ కేసులన్నీ కలిపి విచారించాలని డిమాండ్ చేస్తున్నారు. ఆ కేసులు కూడా లిక్కర్ స్కామ్ తో జతకలిస్తే గనుక.. నిందితులకు అనూహ్యమైన శిక్షలు తప్పవని పలువురు అనుకుంటున్నారు.