ఏదో ఒక గోలతో వార్తల్లో ఉండాలి’

సాధారణంగా మరణించిన పెద్దల మీద భక్తి ప్రపత్తులు ఉండేవారు వారి జయంతిగానీ, వర్ధంతిగానీ వచ్చినప్పుడు సమాధుల వద్దకెళ్లి తమ భక్తిని ప్రదర్శించుకుంటారు. సంక్రాంతి పండుగ వచ్చినప్పుడు ఇంట్లో పూజలు చేసుకుంటారు. మంచు మనోజ్ తన తాతయ్య, నానమ్మల జయంతి, వర్ధంతులకు ఎన్నిసార్లు సమాధులను దర్శించుకున్నాడో మనకు తెలియదు. కానీ, ఈసారి సంక్రాంతి పండుగ నాడు మాత్రం పెద్ద సీన్ క్రియేట్ చేశారు. మోహన్ బాబు యూనివర్సిటీ వద్దకు వెళ్లి.. బౌన్సర్లతో హడావుడి చేశారు. ఏదో ఒక గోల చేసి అయినా సరే నిత్యం వార్తల్లో వ్యక్తిగా ఉండడానికి మంచు మనోజ్ తాపత్రయపడుతున్నట్టుగా తెలుస్తోంది.
మంచు కుటుంబంలో మోహన్ బాబు కొడుకుల మధ్య తీవ్రస్థాయిలో తగాదాలు నడుస్తున్న సంగతి తెలిసిందే. వ్యవహారం పరస్పరం పోలీసు కేసులు పెట్టుకునేదాకా వెళ్లింది. మోహన్ బాబు మీద హత్యాయత్నం కేసు నమోదు అయ్యేదాకా వెళ్లింది. కుటుంబం పరువు మొత్తం బజార్నపడింది. నానా రచ్చ అయినప్పటికీ కొన్ని వారాలుగా అంతా సద్దుమణిగింది.

ఈలోగా సంక్రాంతి పండుగ సందర్భాన్ని వాడుకుంటూ.. మళ్లీ వార్తల్లో నిలవడానికి మంచు మనోజ్ ప్రయత్నిస్తున్నట్టుగా కనిపిస్తోంది. భార్య మౌనిక రెడ్డితో కలిసి మోహన్ బాబు యూనివర్సిటీ వద్దకు వెళ్లిన  మనోజ్.. రేణిగుంట విమానాశ్రయం నుంచే పెద్ద ర్యాలీగా వెళ్లడమే ఆయన ఉద్దేశాన్ని తెలియజెబుతోంది. మోహన్ బాబు యూనివర్సిటీలోకి ప్రవేశించడానికి వీల్లేదని కోర్టు ఉత్తర్వులున్నాయి. ఈ సంగతి మంచు మనోజ్ కు తెలియనిదేం కాదు. కానీ ఎలాంటి ధిక్కరణ, రభస లేకుండా వార్తల్లో వ్యక్తిగా వెలగడం ఎలా అనేది బహుశా మనోజ్ ఉద్దేశమేమో గానీ.. తన బౌన్సర్లతోనే ఆయన యూనివర్సిటీకి వెళ్లారు. అక్కడి నాలుగు గేట్ల వద్దకూ వెళ్లారు. ఏ ఒక్క గేటు నుంచి కూడా ఆయనను లోపలకు అనుమతించలేదు.

మంచు మనోజ్ వెంట తీసుకువెళ్లిన బౌన్సర్లకు, యూనివర్సిటీ గేట్ల వద్ద ఉన్న బౌన్సర్లకు మధ్య ఘర్షణ కూడా జరిగింది. పోలీసులు లాఠీచార్జీ కూడా చేయాల్సి వచ్చింది. పోలీసులు అడ్డుకుని లోనికి వెళ్లడానికి వీల్లేదని ఉత్తర్వులు చూపించారు. మా తాతయ్య, నానమ్మల సమాధుల్ని చూసి దణ్నం పెట్టుకోవాలి.. అంటూ ఒక ఎమోషన్ డైలాగు వేశారు. మొత్తానికి పోలీసులు ఆయనను వెంటబెట్టుకుని సమాధుల వద్దకు తీసుకెళ్లి మళ్లీ బయట వదిలారు.

ఆయన అక్కడ మీడియాతో మాట్లాడిన మాటలే హైలైట్. యూనివర్సిటీ స్టూడెంట్స్ కోసం, అక్కడి ప్రజల కోసం తాను పోరాడుతూనే ఉంటానని, వదలిపెట్టేది లేదని ఆయన గట్టిగా చెబుతున్నారు. ఎంట్రీకోసం నాలుగు గేట్ల వద్ద జరిగిన రభసను మొత్తం తన బౌన్సర్లతోనే మనోజ్ షూట్ చేయించుకున్నారు. తనను అడ్డుకోవడానికి ఢిల్లీనుంచి బౌన్సర్లను తెప్పించారని, అయినా తాను ఆగేది లేదని.. పోలీసు ఉత్తర్వుల ప్రకారం బౌన్సర్లు ఉండరాదని అంటున్న మనోజ్.. తను రావడమే బౌన్సర్లతో రావడం గమనార్హం. ఆయన ఏం ఆశిస్తున్నారో గానీ.. నిత్యం వార్తల్లో సంచలనంగా ఉండాలని మాత్రం కోరుకుంటున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories