రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే.. కేవలం పెద్దసంఖ్యలో ప్రజల్ని ఉత్సాహపరిచి ఎక్కువశాతం పోలింగ్ నమోదు అయ్యేలా చూడడం ఒక్కటీ సరిపోదు. ఓట్లు పోలైన ఈవీఎంలు అన్నీ కౌంటింగ్ వరకు భద్రంగా ఉండేలా చూసుకోవడం కూడా కీలకమైన బాధ్యతే. ఈవీఎంలను కాపాడడం అనేది కేవలం పోలీసులు, కేంద్ర మిలిటరీ బలగాల పనిమాత్రమే అనుకోవడానికి కూడా వీల్లేదు. అది మనందరి బాధ్యత. మీరంతా ఈవీఎంలను భద్రపరచిన స్ట్రాంగ్ రూముల మీద వెయ్యికళ్లతో నిఘా పెట్టండి. లేకపోతే నష్టపోయేది మనమే.. అని ఎన్డీయే కూటమి పార్టీలు తమ కార్యకర్తలకు హెచ్చరికలు జారీచేస్తున్నాయి.
ఇప్పటికీ రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులకు పోలీసు యంత్రాంగం సహకరిస్తోందనే సమాచారం పలువురిని కలవరపెడుతోంది. అసలు కేవలం వైసీపీ నాయకులను మాత్రమే వెంటబెట్టుకుని పోస్టల్ బ్యాలెట్లను తరలించిన దుర్మార్గమైన వ్యవహారాలు కూడా విజయనగరంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. ఇదిలా ఉండగా.. అసలు స్ట్రాంగ్ రూముల వద్ద మానిప్యులేషన్ చేసి.. నెగ్గే ఆలోచనలో కూడా వైసీపీ దళాలు ఉన్నట్టుగా ఒక ప్రచారం నడుస్తోంది. తిరుపతిలో స్ట్రాంగ్ రూమ్ వద్దకు వెళ్లినందుకే చంద్రగిరి తెలుగుదేశం ఎమ్మెల్యే అబ్యర్థి పులివర్తి నానిపై హత్యాయత్నం జరిగింది. గుంటూరులో స్ట్రాంగ్ రూము ఉన్న నాగార్జునయూనివర్సిటీలో పోలీసు అధికారులు, సీఎం సెక్యూరిటీ టీం కలిసి పార్టీలు చేసుకోవడం కూడా వివాదాస్పదం అయింది. స్ట్రాంగ్ రూముల్లో ఈవీఎంలను ఏకంగా మార్చేసి.. అడ్డదారిలో గెలవడానికి కూడా వైసీపీ ప్రయత్నిస్తున్నదనే అనుమానాలు ప్రజల్లో ఉన్నాయి.
ఈ నేపథ్యంలో.. తెలుగుదేశం నాయకులు తమ కార్యకర్తలకు ప్రత్యేకంగా హెచ్చరికలు జారిచేస్తున్నారు. జాగ్రత్తలు చెబుతున్నారు. మీరందరూ విధిగా స్ట్రాంగ్ రూముల వద్ద వంతుల వారీగా 24 గంటల కాపలా ఉండండి. పార్టీకి విధేయులైన కార్యకర్తలనే కాపలా బృందాలుగా ఏర్పాటు చేయండి. ఎలాంటి అనుమానాస్పద కదలికలు కనిపించినా పార్టీ వర్గాలకు, ఈసీకి ఫిర్యాదు చేయండి అంటూ పురమాయిస్తున్నారు.
ప్రజాస్వామ్యాన్ని బతికించుకోవడానికి ఎన్నికలు ముగిసిన తర్వాత.. ఈవీఎంలకు కాపలా కాయాల్సిన పరిస్థితి దాపురించిందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.