ఆయన మామూలు నేరగాడు కాదు. చర్చిలకు నిధులు వస్తున్నాయని తెలుసుకుని పాస్టరు వద్దకు, తన గన్ మెన్ లను వెంటబెట్టుకుని వెళ్లి కత్తిచూపి మరీ తనకువాటాలు ఇవ్వాలని బెదిరించగలడు. పోలీసులు అరెస్టుచేసి విచారణకు పూనుకుంటే.. తాను అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ర రెడ్డికి సలహాదారునని.. అందుకే తనకు గన్ మెన్ లను కూడా ప్రభుత్వం ఏర్పాటుచేసిందని దబాయించగలడు. విచారణ ఖైదీగా ఉంటూ పోలీసులతోనే సేవలు చేయించుకోగలడు.
అలాంటి బోరుగడ్డ అనిల్ కుమార్.. న్యాయస్థానాన్ని బురిడీ కొట్టించి బెయిలు తీసుకోవడం కోసం తల్లికి అనారోగ్యం అనే సాకు చెప్పడంలో ఆశ్చర్యం ఏముంది? బెయిలు కోసం తప్పుడు మెడికల్ సర్టిఫికెట్ లను సమర్నించిన వ్యవహారంలో భారీ మూల్యం చెల్లించేలా పరిస్థితి కనిపిస్తోంది.
‘కళ్లు మూసుకుంటే బెయిల్ పొడిగించాలని ఎన్ని సార్లయినా కోరుతారు’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేయడం ద్వారా.. న్యాయస్థానం బోరుగడ్డ అనిల్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒకవైపు తల్లి ఆరోగ్యం గురించి తప్పుడు డాక్యుమెంట్లు సమర్పించి బెయిలు పొందినదానిపై విచారణ జరుగుతుండగానే.. మరోసారి బెయిలు పొడిగింపు కోరడం పై కోర్టు విస్మయం వ్యక్తం చేసింది.
మొత్తానికి బోరుగడ్డ తమను బురిడీ కొట్టించిన తీరుపై హైకోర్టు తీవ్ర ఆగ్రహంగా ఉంది. కోర్టు ధిక్కరణ కేసు నమోదు చేసే అవకాశం కూడా ఉన్నదని తెలుస్తోంది. హైకోర్టు ఎంత ఆగ్రహంగా ఉన్నదంటే.. ఏ డాక్టరు పేరు మీద నకిలీ మెడికల్ సర్టిఫికెట్ పుట్టించినట్టుగా ఆరోపణలున్నాయో.. ఆ డాక్టరును కూడా కోర్టుకు పిలిచి విచారిస్తామని వ్యాఖ్యానించారు. అంతేకాదు.. బెయిలు పొందడంలో.. బోరుగడ్డ అనిల్ కు పూచీకత్తులు సమర్పించిన వ్యక్తుల వివరాలను కూడా తమ ముందు పెట్టాలని కోర్టు పోలీసుల్ని ఆదేశించింది.
తల్లి అనారోగ్యం గురించి గుంటూరులోని లలిత సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి వైద్యులు పీవీ రాఘవశర్మ పేరుతో ఒక సర్టిఫికెట్ ను కోర్టుకు సమర్పించి అనిల్ బెయిలు తెచ్చుకున్నారు. అయితే ఆ సర్టిఫికెట్ తాను ఇవ్వనేలేదని డాక్టరు చెప్పినట్టుగా పోలీసులు తేల్చారు.
ఇంకో ట్విస్టు ఏంటంటే.. బోరుగడ్డ కేసు దర్యాప్తు వివరాలను తమకు అందించేలా పోలీసులను ఆదేశించాలని అతని తరఫు న్యాయవాది కోరారు. దీనికి కోర్టు ఆగ్రహంగా స్పందిస్తూ.. ‘ఎందుకు? అందజేస్తే వాటిని కూడా తారుమారు చేస్తారా?’ అని ప్రశ్నించడం విశేషం.
మొత్తానికి జగన్ కు ఒకప్పటి సలహాదారు హోదాలో.. ప్రభుత్వ గన్ మెన్ లను కూడా పొంది.. వారి అండతోనే దందాలు నడిపించిన బోరుగడ్డు అనిల్.. తప్పుడుపత్రాలు సమర్పించి.. చిక్కుల్లో పడ్డట్టుగా కనిపిస్తోంది.