గురివింద నీతి అని ఒక నీతి ఉంటుంది. గురివింద గింజ ఎదుటి గింజల వీపు మీద ఉండే నలుపు రంగును చూసి నవ్వుతుందిట. నేను ఎంత ఎర్రగా ఉన్నానో చూడు అని అంటుందిట. కానీ తన వీపు మీద కూడా నలుపు రంగే ఉన్నదని అది ఎప్పటికీ గుర్తించలేదట.! వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్న మాటలు గమనిస్తే గురివింద గింజ కంటె సంకుచితంగా వారి బుద్ధి కనిపిస్తోంది. చంద్రబాబునాయుడు తాను సొంతంగా కొనుక్కున్న జాగాలో సొంత డబ్బులతో తన నివాసానికి ఒక భవనం కట్టుకుంటూ ఉంటే.. దాని చుట్టూ పరదాలు, తెరలు కట్టి ఆ కార్యక్రమం నిర్వహించారంటూ వైసీపీ మాజీ ఎమ్మెల్యే టీజే సుధాకర్ బాబు విమర్శించడం చాలా చిత్రంగా కనిపిస్తోంది. అయిదేళ్లు అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి.. ఏ ఊరిలో అధికారిక కార్యక్రమానికి వెళ్లినా.. రోడ్ల కు ఇరువైపులా బారికేడ్లు కట్టించి.. వాటికి పరదాలు కట్టించి ఘోషాలో బతికిన సంగతి వారికి గుర్తు లేనట్టుగా ఉంది. చంద్రబాబునాయుడు తన సొంత ఇంటి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తుంటే దానిపై ఇలాంటి చీప్ చవకబారు విమర్శలు చేస్తున్నారు.
ఎమ్మెల్యే పదవిని కూడా వెలగబెట్టిన టీజేఆర్ సుధాకర్ బాబుకు నిర్మాణ పనులు ఎలా జరుగుతాయనే కనీస పరిజ్ఞానం ఉన్నదో లేదో అర్థం కావడం లేదు. పెద్ద భవనాల నిర్మాణాలు జరిగేప్పుడు.. అక్కడి పనులవలన రేగే దుమ్ము, ధూళి ఆ పరిసరాలకు ఇబ్బంది కలిగించకుండా.. నిర్మాణ స్థలం చుట్టూ తాత్కాలిక కంచెలాగా ఏర్పాట్లు చేస్తారు. బాధ్యతగా నిర్మించే వాళ్లు చేసే పని అది. బాధ్యతలేని వ్యక్తులకు బహుశా దాని గురించి తెలియదు.
ప్రజలు ఇచ్చిన పదవిని అనుభవిస్తూ ప్రజల వద్దకు వెళ్లే ప్రతి సందర్భంలోనూ.. ఊర్లలో జనజీవితాన్ని స్తంభింపజేసి, బారికేడ్లు కట్టించి, పరదాలు కట్టించి, రోడ్లపక్కన దుకాణాలు మూయించి.. చెట్లను నరికించి నానా విధ్వంసం సృష్టిస్తూ బతికిన జగన్మోహన్ రెడ్డి అనుచరదళాలకు ఇంటి నిర్మాణానికి జరిగే ఏర్పాట్లు కూడా లోపంగా కనిపించడం వింత కాదు.
చంద్రబాబు ఇంటి శంకుస్థాపనకు మంత్రులకు కూడా ఆహ్వానం లేదు.. అని టీజేఆర్ వాపోతున్నారు. తాడేపల్లిలో జగన్ ఇల్లు కట్టుకున్నప్పుడు.. శంకుస్థాపనకు ఆ పార్టీ నాయకులు ఎందరిని పిలిచారో, ఎందరు వెళ్లారో, టీజేఆర్ కు పిలుపు వచ్చిందో లేదో గుర్తుచేసుకుంటే ఆయనకు సిగ్గుపోతుంది. జగన్ కూడా గృహప్రవేశానికి మాత్రమే పార్టీ వారిని పిలిచారు. శంకుస్థాపన సాధారణంగా ఆర్భాటంగా జరగదు అనే సంగతి కూడా తెలియని వ్యక్తిగా సుధాకర్ బాబు కనిపిస్తున్నారు.
ఈ కుటిలమైన మాటలు గమనిస్తే.. చంద్రబాబునాయుడును ఏదో ఒక విధంగా ఆడిపోసుకోవడానికి, ఆయన మీద అక్కసు కక్కడానికి వీరి ప్రయత్నం కనిపిస్తున్నది తప్ప.. ఆయన చేతల్లో నిందించడానికి ఇంకేం కనిపించక ఇల్లు మీద పడి ఏడుస్తున్నారు తప్ప.. మరొక కారణం లేదని ప్రజలు అంటున్నారు.