కాకినాడ పోర్టులో కె.వి రావు కు చెందిన వాటాలను వైసీపీలోని రెండు పెద్ద తలకాయలు వైవీ సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి లకు చెందిన వ్యక్తులు దక్కించుకున్నారు. స్పష్టంగా చెప్పాలంటే అడ్డదారిలో దక్కించుకున్నారు. బెదిరించి, భయపెట్టి, ఒకరకంగా బ్లాక్ మెయిల్ చేసి అధికారంలో ఉన్నది తామే గనుక అరాచక పద్ధతులలో వారిని భయానికి గురిచేసి మొత్తానికి వాటాలనైతే పొందారు.
దీని కోసం చెన్నైకు చెందిన ఆడిటింగ్ కంపెనీ పీకేఎప్ శ్రీధర్ అండ్ సంతానం ఎల్ఎల్‌పీ ని నియమించి, వాటాలు తమకు దక్కకముందు వందల కోట్ల రూపాయల పన్ను ఎగవేతలను ఉన్నాయని చెప్పించి, తమకు వాటాలు దక్కిన తర్వాత నామమాత్రంగానే ఉన్నట్టుగా రికార్డులు తయారుచేసి మొత్తానికి కేవీ రావు వాటాలను వైసీపీ పెద్దలు కబ్జా చేశారు. ఇప్పుడు ఆ పాపం పండి రచ్చకెక్కింది. సిఐడి కేసు నమోదు అయిన తర్వాత ఆ లావాదేవీలలో ఆర్థిక నేరాలు కూడా ఉన్నట్టు తేలడంతో ఈడీ కూడా రంగంలోకి దిగింది. రెండు సంస్థలు ప్రస్తుతం విచారణ చేస్తున్నాయి. బెదిరింపుల పర్వంలో కీలక సూత్రధారి అయిన విజయసాయిరెడ్డిని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ విచారణకు పిలిపించినప్పుడు ఆయన చెబుతున్న మాటలు తమాషాగా ఉన్నాయి.
ఆడిట్ కోసం నియమించిన కంపెనీ మీ బినామీనే కదా అని ఈడి అధికారులు ప్రశ్నిస్తే ఆ నిర్ణయం తీసుకున్నది అధికారులేనని దీనికి సంబంధించి అధికారులను విచారించాలని విజయసాయిరెడ్డి డొంకతిరుగుడుగా సమాధానం చెబుతున్నారు. స్ట్రైయిట్ గా అడిగే అనేక ప్రశ్నలకు తెలియదు గుర్తులేదు వంటి వైసీపీ నాయకులకు అలవాటైన స్క్రిప్ట్ ని ఆయన కూడా వల్లిస్తుండడం గమనించాల్సిన సంగతి. అయితే అడ్డంగా దొరికిపోయే ఆడిట్ కంపెనీ విషయంలో అధికారుల మీదికి నెట్టేస్తున్నారు విజయ సాయి రెడ్డి!
ఏ ఆడిట్ కంపెనీని నియమించాలి అనే నిర్ణయం టెక్నికల్ గా అధికారులు తీసుకునేదే కావచ్చు గాక. కానీ అధికారులను శాసించేది విజయ్ సాయి రెడ్డి లాంటి వైసీపీ పెద్దలు అనే సంగతి అందరికీ తెలుసు. నిర్ణయం అధికారులది కదా అని ఆయన దర్యాప్తు సంస్థలను, కోర్టును కూడా బుకాయించగలరేమోగాని ప్రజలు ఇలాంటి మాటలు నమ్ముతారా అనేది అందరి సందేహం.
వైఎస్ఆర్ కాంగ్రెస్ జమానాలో అధికారులు ఎంత స్వేచ్ఛగా పనిచేశారో.. ఎంత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకున్నారో ప్రజలందరికీ తెలుసు! అలాంటిది కాకినాడ పోర్టు మీద ఆడిట్కు చెన్నైకు చెందిన కంపెనీని నియమించడం అనే నిర్ణయాన్ని అధికారులు స్వతంత్రంగా తీసుకొని ఉంటారనుకోవడం భ్రమ. విచారణలో సమాధానాలకు విజయసాయి ఇలాంటి మాట చెప్పవచ్చు గాని ప్రజలు మాత్రం ఈ వాటాలను కాజేసిన పర్వంలో పాపాల భైరవుడు ఆయనే సంగతిని గుర్తిస్తారు. ఈ స్పృహ ఆయనకు ఉంటే మంచిది.