తెలంగాణలో ఫోను ట్యాపింగ్ వ్యవహారం.. ఒక్కొక్కరి విచారణతో అడుగు ముందుకు పడుతున్నకొద్దీ.. దిగ్భ్రాంతికరమైన కొత్త విషయాలతో సంచలనాలు నమోదు అవుతున్నాయి. తాజాగా సిట్ ఎదుట విచారణకు హాజరైన కేంద్రమంత్రి బండి సంజయ్ తన అనుభవాన్ని బయటపెట్టారు. సిట్ పోలీసుల వద్దకు వెళ్లగానే.. వారు తన ఎదుట మూడు నెంబర్లు చూపించి.. ఆ నెంబర్లు ఎవరివి అని అడిగారని చెప్పారు. అప్పటి కేంద్ర మంత్రి అమిత్ షా, బిఎల్ సంతోష్ నెంబర్లు అందులో ఉన్నాయని ఆయన వెల్లడించారు. అప్పట్లో రాష్ట్ర పార్టీ సారథిగా ఉన్న తాను.. జాతీయ పార్టీ అధ్యక్షుడు, హోంమంత్రి అమిత్ షాతో మాట్లాడిన ఫోన్ కాల్స్ ను విన్నారని రికార్డు చేసుకున్నారని ఆరోపిస్తున్నారు.
బండి సంజయ్ చెబుతున్న వివరాల్ని బట్టి.. భారాస జమానాలో కేసీఆర్, కేటీఆర్, సంతోష్ రావు ఫోన్లు తప్ప అందరి ఫోన్లూ టాపింగ్ అయ్యాయని బండి సంజయ్ అంటున్నారు. చివరికి హరీష్ రావు కూడా ట్యాప్ చేశారని ఆయన అంటున్నారు.
ఒకసారి ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించిన సాఫ్ట్ వేర్ ను దొరకబుచ్చుకున్న తర్వాత.. అందుకు సంబంధించిన హంగులు టెక్నాలజీతో ఏర్పాట్లు చేసుకున్న తరువాత.. ఇక భారాస పాలకులు విచ్చలవిడిగా రెచ్చిపోయినట్టుగా కనిపిస్తోంది. ఏదో సామెత చెప్పినట్టుగా.. ఒకసారి తమకు అవకాశం ఉన్నప్పుడు.. ఇక రాష్ట్రంలో అంతో ఇంతో సెలబ్రిటీ అనదగిన ఏ ఒక్కరిని కూడా విడిచి పెట్టలేదని బండి సంజయ్ చెబుతున్నారు.
రాజకీయ సెలబ్రిటీలు, సినిమా సెలబ్రిటీలు మాత్రమే కాకుండా, ప్రముఖ వ్యాపారులు అందరి సంభాషణలను కూడా విన్నట్టుగా ఇప్పుడు బయటకు వస్తోంది. తన ఫ్యామిలీలో తన ఇంట్లో పనిచేసేవారి ఫోన్లను కూడా విన్నారని బండి సంజయ్ ఆరోపిస్తున్నారు. కేసీఆర్ పరిపాలన కాలంలో.. గోప్యత పాటించాలంటే.. ఏ ఒక్కరు కూడా మామూలు కాల్స్ మాట్లాడే పరిస్థితి లేదని, అందరూ వాట్సప్, సిగ్నల్, ఫేస్ టైం కాల్స్ మాత్రమే మాట్లాడేవారని బండి సంజయ్ అంటున్నారు. భార్యాభర్తల ప్రెవేటు కాల్స్ ను కూడా వినేవారని చెబుతున్నారు.
బండి సంజయ్ ఆరోపణలు నిర్ఘాంత పరుస్తున్నాయి. ఇప్పటికే ఫోను ట్యాపింగ్ కు సంబంధించి అనేక రకాల ఆరోపణలు కేసీఆర్, కేటీఆర్ లు ఎదుర్కొంటున్నారు. వైఎస్ షర్మిల ఫోన్లను కూడా ఎప్పటికప్పుడు ట్యాప్ చేయించి.. ఆ సమాచారం మొత్తం.. వారికి అంత్యంత ఆత్మీయుడైన జగన్మోహన్ రెడ్డికి చేరవేసేవారని కూడా ఇటీవల వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఫోను ట్యాపింగ్ అనేది తమ చేతికి దొరకగానే.. ప్రత్యర్థులందరి రహస్యాలను తెలుసుకుని వారిపై పైచేయి సాధించడానికి గులాబీదళాలు రెచ్చిపోయినట్టుగా అర్థమవుతోంది. ఇదే ట్యాపింగ్ దందాను అడ్డు పెట్టుకుని.. ఎందరు వ్యాపారులు, సెలబ్రిటీల ప్రెవేటు వ్యవహారాల గురించి తెలుసుకుని ఎలాంటి అక్రమాలు సాగించారో, ఎలాంటి వసూళ్లకు పాల్పడ్డారో అదంతా కూడా వెలుగులోకి రావాల్సి ఉంది.