ఓడిపోయినప్పుడు నాయకులు ఎలా స్పందిస్తుంటారు? ఎలా పనిచేస్తుంటారు? అనేది మాత్రమే ఆయా నాయకుల యొక్క అసలైన వ్యక్తిత్వాన్ని నిరూపిస్తుంది. ఓటమికి దారితీసిన కారణాలను వారు ఎంత నిర్మొహమాటంగా, అహంకారం లేకుండా ఒప్పుకుంటారో.. దానిని బట్టి మాత్రమే వారి భవిష్యత్తుకు బాటలు ఏర్పడతాయి. ఆ కోణంలో చూసినప్పుడు.. చంద్రబాబునాయుడు తాను దెబ్బతిన్న రెండు సందర్భాల్లోనూ తిరుగులేని రీతిలో ఆత్మ సమీక్ష చేసుకున్నారని అర్థమవుతోంది. అందుకే 93 శాతం సీట్లు గెలుచుకుని రికార్డుస్థాయిలో అధికారం చేపట్టారని కూడా ప్రజలు అనుకుంటున్నారు. జగన్మహోన్ రెడ్డికి కూడా తన రాజకీయ భవిష్యత్తును కనీసం సుస్థిరంగా తీర్చిదిద్దుకోవాలనే మోజు ఉంటే గనుక.. చంద్రబాబును చూసైనా నేర్చుకోవాలని.. ఇలాంటి విషయాల్లో ఈగోలకు వెళితే మొదటికే మోసం వస్తుందని జగన్ గ్రహించాలి.
చంద్రబాబునాయుడు కూడా కొన్ని ఎన్నికలు ఓడిపోయారు. అయితే ఆ విషయంలో ఆయన చాలా ప్రాక్టికల్ గా మాట్లాడుతున్నారు. హిందూస్థాన్ టైమ్స్ వారి కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబునాయుడు తాను గతంలో పొగడ్తలను తలకెక్కించుకోవడం వల్ల ఓడిపోయానని నిర్మొహమాటంగా ఒప్పుకున్నారు. తాను ముఖ్యమంత్రి అయ్యాక ఒక దశ దాటిన తర్వాత.. ప్రజలను వదిలి పేరుకోసం ప్రయత్నించడం ప్రారంభించానని చంద్రబాబు చెప్పుకున్నారు. ఆ క్రమంలో తనను పొగుడుతున్న వారి మాటలు విన్నానని, అందరూ పొగుడుతున్నారు గనుక.. అన్నీ చాలా బాగా చేస్తున్నానేమో అనుకుంటూ ఉండేవాడినని.. ఆ ప్రభావం ప్రజలను వదలి ముందుకెళ్లడం జరిగిందని చంద్రబాబు చెప్పుకున్నారు. 2019 ఓటమి తరువాత.. వాస్తవాల్ని గ్రహించినట్టు అంగీకరించారు. ఈ రకంగా తమ సొంత తప్పిదాలను నాయకులు గ్రహించడం చాలా ముఖ్యం.
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని రాష్ట్ర ప్రజలు అత్యంత దారుణంగా తిరస్కరించి అయిదునెలలు పైగా గడిచాయి. ఘోరంగా ఓడించారు. అయినా ఆయన ఇప్పటికీ.. తన ఓటమి కారణాలు తెలుసుకునే ప్రయత్నం చేయకుండా.. ఈవీఎంల మాయ వల్ల, మోసాల వల్ల ఓడిపోయాననే కాకమ్మ కబుర్లు చెప్పుకుంటూ తిరుగుతున్నారు. ఇలాంటి పనికిమాలిన మాటలు ఫలితమివ్వవు అని.. కనీసం సీనియర్ అయిన చంద్రబాబును చూసి అయినా జగన్ నేర్చుకోవాలని ప్రజలు అనుకుంటున్నారు.