జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నంత కాలం వారి కుటుంబానికి రాష్ట్రవ్యాప్తంగా ఎదురేలేకుండా పోయింది. కేవలం నాయకులుగా వారికి పార్టీ ఉన్న పట్టు ఎంతమాత్రమో ఎవ్వరికీ తెలియదు. అలాగని.. జగన్మోహన్ రెడ్డితో ఉన్న సాన్నిహిత్యం ఎంతమాత్రమో కూడా ఎవ్వరికీ తెలియదు. కానీ.. గత ప్రభుత్వం సాగించిన అరాచక, అవినీతి దందాల్లో మాత్రం వారి పాత్రం అన్నింటిలోనూ గరిష్టంగానే ఉంది. జగన్ దందాల విషయంలో కూడా పూర్తిగా వారిమీద ఆధారపడిపోయారా? అనిపించే పరిస్థితి. ఆ ప్రాపకాన్ని అడ్డుపెట్టుకుని వారు రాష్ట్రమంతా కూడా విచ్చలవిడిగా చెలరేగిపోయారు. ఎక్కడ ఉపఎన్నికలు జరిగినా తమ ఊర్లనుంచి మనుషుల్ని లారీల్లో తరలించి దొంగఓట్లు వేయించారు. వ్యవస్థల్ని తమ గుప్పిట్లో పెట్టుకున్నారు. ఇటీవలి ఎన్నికల్లో కూడా అరాచక పోకడలనే నమ్ముకుని ఎన్నికల్లో గెలిచారు. చిత్తూరు జిల్లా మొత్తం జగన్ వ్యతిరేకతతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకుపోతే వారి కుటుంబం మాత్రమే నెగ్గింది. అయినా.. తప్పుడు పద్ధతుల్లో, దొంగఓట్లతో గెలిస్తే దాని పర్యవసానాలు ఎలా ఉంటాయో ఇప్పుడు వారికి అనుభవంలోకి వస్తున్నాయి. వారు మరెవ్వరో కాదు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం!
వెల్లువెత్తిన జగన్ వ్యతిరేకత, ఈ రాష్ట్ర బాగుపడాలంటే చంద్రబాబు నాయకత్వం తప్ప మరో మార్గం లేదని ప్రజలు గట్టిగా విశ్వసించిన ఫలితం ఈ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోయింది. చిత్తూరు జిల్లాల్లో పెద్దిరెడ్డి కుటుంబం తప్ప సమస్తం ఓడిపోయారు. పుంగనూరు నుంచి రామచంద్రారెడ్డి, తంబళ్లపల్లె నుంచి తమ్ముడు ద్వారకనాధ రెడ్డి, రాజంపేట ఎంపీగా కొడుకు మిధున్ రెడ్డి గెలిచారు. అయితే వారి పట్ల నియోజకవర్గాల్లో అసలైన ప్రజావ్యతిరేకతను ఇప్పుడు వారు ప్రతిసారీ చవిచూస్తున్నారు. నియోజకవర్గంలో అడుగుపెట్టాలంటేనే ఈ ఫ్యామిలీ ట్రయో నాయకులకు గుబులుగుబులుగా ఉంది.
తాజాగా తంబళ్లపల్లె నియోజకవర్గం పరిధిలోని ఒక గ్రామంలో అభయాంజనేయస్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించాల్సిన కార్యక్రమానికి ఎంపీ మిధున్ రెడ్డి, ఎమ్మెల్యే ద్వారకనాధ రెడ్డి హాజరయ్యారు. తంబళ్లపల్లెలోని వారి స్వగృహానికి వచ్చారని తెలియడంతో.. ప్రజలు, తెలుగుదేశం నాయకులు మూకుమ్మడిగా తరలివచ్చి.. ‘గో బ్యాక్’ అంటూ వారికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇది తొలిసారి కాదు. గతంలో కూడా ద్వారకనాధ్ రెడ్డి నియోజకవర్గానికి వచ్చినప్పుడు ఇదేజరిగింది. దొంగఓట్లతో గెలిచిన వారు నియోజకవర్గంలోకి రావొద్దంటూ ప్రజలు రభస చేశారు. ఈలోగా వైసీపీ వాళ్లు కూడా గుమికూడడంతో పోలీసులు కలగజేసుకుని.. మిధున్ రెడ్డి, ద్వారకనాధ్ రెడ్డికి నచ్చజెప్పి అక్కడ నుంచి పంపేశారు.
అడ్డదారుల్లో ఇలాంటి నాయకులు గెలవగలరేమో గానీ.. ప్రజల ఆదరణ మాత్రం పొందలేరని.. తప్పుడు మార్గాల్లో గెలిచినందుకు నియోజకవర్గంలో ఎప్పటికీ ఇలాంటి పరిస్థితులు తప్పవని ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు.