తుపాను వంటి పెనువిపత్తులు సంభవించినప్పుడు.. జరిగిన నష్టంనుంచి ఆదుకోవడానికి సహాయక చర్యలు చేపట్టడంలో ప్రభుత్వాలకు ఒక టెంప్లేట్ ఉంటుంది. జరిగిన నష్టాన్ని బట్టి.. ఏ ప్రభుత్వం ఉన్నాసరే.. సహాయాలకు స్పందిస్తారు. వారి చిత్తశుద్ధిని బట్టి సాయం అందడంలో కొన్ని తేడాలుంటాయి గానీ.. అందరూ సహాయమైతే చేస్తారు. కానీ.. చంద్రబాబు వంటి దార్శనికుడైన, ముందుచూపు గల, అనుభవజ్ఞుడైన నేత ఉంటే.. ఆ ఫలితం ఎలా ఉంటుందో ఇప్పుడు మొంథా తుపాను నేపథ్యంలో స్పష్టంగా కనిపిస్తోంది. సాధారణంగా పెనువిపత్తులు ముంచుకువచ్చినప్పుడు.. సహాయక చర్యలు చేపట్టడం కంటె.. అసలు నష్టాన్నే వీలైనంత తగ్గించడం, నష్టాలు జరగకుండా ముందుజాగ్రత్తలు తీసుకోవడం అనేది గొప్ప విషయం అని అందరూ చెబుతుంటారు. ఆదిశగా చంద్రబాబు సారథ్యంలోని కూటమి సర్కారు.. ఇప్పుడు అద్భుతమైన పనితీరును ప్రదర్శిస్తోంది. మొంథా తుపాను ఎంత తీవ్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వణికిస్తున్నప్పటికీ.. ప్రభుత్వం తీసుకున్న అనేక ముందుజాగ్రత్త చర్యలే పెనునష్టాలు రికార్డు కాకుండా మేలు చేశాయని అనుకోవాల్సి వస్తోంది. ఈ విషయంలో చంద్రబాబు సర్కారు.. ఆధునిక సాంకేతికతను, పక్కా ప్రణాళికతో వివిధ శాఖల సిబ్బంది సహకారంతో పూర్తచేయడం గమనార్హం.
తుపాను హెచ్చిరికలు వచ్చిన వెంటనే.. మారుమూల గ్రామాలలో సైతం ఎక్కడెక్కడ గర్భిణులు, బాలింతలు ఉన్నారో.. వారందరి గురించి ఆశ వర్కర్లు, సహాయకుల ద్వారా వివరాలు సేకరించారు. వారినందరినీ కూడా ఆస్పత్రుల్లో చేర్పించేశారు. ఆస్పత్రులకు రావడానికి ఇష్టపడని వారిని కూడా బలవంతంగా ఆస్పత్రులకు తరలించారు. అలాగే దీర్ఘరోగులు, పండు ముసలివాళ్ల వివరాలను కూడా సేకరించి.. వారినందరినీ కూడా ముందే ఆస్పత్రులకు తరలించేశారు. తుపాను తీవ్రత కారణంగా.. రవాణా వ్యవస్థ మొత్తం స్తంభిస్తుందనే అనుమానం ముందునుంచి ఉండడంతో.. ఇలాంటి వారినందరని ముందుజాగ్రత్తగా ఆస్పత్రులకు పంపడం వల్ల ఎలాంటి ప్రాణనష్టాలు ఈ దిశగా నమోదు కాలేదు.
ప్రజలను అనేక విధాలుగా హెచ్చరించారు. మామూలుగా స్కూళ్లకు సెలవులు ప్రకటించడం జరుగుతూ ఉంటుంది. కానీ.. ప్రత్యేకించి.. రోడ్డు రవాణా పరంగా కూడా.. అత్యవసరమైతే తప్ప.. ఇళ్లలోంచే బయటకు రావద్దన్నట్టుగా.. ముందునుంచి హెచ్చరించి జాగ్రత్తలు పాటింపజేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలందరినీ కూడా తుపాను సహాయక శిబిరాలకు, కేంద్రాలకు తరలించారు. తుపాను తీవ్రరూపం దాల్చడానికి ముందే ఇదంతా జరిగింది. తీవ్రత తెలియని ప్రజలు, అప్పటికి తమ ఎదుట నష్టం కనిపించకపోవడంతో.. వ్యతిరేకించినా చూడా ఖాతరు చేయకుండా అందరినీ శిబిరాలకు తరలించడంతో నష్టాలు తెలియలేదు. రోడ్ల మీద భారీ వృక్షాలు అనేకం కూలిపోయి రోడ్లు మొత్తం స్తంభించినప్పటికీ.. ఇలాంటివి జరుగుతాయని ముందే అంచనాతో, సంసిద్ధంగా ఉన్న సిబ్బంది, ప్రభుత్వ యంత్రాంగాలు.. కేవలం అతి స్వల్ప వ్యవధుల్లోనే కూలిన వృక్షాలను ముక్కలుగా నరికి పక్కకు తరలించేస్తూ.. రవాణా వ్యవస్థను పునరుద్ధరించడం కూడా జరుగుతోంది.
ఇదంతా కేవలం అనేక సంక్షోభాలను స్వయంగా డీల్ చేసిన చంద్రబాబునాయుడు అనుభవం పుణ్యమే అని ప్రజలు అనుకుంటున్నారు. అనేక ముందుజాగ్రత్తల వల్లనే ప్రాణ నష్టాలు ఎక్కువగా నమోదుకాలేదని అంటున్నారు. అలాగే.. తుపాను తీరం దాటుతున్న సమయంలో.. మంత్రి నారా లోకేష్ స్వయంగా రాత్రంతా కమాండ్ కంట్రోల్ సెంటర్ లోనే ఉండి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను పర్యవేక్షిస్తూ, అవసరమైన మార్గదర్శనం చేస్తూ ఉండడాన్ని కూడా ప్రజలు శ్లాఘిస్తున్నారు. మొత్తానికి మొంథా తుపాను తీవ్రత.. ఏపీని సర్వనాశనం చేయకుండా చంద్రబాబు అనుభవమే కాపాడిందని అంతా అనుకుంటున్నారు.

